రాంకీ
‘‘మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. నేనే మొదటి వ్యక్తిని. ఫిల్మ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుని వచ్చాక నేను చేసిన ఎనిమిది సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. వంద రోజులు కూడా ఆడాయి. కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలో అప్పుడు నాకు తెలియలేదు. అందుకే హీరోగా ఎక్కువ సినిమాలు చేయకలేకపోయా’’ అన్నారు ‘సింధూర పువ్వు’ ఫేమ్, నటుడు రాంకీ. కార్తికేయ, పాయల్ రాజపుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ‘ఆర్‌ఎక్స్ 100’ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన రాంకీ సోమవారం మీడియాతో మాట్లాడారు.
► ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాలో నేను నటించడానికి ముఖ్య కారణం కథే. డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెన్నై వచ్చి నన్ను కలిశారు. కథ విన్నా. బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా. అందరూ అనుకున్నట్లు ఈ సినిమాలో నేను హీరోకి తండ్రిగా నటించలేదు. ఈ చిత్రంలో నాకు పెళ్లే కాదు. హీరో కోసం, అతని లైఫ్ కోసం నా పాత్ర అంకితం అయిపోతుంది. నిజంగా ఇది గొప్ప పాత్ర.
► నేను ఇండస్ట్రీకొచ్చిన 30 ఏళ్లలో వందకు పైగా చిత్రాల్లో నటించా. కొందరు డైరెక్టర్లు ఒకటి చెప్తారు ఇంకోలా తీస్తారు. కానీ, అజయ్ మాత్రం ఏం చెప్పారో దాని కన్నా బాగా తీశారు. ఒక్క సీన్ కోసం ఐదు కెమెరాలు వాడిన సందర్భాలూ ఉన్నాయి. నటీనటుల నుంచి బాగా నటన రాబట్టుకున్నారాయన. నిజానికి ఈ సినిమా కోసం నేను కూడా ఓ కొత్త నటుడిలా మారిపోయా.
► ఎనిమిదేళ్లుగా తమిళంలో ఏ సినిమా చేయలేదు. నాకు డైరెక్షన్ అంటే బాగా ఆసక్తి. అందుకే డైరెక్షన్, ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. నేను చేసిన కొన్ని సీరియల్స్ బాగా హిట్ అయ్యాయి కూడా. ‘ఆకతాయి’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చా. ఆ చిత్రం తర్వాత ‘ఆర్‌ఎక్స్ 100’లో చేశా.
► ప్రస్తుతానికి నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. రజనీకాంత్, కమల్‌హాసన్‌గార్లు ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాల్లోకి వస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రం తర్వాత తెలుగులో ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదు. నాకు సరిపోయే ఏ పాత్ర అయినా చేస్తాను. అది విలన్‌గానా, మరొకటా అన్నది ముఖ్యం కాదు.
Comments
Please login to add a commentAdd a comment