
కంగనా రనౌత్ అద్భుతమైన నటి. ‘తను వెడ్స్ మను, క్వీన్, మణికర్ణిక’ వంటి చిత్రాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు నిర్మాతగా తొలి అడుగు వేశారామె. ‘అపరాజిత అయోధ్య’ పేరుతో సినిమా నిర్మించనున్నట్లు కంగనా ప్రకటించారు. అయోధ్య రామ మందిరం–బాబ్రీ మసీదు భూ వివాదం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘‘1980లలో పుట్టిన అమ్మాయిగా నేను ఈ భూ వివాదం గురించి వింటూ పెరిగాను. ఈ కేసు భారత రాజకీయాలపై చాలా ప్రభావం చూపించింది. ఇటీవల వచ్చిన తీర్పు ఈ వివాదానికి ముగింపు పలికింది
. ‘అపరాజిత అయోధ్య’లో కథానాయకుడు ముందు నాస్తికుడు.. ఆ తర్వాత ఆస్తికుడు. ప్రధానంగా ఈ అంశం మీద సినిమా ఉంటుంది. ఈ పాయింట్ నా వ్యక్తిగత జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే నిర్మాతగా నా తొలి సినిమాకి ఈ కథ కరెక్ట్ అనుకున్నాను’’ అని కంగనా ఓ ప్రకటనలో చెప్పారు. అయితే ఈ చిత్రంలో తను నటిస్తుందా? లేదా అనేది మాత్రం కంగనా చెప్పలేదు. ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’, ‘భజ్‌రంగీ భాయ్‌జాన్’, ‘మణికర్ణిక’ వంటి భారీ చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి రచయిత.
Comments
Please login to add a commentAdd a comment