రోజుకో సినిమా చూసి గానీ పడుకునే వాన్ని కాదు: నిర్మాత | Producer Venkata Sambi Reddy About Gangs Of 18 Movie | Sakshi
Sakshi News home page

Gangs Of 18 Movie: రోజుకో సినిమా చూసి గానీ పడుకునే వాన్ని కాదు: నిర్మాత

Published Mon, Jan 24 2022 3:42 PM | Last Updated on Mon, Jan 24 2022 4:01 PM

Producer Venkata Sambi Reddy About Gangs Of 18 Movie - Sakshi

మలయాళ సూపర్​స్టార్​ మమ్ముట్టి, ఆర్య, పృథ్వీరాజ్​ సుకుమారన్, ప్రియమణి​ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'పడి నెట్టం పడి'. శంకర్​ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని 'గ్యాంగ్స్​ ఆఫ్​ 18' పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ నెల 26న తెలుగులో గ్రాండ్​గా విడుదల కానుంది ఈ సినిమా. ఈ సందర్భంగా ఈ మూవీ విశేషాలను పంచుకున్నారు నిర్మాత గుదిబండ వెంకట సాంబి రెడ్డి.

సినిమాపై ఆసక్తితో..
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థలు స్థాపించాను. సినిమా రంగంలోకి రావాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. అందులో భాగంగానే తొలి సినిమాగా 'పండుగాడి ఫొటోస్టూడియో' చిత్రం నిర్మించాను. దాని తర్వాత ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ 18’ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 26న సినిమాను గ్రాండ్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ చేస్తున్నాం.

సందేశాత్మకంగా ఉంటుంది..
మీరు గమనించినట్లయితే ‘'గ్యాంగ్స్‌ ఆఫ్‌ 18' సినిమాకు 'నా స్కూల్‌ డేస్‌' అనే ట్యాగ్‌లైన్‌తోనే సినిమా స్టోరి ఏంటో చెప్పాం. స్టూడెంట్‌ దశ గురించి ఈ చిత్రంలో దర్శకుడు చాలా చక్కగా చూపించారు. విద్యార్థులకు సరైన గురువు దొరికితే వాళ్ల జీవితం ఎలా మారుతుంది. జీవితంలో వాళ్లు ఎంత ఎత్తుకు ఎదగగలరు అనే చక్కటి సందేశం ఈ సినిమాలో ఉంటుంది. అలాగే ప్రభుత్వ కళాశాలకు చెందిన స్టూడెంట్స్‌ను కార్పొరేట్‌ విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్స్‌ చిన్న చూపు చూడటం. 

ఇలాంటి క్రమంలో ఒక ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మంత్రితో పందెం కట్టడం ఆ విద్యార్థులు ఆ పందెంలో ఎలానెగ్గారు. చివరికి ఆ మంత్రి ఏం చేశాడు. అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో కొత్తగా, ఎక్కడా బోర్‌ కొట్టకుండా దర్శకుడు మలిచిన తీరు అత్యద్భుతం అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇక ఆచార్యుని పాత్రలో మమ్ముట్టి గారు అద్భుతమైన నటన కనబరిచారు. అతను స్టూడెంట్స్‌ని ఇన్‌స్పైర్‌ చేసే విధానం గానీ, వారి అభివృద్దికి తోడ్పడే అంశాలుగానీ నిజ జీవితంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్‌తో పాటు ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కచ్చితంగా చూసి తీరాల్సిన అవసరం ఉంది.

ఆ అంశాలు అదనపు ఆకర్షణ
వర్షంలో వచ్చే బస్సు ఫైట్‌, సైకిల్‌ మీద ఫైట్‌ అలాగే ఏఆర్‌ రహమాన్‌ మేనల్లుడు ఏహెచ్‌ కాశీఫ్‌ అద్భుతమైన ఐదు పాటలు కంపోజ్‌ చేశారు. ప్రతి పాట ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఇప్పటికే ఒక పాట రిలీజ్‌ చేశాం. యూట్యూబ్‌లో ఆ సాంగ్‌ చాలా బాగా ట్రెండ్​ అవుతోంది. సంగీతంతో పాటు సినిమాటోగ్రఫీ, దర్శకుడి టేకింగ్‌, మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్‌ నటన సినిమాకు హైలెట్‌గా నిలిచే అంశాలు. అలాగే బాహుబలి చిత్రానికి పని చేసిన కెచ్చ ఈ చిత్రానికి  అద్భుతమైన ఫైట్స్‌ కంపోజ్‌ చేశారు. ఈ ఫైట్స్‌ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.

తెలుగు సినిమాలానే..
చైతన్య ప్రసాద్‌, శ్రేష్ణ, కృష్ణ మాదినేని ఇందులో పాటలు రాశారు. అలాగే మైథిలి కిరణ్‌, దీపిక రావ్‌ సంభాషణలు సమకూర్చారు. అందరూ కలిసి డబ్బింగ్‌ సినిమాలా కాకుండా తెలుగు స్ట్రయిట్‌ సినిమాలా ఎంతో క్వాలిటీ వర్క్‌ ఇచ్చారు.

మా బ్యానర్​లో మరిన్ని..
ప్రస్తుతం తెలుగులో ఒక స్ట్రయిట్‌ ఫిలిం ప్లాన్‌ చేశాను. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. అలాగే వెబ్‌ సిరీస్‌ కూడా తీయాలన్న ఆలోచన ఉంది. ఇలా కంటిన్యూయస్‌గా మా బ్యానర్​లో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

రోజుకో సినిమా చూసి..
పడుకునే ముందు రోజుకో సినిమా చూసి కానీ పడుకోను. ఇటీవల ఓటీటీ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌లు చాలా చూస్తున్నా. యంగ్‌ జనరేషన్‌ అంతా మంచి కథాంశంతో వస్తున్నారు. కచ్చితంగా న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తాను.

మంచి ఆడియో ఉండేలా..
ఏ జానర్‌ తీసుకున్నా కూడా కథ, కథనాలు ఆసక్తికరంగా, బోర్‌ కొట్టించకుండా, తర్వాత ఎలా ఉంటుంది? అనేలా ఉండాలి. అప్పుడే నాకు ఆ సినిమా నచ్చుతుంది. నాకు మాత్రమే కాదు ప్రేక్షకులు అంతా కూడా ఇలా ఉంటేనే ఇష్టపడారు. కాబట్టి మంచి స్క్రిప్ట్‌, చక్కటి సన్నివేశాలు, ఆకట్టుకునే పాటలు ఉంటే సినిమా కచ్చితంగా సక్సెస్‌ అవుతుంది. ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఒక్క పాట హిట్‌ అయినా ఆ సినిమా ఎక్కడికో వెళ్తుంది. మా తదుపరి సినిమాల్లో మంచి ఆడియో ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నాం.

చివరిగా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ 18’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. తమ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని వెంకట సాంబిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement