
రూ. 100 కోట్లు దాటిన 'బాహుబలి' కలెక్షన్స్
హైదరాబాద్: బాక్సాఫీస్ ను 'బాహుబలి' షేక్ చేస్తున్నాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబడుతోంది. తొలి రెండు రోజుల్లోనే వసూళ్లు రూ. 100 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. సుమారు రూ. 135 కోట్లు రాబట్టినట్టు సమాచారం.
తొలిరోజు కలెక్షన్ రూ.68.5 కోట్ల నుంచి రూ.76 కోట్ల మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది వచ్చిన షారూఖ్ ఖాన్ మూవీ 'హ్యాపీ న్యూ ఇయర్' వసూలు చేసిన రూ. 45 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్ ను 'బాహుబలి' అధిగమించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్ రూ. 30 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో రెండు రోజుల్లో రూ.10.25 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లోనూ 'బాహుబలి' ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 10.50 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఓవర్ సీస్ మార్కెట్ లోనూ 'బాహుబలి' రికార్డు బద్దలు కొడుతున్నాడు. అమెరికాలో సుమారు రూ. 23 కోట్లు, ఆస్ట్రేలియాలో దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక మూడు రోజుల వసూళ్లు రూ. 150 కోట్లుకు చేరినట్టు తెలుస్తోంది.