విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?! | Arbaaz Khan Comments On Divorce With Malaika Arora | Sakshi
Sakshi News home page

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

Jul 19 2019 7:41 PM | Updated on Jul 19 2019 8:04 PM

Arbaaz Khan Comments On Divorce With Malaika Arora - Sakshi

దంపతులుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా తామెప్పుడూ కలిసే ఉంటామని బాలీవుడ్‌ నటుడు అర్భాజ్‌ ఖాన్‌ అన్నాడు. పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ బాలీవుడ్‌ జంట మలైకా అరోరా- అర్బాజ్‌ ఖాన్‌ 2017లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ విడాకులు, కొత్త బంధాల గురించి అర్భాజ్‌ మాట్లాడుతూ... డైవోర్స్‌ తీసుకున్న తర్వాత కూడా మలైకా, ఆమె కుటుంబ సభ్యులతో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నాడు. ఇప్పటికీ తామిద్దరం స్నేహితులుగా మెలగడానికి తమ కుమారుడే ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు.

విడిపోయినంత మాత్రాన మలైకాను ద్వేషించాలా?
‘ చాలా ఏళ్లపాటు మేము కలిసి ఉన్నాం. ప్రస్తుతం మలైకా, నేను ఒకే కప్పు కింద లేనప్పటికీ ఒకరి మంచి ఒకరం కోరుకుంటాం. అన్ని విధాలుగా ఆలోచించుకున్న తర్వాతే విడిపోవాలని నిర్ణయించుకున్నాం కాబట్టి పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. ఒకరినొకరు గౌరవించుకునే మానసిక పరిపక్వత మాకు ఉంది. నిజానికి ఇప్పటికీ మా మధ్య అనుబంధం కొనసాగడానికి అర్హానే కారణం. పెద్దవుతున్నా కొద్దీ వాడు మా గురించి పూర్తిగా అర్థం చేసుకుంటాడు. విడాకులు తీసుకున్నంత మాత్రాన మాజీ జీవిత భాగస్వామి పట్ల ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మలైకా, నేను సఖ్యతతో మెలుగుతూ మా జీవితాల్లో ముందుకు సాగుతున్నాం’ అని అర్భాజ్‌ వ్యాఖ్యానించాడు. కాగా మలైకా ప్రస్తుతం  యువ నటుడు అర్జున్‌ కపూర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండగా.. అర్భాజ్‌ ఓ ఇటాలియన్‌ మోడల్‌తో డేటింగ్‌ చేస్తున్నాడు. ఇరు జంటలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూంటాయన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement