‘మగధీర’ను క్రాస్ చేసింది!
‘మగధీర’ను క్రాస్ చేసింది!
Published Tue, Oct 22 2013 1:10 AM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM
‘‘ఈ చిత్రానికి నేను నిర్మాత అవ్వడం నా అదృష్టం. ఇంత మంచి చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చిన హీరో, దర్శకుడికి నా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు డబుల్ థ్యాంక్స్’’ అన్నారు బీవీయస్‌యన్ ప్రసాద్. పవన్‌కల్యాణ్, సమంత, ప్రణీత నాయకా నాయికలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘అత్తారింటికి దారేది’ విడుదలై, 25 రోజులైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ -‘‘ఇండస్ట్రీ హిట్ సాధించిన ‘మగధీర’ నిర్మాణంలో నాకూ ఓ భాగం ఉంది.
ఇప్పుడు నిర్మించిన ‘అత్తారింటికి దారేది’ కొన్ని ఏరియాల్లో ‘మగధీర’ను క్రాస్ చేసింది. మిగతా ఏరియాల్లో కూడా అధిగమిస్తుందనే నమ్మకం ఉంది. అన్ని థియేటర్లలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. కచ్చితంగా వంద కోట్లు చేసే అవకాశం ఉందనిపిస్తోంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ -‘‘ఈ సినిమా విడుదలకు ముందే పైరసీకి గురైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఘనవిజయం సాధించడం ఆ భగవంతుడు మాకిచ్చిన బహుమతి. 50 రోజుల్లో వస్తాయనుకున్న వాసూళ్లు 25 రోజులకే రావడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది నంబర్‌వన్ హిట్ అని చెబుతున్నారు. ఈ చిత్ర హీరో, దర్శక, నిర్మాతలు చాలా మంచివాళ్లు. వాళ్ల కోసమే ఈ సినిమా విజయం సాధించాలని కోరుకున్నా. నా సొంత సినిమాలా భావించి చేశా. ఇంతటి సూపర్‌హిట్ మూవీలో నటించడం నా లక్‌గా భావిస్తున్నా.
త్రివిక్రమ్‌గారు బెస్ట్ రైటర్ మరియు బెస్ట్ డెరైక్టర్. హీరో, నిర్మాతతో ఎలా ప్రవర్తిస్తారో హీరోయిన్, ఇతర యూనిట్ సభ్యులతోనూ అలానే ఉంటారు. ఇందులో పవన్ నన్ను ఓ పాటలో వళ్లో కూర్చొబెట్టుకుంటారు. ఆ సీన్ గురించి త్రివిక్రమ్ చెప్పగానే, మరో మాట మాట్లాడకుండా చేశారు. అలాగే ఆడియో వేడుకలో పవన్ నన్ను అభినందించినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే, ఆయన ఎవర్నీ పొగడరు. అలాంటి పవన్ నన్ను అభినందించడం విని, నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి’’ అని చెప్పారు.
Advertisement
Advertisement