ఆరోగ్యంగా ఉన్నా : రజనీకాంత్
అభిమానలు కోరుకున్నంత కాలం, నటుడిగా కొనసాగుతానని రజనీకాంత్ అన్నారు. ఇంతకు ముందు ఈ ఇండియన్ సూపర్ స్టార్ గురించి పలు రకాల వార్తలు ప్రచారమయ్యాయి. రజనీ రాజకీయాల్లోకి రావాలని, వస్తున్నారని, భవిష్యత్ రాజకీయాలకు కేంద్ర బిందువు ఆయనేనంటూ ప్రచారాలు విస్తృతంగా సాగారుు. రాజకీయ రంగ ప్రవేశంపై ఒక దశలో రజనీకి ఆయన అభిమానుల ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం రజనీకాంత్ ప్రస్తుతం లింగా చిత్ర షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. పలు విశేషాలతో కూడుకున్న ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం ఒకటి.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, అందాల భామ అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. ఇటీవల రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారని, తూలి కింద పడిపోయారనే వదంతులు ఆయన అభిమానులకు తీవ్ర కలవరం కలిగించాయి. వారి కలతను తీర్చే విధంగా రజనీ గురువారం తన ఆరోగ్యం గురించి, తాను నటిస్తున్న లింగా చిత్రం గురించి వెల్లడించారు. లింగా చిత్ర షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. షూటింగ్‌లో పాల్గొనడానికి రజనీ గురువారం వేకువజామున చెన్నైలో విమానం ఎక్కి మంగళూరు విమానాశ్రయూనికి చేరుకున్నారు. ఆయనని చూసిన అక్కడ పని చేసేవారు తమ స్నేహితులు, సన్నిహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో 20 నిమిషాల్లోనే ఆ ప్రాంతం వందలాది అభిమానులతో కిటకిటలాడింది.
రజనీ దరిచేరాలని, ఆయనతో ఫొటోలు దిగాలని అభిమానులు ప్రయత్నించారు. అయితే విమానాశ్రయ అధికారులు, రజనీ రక్షణ వలయం వారిని నిలువరించింది. అనంతరం రజనీ విలేకరులతో ముచ్చటిస్తూ కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో చాలా నీరసించానన్నారు. భగవంతుని దయవల్ల, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనా ఫలం కారణంగా తనకు పునర్జన్మ కలిగిందన్నారు. ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఎలాంటి సమస్యలేదని యథాతథంగా షూటింగ్‌లో పాల్గొంటున్నానని చెప్పారు.
లింగా షూటింగ్ కోసం మంగుళూర్ దాని పరిసర కొండ ప్రాంతాలకు రావడం సంతోషంగా ఉందన్నారు. మంగుళూర్ చాలా సుందరమైన నగరంగా పేర్కొన్నారు. ఇక్కడ 50 రోజుల వరకు బస చేసి లింగా షూటింగ్‌లో పాల్గొంటానన్నారు. తన అభిమానులు కోరుకున్నంత వరకు నటిస్తానని చెప్పారు. లింగా చిత్రం అభిమానులకు తన పుట్టిన రోజు కానుకగా ఉంటుందని రజనీ వెల్లడించారు.