
సౌందర్య సంచలనం ఎంజిలినా జోలీ ఆత్మకథ సిద్ధం
వెండితెర రారాణి ఎంజిలినా జోలీ ఒక నిలువెత్తు కవిత వంటిది అంటారు కోటానుకోట్ల మంది ఆమె అభిమానులు.
వెండితెర రారాణి ఎంజిలినా జోలీ ఒక నిలువెత్తు కవిత వంటిది అంటారు కోటానుకోట్ల మంది ఆమె అభిమానులు. సెల్యులాయిడ్ మీదే కాదు, నిజజీవితంలో కూడా ఆమె కథానాయికే. ఇటీవల తనకు జరిగిన రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ విషయంలో కూడా ఎంజిలినా ప్రదర్శించిన దైర్యం, ఎన్నో అపోహలతో కుంగిపోయే సాటి మహిళలకి ఆమె అందించిన స్ఫూర్తి. దాంతో ఆమెని మరింత ఆరాధ్యంగా చేశాయి.
అటువంటి సౌందర్య సంచలనం, అపురూపమైన నటి ఆత్మకథ మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో ఊహించవచ్చు. ఎంజిలినా తన ఆత్మకథ రాయడం అయిపోయిందని, ప్రస్తుతం సరైన పబ్లిషర్ అన్వేషణలో ఉందని ఒక ఇంటర్నెట్ పత్రిక తాజాగా ప్రకటించింది. ఆత్మకథ ప్రచురణ లావాదేవీ 30 మిలియన్ పౌండ్లు (మూడు కోట్ల బ్రిటీష్ పౌండ్లు - అంటే 298 కోట్ల రూపాయలు) పైమాటేనని ఆ పత్రిక పేర్కొంది.
దాని ప్రకారం, ఎంజిలినాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి మూడు అమెరికన్ పబ్లిషింగ్ సంస్థలు పోటీపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆమెకి ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఎవరు ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంటారో వాళ్ల పంట పండినట్లేనని, బంగారు గని దొరికినట్ట్లేనని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఆమె ఆత్మకథే ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లర్ కావడం ఖాయమని ఊహాగానాలు సాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఎంజిలినా తన కథని ప్రపంచానికి చెప్పాలని నిశ్చయించుకుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దాపరికాలు లేని ఎంజిలినా తన కథ చెప్పాలనే అనుకుందని, అయితే, ఇదే తగిన సమయమని ఇప్పుడు తీర్మానించుకుందని ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు.