వివాదంలో అజర్ సినిమా
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అజర్ సినిమా వివాదాస్పదమవుతోంది. ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్గా సేవలందించిన అజర్ జీవితంలో సినిమాను తలపించే ఎన్నో మలుపులున్నాయి. భారీ విజయాలు, వివాదాలు, ప్రేమ వ్యవహారాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఉండటంతో అజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
అజరుద్దీన్ స్క్రీప్ట్ను ఓకె చేశాకే ఈ సినిమాను పట్టాలెక్కించినట్టుగా చెపుతున్నారు చిత్రయూనిట్. టోని డిసౌజా దర్శకత్వంలో శోభా కపూర్, ఏక్తా కపూర్లు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అజర్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన సమయంలో మనోజ్ ప్రభాకర్ కీలక సాక్షిగా వ్యవహరించాడు. అయితే అజర్ సినిమాలో మనోజ్ పాత్రను నెగెటివ్గా చిత్రీకరించారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో సినిమా రిలీజ్కు ముందే తనకు స్పెషల్ షో వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనోజ్ ప్రభాకర్తో పాటు మరికొంత మంది క్రీడాకారులు కూడా అజర్ సినిమా స్పెషల్ షో కోసం పట్టు పడుతున్నారు. వీరితో పాటు అజర్ భార్య సంగీత బిజీలాని కూడా తన పాత్రను ఎలా చూపించబోతున్నారో అన్న అనుమానం వ్యక్తం చేసింది. చిత్రయూనిట్ స్పెషల్ షోకు అంగీకరించకపోవటంతో మనోజ్ సహా మిగతావారు చట్ట పరమైన చర్యలకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.