బాహుబలి ఓ లెక్కా.. మాది 5000 కోట్లు! | baahubali did not topple any record, mine is great, says filmmaker anil sharma | Sakshi
Sakshi News home page

బాహుబలి ఓ లెక్కా.. మాది 5000 కోట్లు!

Published Tue, May 23 2017 2:24 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

బాహుబలి ఓ లెక్కా.. మాది 5000 కోట్లు!

బాహుబలి ఓ లెక్కా.. మాది 5000 కోట్లు!

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2 సినిమా రూ. 1500 కోట్ల వసూళ్లు సాధించినా, బాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు అనిల్‌ శర్మకు మాత్రం అది పెద్ద గొప్ప లెక్కలా ఏమీ కనిపించడం లేదు. 2001లో వచ్చిన గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ, 2007 నాటి అప్నే, 2010 నాటి వీర్‌, 2013 నాటి సింగ్‌ సాబ్‌ ద గ్రేట్‌ లాంటి సినిమాలు ఆయనే తీశారు. అయితే, ఇటీవల బాహుబలి-2 సినిమా బాక్సాఫీసు వసూళ్ల గురించి ఆయన దగ్గర మీడియా ప్రస్తావించినప్పుడు ఆయన తేలిగ్గా కొట్టి పారేశారు. సన్నీ డియోల్‌తో తాను తీసిన గదర్‌ సినిమాతో పోలిస్తే ఇవి పెద్ద వసూళ్లే కావని ఆయన వ్యాఖ్యానించారు. కాకపోతే అప్పటి కాలం, అప్పటి టికెట్‌ ధరలు, నాటి డబ్బు విలువ అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.

దాదాపు 16 ఏళ్ల క్రితం ఆయన తీసిన గదర్‌ సినిమా అప్పుడే 265 కోట్ల బిజినెస్‌ చేసింది. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే దాని విలువ దాదాపు రూ. 5000 కోట్ల వరకు ఉంటుందని ఆయన అన్నారు. గదర్‌ సినిమా వచ్చినప్పుడు టికెట్‌ ధర కేవలం రూ. 25 మాత్రమే ఉండేదని, ఆ లెక్కన ఇప్పటి టికెట్‌ ధరలు, ద్రవ్యోల్బణం కలిపి లెక్కేసుకుంటే అప్పటి రూ. 265 కోట్లు ఇప్పటికి రూ. 5000 కోట్ల లెక్క అవుతుందని ఆయన వివరించారు. అందువల్ల ఇప్పటివరకు బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొట్టినట్లేమీ కాదని తేల్చి చెప్పేశారు.

మంచి సినిమాలు ఎప్పుడూ రికార్డులను బద్దలుకొడతాయని, అయితే బాహుబలి2 మాత్రం ఎలాంటి రికార్డులూ బద్దలుకొట్టలేదని అనిల్‌ శర్మ అన్నారు. తనను ఈ విషయాలన్నింటిలో ఇరికించవద్దని, మంచి సినిమాలు వస్తే రికార్డులు ఆటోమేటిగ్గా బద్దలవుతాయని తెలిపారు. ఆయన ప్రస్తుతం తన కొడుకు ఉత్కర్ష్‌ హీరోగా వస్తున్న తొలి సినిమా జీనియస్‌ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. కాగా ఇప్పటివరకు బాహుబలి-2 హిందీ వెర్షన్‌కు రూ. 478 కోట్ల వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ విడుదల చేసిన ఈ సినిమా ఆమిర్‌ ఖాన్‌ తీసిన దంగల్‌ కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement