నా విజయ రహస్యం ఇదే
విజయం అంతస్తు, గౌరవ మర్యాదలతోపాటు ఆనందాన్ని, అందాన్ని పెంచుతుంది. అందుకే అలాంటి విజయం కోసం పోరాటం. ఈ నిరంతర పోరులో విజయం సాధించిన నటి అనుష్క. తమిళం, తెలుగు భాషల్లో మేటి నటిగా వెలిగిపోతున్న ఈ బ్యూటీ విజయాల బాట వేసిన చిత్రం అరుంధతి అన్నది తెలిసిన విషయమే.
ఆ తరువాత వేట్టైక్కారన్, సింగం, సింగం-2 అంటూ తమిళంలో విజయాలను చవిచూశారు. ప్రస్తుంత రజనీకాంత్ సరసన లింగా, అజిత్‌కు జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతోపాటు తెలుగులో చారిత్రాత్మక చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి చేస్తున్నారు.
నటిగా దశాబ్దం దాటినా విజయపథంలో సాగుతున్న అనుష్క తన సక్సెస్ సీక్రెట్ గురించి వివరిస్తూ తన చిత్రాలు విజయవంతంగా ఆడుతున్నాయని, ఇది సంతోషకరమైన విషయమన్నారు. తన చిత్రాల విజయం కోసం తాను పాటించే మూడు అంశాలు ముఖ్యమయినవన్నారు. వాటిలో ప్రధానమైనది కథ అన్నారు. మంచి కథాంశం ఉన్న చిత్రాలను మాత్రమే అంగీకరిస్తున్నట్లు తెలిపారు. రెండో అంశం కథనం బాగా వచ్చిందా అన్న విషయం గురించి చూస్తానన్నారు.
ఇక మూడో అంశం దర్శకుడు ప్రతిభావంతుడా, కాదా అన్న విషయాన్ని ధృడపరచుకుంటానన్నారు. ఈ అంశాలే తన విజయానికి ప్రధాన అంశాలని అనుష్క వివరించారు. మరో విషయం ఏమిటంటే హీరోయిన్లకు అందం చాలా అవసరం అన్నారు. శరీరాకృతికి కట్టుబాట్లు ఉంచుకోవాలని తెలిపారు. శారీరక అందంతోపాటు మానసిక అందం కూడా అవసరమని చెప్పారు. ఇందుకు శారీరక వ్యాయామం ఎంతో తోడ్పడుతుందని అనుష్క పేర్కొన్నారు.