వర్మ ఏం చెప్పారంటే..
చిత్రం: ఎటాక్, తారాగణం: మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్‌రాజ్, మంజుభార్గవి, రచన: సమీర్ చంద్ర, పాటలు: సిరాశ్రీ, కెమేరా: అంజి,
సంగీతం: రవిశంకర్, నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్, తేజ, సి.వి.రావు, కథ-స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ
దర్శకుడెవరన్నదాన్ని బట్టి సిన్మా ఎలా ఉంటుందో ఒక ఊహ, అంచనా వస్తాయి. అందుకే, ‘ఎటాక్’ సిన్మాపై ఆసక్తి. కథగా - ‘ఎటాక్’ చాలా చిన్న పాయింట్! ఒక కుటుంబం లోని పెద్దపై జరిగిన ఎటాక్‌కు అతని కుమారుడు ప్రతీకారం తీర్చుకోవడం! వివరంగా చెప్పాలంటే... గురురాజ్ (ప్రకాశ్‌రాజ్) ఒకప్పుడు రౌడీలీడర్. కానీ, ఆ తరువాత అవన్నీ వదిలేసి, భవన నిర్మాణ రంగంలో గడుపుతుంటాడు. అతనికి భార్య (మంజుభార్గవి), ముగ్గురు కొడుకులు - కాళీ (జగపతి బాబు), గోపి (వడ్డే నవీన్), రాధాకృష్ణ (మంచు మనోజ్).
ఒక స్థలం విషయంలో వచ్చిన తగాదా నేపథ్యంలో గుడి నుంచి వస్తున్న గురురాజ్ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేయించారో అర్థం కాని పరిస్థితుల్లో ప్రతీకారానికి దిగిన అతని పెద్దకొడుకూ చనిపోతాడు. ఈ వ్యవహారంలో రౌడీ గ్యాంగ్ (అభిమన్యు సింగ్, పూనవ్‌ు కౌర్) చురుకుగా పాల్గొంటారు. స్థలం తగాదా ఉన్నవాళ్ళే ఈ హత్యలు చేశారా, మరొకరా అన్నది సస్పెన్‌స. దాన్ని హీరో ఎలా కనిపెట్టా డనేది పెద్దగా లేకున్నా, ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.
హాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’తో బాగా ప్రభా వితమైన వర్మకు ఇలాంటి గ్యాంగ్ వార్‌లు, పగలు, ప్రతీకారాలు ఇష్టమైన ముడి సరుకులు. వాటినెలా వండి వడ్డించాలన్నది ఆయనకు అనుభవైకవేద్యం. ‘గాయం’ రోజుల నుంచి ‘సర్కార్’ మీదుగా నిన్నటి మోహన్‌బాబు ‘రౌడీ’ దాకా ఆ ఫార్ములా వీలైనంత వాడారు. చాలాసార్లు సక్సెసూ సాధించారు. ఈసారి ఫ్లైకామ్ లాంటి ఆధునిక కెమేరా జ్ఞానం, ‘రక్తచరిత్ర’ నుంచి అందుకున్న చిత్రమైన నేపథ్య సంగీతం, పాటలతో తెరకెక్కించారు.
మంచితనానికీ, చెడ్డతనానికీ మధ్య తేడా వివరిస్తూ, ‘దానవీరశూర కర్ణ’, ‘సంపూర్ణ రామాయణం’ లాంటి సిన్మాల సీన్లతో, పాటతో ‘ఎటాక్’ మొదలవుతుంది. ఆరంభంలోనే వచ్చే ప్రకాశ్‌రాజ్ హత్య ఘట్టం చాలా ఉద్విగ్నంగా ఉంటుంది. ‘నాన్న గారు ఏం చెప్పారంటే...’ అంటూ పదే పదే ఫ్లాష్‌బ్యాక్ సీన్‌సకి వెళుతూ కథ సాగుతుంది. క్రమంగా 107 నిమిషాల నిడివిలో ‘నేరాలు- ఘోరాలు’ ఎపిసోడ్ చూసిన భావన కలుగు తుంది. ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు, వడ్డే నవీన్ లాంటి సీజన్‌డ ఆర్టిస్టులున్నారు. వారిని మరింత ఉపయోగించుకొనే సీన్‌స ఇంకా ఉండాలనిపిస్తుంది. మనోజ్ చేసినపాత్ర సెకండాఫ్‌లో విజృంభిస్తుంది. వెరసి, ఇది వర్మ మార్‌క ‘ఎటాక్’.