రమేష్ వర్మ, అనుపమ, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కోనేరు సత్యనారాయణ, తలసాని సాయి, అభిషేక్
‘‘అల్లుడు శీను’ సినిమా ఐదేళ్ల క్రితం విడుదలైంది. అభిమానుల ప్రేమ, ప్రోత్సాహం వల్లే ఇంత దూరం రాగలిగాను. చిన్న చిన్న తప్పులు చేశాను. ఇకపై ఓటమి లేకుండా ఉండటానికి కృషిచేస్తా. మంచి సినిమాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా రేపు (ఆగస్ట్ 2) విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ‘రాక్షసుడు’ ట్రైలర్‌ను నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్ విడుదల చేశారు. తొలి టికెట్‌ను సాయిశ్రీనివాస్, అనుపమ, కోనేరు సత్యనారాయణ విడుదల చేయగా, తలసాని సాయి యాదవ్ కొన్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అభిమానుల ప్రేమ, ఆదరణ పొందడానికి ఇంకా కష్టపడతాను. ఇప్పటి నుండి మన కెరీర్ స్టార్ట్ అయింది. ‘రాక్షసుడు’ నా మొదటి సినిమా. రెండో సినిమా కోసం వేచి చూడండి. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన సినిమా ‘రాక్షసుడు’. అరుదుగా దొరికే కథ ఇది.
ఇంత మంచి స్క్రిప్ట్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ– ‘‘తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే ఏ ఇతర హీరోల సినిమాలకు తీసిపోని విధంగా రికార్డు కలెక్షన్స్‌ను సాధించాడు మా అబ్బాయి శ్రీనివాస్. సొంత ప్రతిభతో పైకి వస్తున్నాడు. కొన్ని సినిమాలకు తెలిసోతెలియకో తప్పులు చేశాం. ఇకపై ఆ తప్పులు చేయకూడదని, అభిమానులను నిరుత్సాహ పరచకూడదనిపించి ఇంత వరకు మరో సినిమాకి కమిట్ కాకుండా ‘రాక్షసుడు’ సినిమాపైనే ఫోకస్ పెట్టాడు. ఇకపై ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో అలాంటివాటిలోనే నటిస్తాడు.
తనను ఓ మెట్టు పైకి ఎక్కించే సినిమా ‘రాక్షసుడు’’ అన్నారు. ‘‘చాలా ఉద్విగ్నంగా ఉండే చిత్రం ‘రాక్షసుడు’. చిత్రీకరణలో అస్సలు రాజీపడలేదు. రీషూట్స్ కూడా చేశాం. ఈ సినిమాకు కథే మూలం. ఇలాంటి కథతో నాలుగేళ్లుగా సౌతిండియాలో ఏ సినిమా రాలేదు’’ అన్నారు కోనేరు సత్యనారాయణ. ‘‘ఈ ఏడాది బెస్ట్ హిట్ మూవీస్‌లో ‘రాక్షసుడు’ ఉంటుంది. ఈసారి వందశాతం గట్టిగా హిట్ కొడుతున్నాం’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘మా సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్’’ అని రమేశ్‌వర్మ పెన్మత్స అన్నారు.
‘‘రాక్షసుడు’ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. శ్రీనివాస్ కెరీర్‌కు ఇది టర్నింగ్ పాయింట్’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘బెల్లంకొండ సురేశ్‌గారు నన్ను దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నారు. కానీ అప్పుడు నేను సిద్ధంగా లేకపోవడంతో కుదరలేదు. హీరోగా ఎదిగే క్రమంలో సాయి ప్రతి సినిమాకు కొత్తగా ప్రయత్నిస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాత మల్టీడైమన్షన్ వాసు, డైరెక్టర్ సాగర్, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, నల్లమలుపు బుజ్జి, నటులు మాదాల రవి, రాజీవ్ కనకాల, కెమెరామేన్ వెంకట్, ఎడిటర్ అమర్, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment