పెట్టుబడి తిరిగొస్తే చాలు
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు వంద రోజులు ఆడాలని ఆశించడం అత్యాశే అవుతుంది. నిర్మాతలు పెట్టిన డబ్బు తిరిగి వస్తే చాలు అన్న పరిస్థితి నెలకొంది అని సీనియర్ నటుడు,దర్శకుడు కె.భాగ్యరాజ్ వ్యాఖ్యానించారు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అయ్యనార్ వీధి. యువ కథానాయకుడిగా యువన్ నటించిన ఈ చిత్రంలో షారాశెట్టి నాయకిగా నటించారు. శ్రీ సాయి షణ్ముగర్ పిక్చర్స్ పతాకంపై సెంథిల్‌వేల్, ఆయన మిత్రుడు విజయ్‌శంకర్ కలిసి నిర్మిస్తున్నారు.
జిప్సీ ఎన్.రాజ్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రానికి యూకే.మురళి సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ.స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కే.భాగ్యరాజ్ మాట్లాడుతూ తానీ చిత్రంలో నటిస్తున్న సమయంలో నిర్మాతలోని వేగాన్ని చూశానన్నారు. సాధారణంగా సినిమా భాగస్వామ్యానికి ఎవరూ ముందుకు రారన్నారు. అలాంటిది ఈ చిత్ర నిర్మాతకు ఆయన స్నేహితుడు విజయ్‌శంకర్ సహ నిర్మాతగా అండగా నలిచారని అభినందించారు.
ఇకపోతే తానీ చిత్రంలో నటించిన తరువాతనే అయ్యనార్ల గురించి పూర్తిగా తెలుసుకున్నానని చెప్పారు. ఇందులో 108 మంది అయ్యనార్ల గురించి ఒక పాటు ఉంటుందన్నారు. ఈ రోజుల్లో చిత్ర వందరోజులు ఆడాలని, పెద్ద విజయం సాధించాలని ఆశించడం హాస్యాస్పదమే అవుతుందన్నారు. అందువల్ల ఈ చిత్రానికి నిర్మాతలు పెట్టిన డబ్బు తిరిగి వస్తే చాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పెట్టుబడి తిరిగొస్తేనే నిర్మాతలు బయట పడతారన్నారు. మరిన్ని చిత్రాలు నిర్మించడానికి వారికి ధైర్యం వస్తుందని, అప్పుడే పలువురికి ఉపాధి కల్పిస్తారని భాగ్యరాజ్ పేర్కొన్నారు.