మల్లిక ‘నమో’స్తుతి!
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై యువకులు, విద్యార్థులేకాదు బాలీవుడ్ కథానాయికలు కూడా అభిమానం చూపిస్తున్నారు. ఆయన అభిమానుల జాబితాలో తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ చేరింది. ఈ సుందరి త్వరలో ఓ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ షోలో నరేంద్ర మోడీ పాల్గొంటే ఆయన కోసం ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించింది.
మోడీని ‘పర్‌ఫెక్ట్ బ్యాచిలర్’గా, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా మల్లిక అభివర్ణించింది. లైఫ్ ఓకే చానల్‌లో ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ‘ద బ్యాచిలరెట్ ఇండియా- మేరే ఖయాలోంకీ మల్లిక’ రియాల్టీ షో ద్వారా జీవిత భాగస్వామిని ఎం పిక చేసుకుంటుందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మోడీ గురిం చి వ్యాఖ్యలు చేయడం విశేషం.
స్వచ్ఛమైన ప్రేమ కోసమే...
జీవిత భాగస్వామి కోసం రియాల్టీ షోలో పాల్గొనడం లేదని, కేవలం స్వచ్ఛమైన ప్రేమకోసమే షోలో పాల్గొంటున్నానని చెప్పింది మల్లిక. రియాల్టీ షోలో ఇప్పటిదాకా రాహుల్ మహాజన్ మినహా మరెవరూ పెళ్లి చేసుకోలేదని, తాను కూడా జీవిత భాగస్వామి కోసం కాకుండా నిజమైన ప్రేమ కోసం ఈ షోలో పాల్గొంటున్నట్లు చెప్పింది. అయితే ఈ షోలో ప్రేక్షకులు చూసేదంతా నిజమేనని, అందులో ముం దుగా ప్లాన్ చేసుకొని, రిహార్సల్స్ చేసి నటిస్తున్నదేమీ లేదని తెలిపింది.
భారతీయుడినే పెళ్లాడతా...
మల్లిక తరచూ అమెరికాకు వెళ్తోందని, అక్కడే ఎవరితోనో ప్రేమలో పడిందని, అతణ్నే పెళ్లి చేసుకుంటుందని మీడియాలో వచ్చిన కథనాలపై స్పందిస్తూ... విదేశీయుల్లో మానవత్వ విలువలు తక్కువే. అందుకే భారతీయుడినే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాని చెప్పింది. అంతేకాక సినీ పరిశ్రమకు దూరంగా ఉండే సామాన్య వ్యక్తినే పెళ్లాడతానని తెలిపింది.