
ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరి, గోవిందా గోవిందా... శ్రీదేవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఈ మూడు చిత్రాలకూ ప్రత్యేకమైన స్థానం ఉంది. వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ చిత్రాలను నిర్మించిన అశ్వినీదత్ ముంబై వెళ్లి, శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషీ ఎలా ఉన్నారు? అని అడిగిన ‘సాక్షి’తో ‘‘పిల్లల ముఖాలు చూడలేకపోయాను. ఆ కుటుంబం మొత్తం బాధలో ఉంది. శ్రీదేవి మరణం ఆ కుటుంబానికే కాదు.. అందరికీ పెద్ద షాక్’’ అన్నారు. శ్రీదేవి ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టేనా? ఎప్పుడైనా నిర్మాతలను ఇబ్బందిపెట్టారా? అని అడిగితే – ‘‘హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్.
అందుకు ఉదాహరణగా ఒకే ఒక్క సంఘటన చెబుతాను. ‘గోవిందా గోవిందా’ షూటింగ్ తిరుపతిలో జరిగినప్పుడు ఒకరోజు తెల్లవారుజాము నాలుగు గంటలకు లోబీపీతో శ్రీదేవి పడిపోయింది. అప్పుడు పెదవి పగిలి, రక్తం వచ్చింది. నేను చాలా కంగారుపడి, వెంటనే మద్రాసులో మంచి హాస్పటల్‌కి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాను. కానీ షూటింగ్ డిస్ట్రబ్ అవుతుందని తిరుపతిలో ఓ లోకల్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేయించుకుని షూటింగ్ చేసింది. పెదవి వాపు కనపడనివ్వకుండా మేకప్‌తో మేనేజ్ చేసింది. చాలా డిగ్నిఫైడ్‌గా ఉండేది. ఎన్టీఆర్‌గారు ఎంత డిగ్నిఫైడ్‌గా ఉండేవారో శ్రీదేవి అలా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే తను ‘లేడీ ఎన్టీఆర్’. ఆమెలాంటి హీరోయిన్స్‌ని చూడలేం’’ అన్నారు.
పారితోషికం విషయంలో పట్టూవిడుపుగా ఉండేవారా? డిమాండ్ చేసేవారా? అన్న ప్రశ్నకు – ‘‘అసలు ఆ విషయాలేవీ శ్రీదేవికి తెలియదు. అంతా వాళ్ల అమ్మగారే చూసుకునేవారు. చెప్పిన టైమ్‌కి షూటింగ్‌కి రావడం, ఇబ్బంది పెట్టకుండా నటించడం.. ఇదే శ్రీదేవికి తెలుసు. ఆ క్రమశిక్షణే తనను పెద్ద స్థాయికి తీసుకెళ్లింది. ఎంత పెద్ద రేంజ్‌కి వెళ్లినా ఒదిగి ఉన్న హీరోయిన్. హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాక అక్కడ బిజీగా ఉన్నా నేను అడగ్గానే కాదనకుండా ‘ఆఖరి పోరాటం’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలు చేసింది. ఆ రెండూ మా వైజయంతీ మూవీస్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యాయి. ఆ తర్వాత చేసిన ‘గోవిందా గోవిందా’ కూడా సూపర్ హిట్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment