బిగ్‌బాస్‌: అలీని చూసి వణికిపోతున్న హౌస్‌మేట్స్‌ | Bigg Boss 3 Telugu: Ali Reza Aggressive Level Peaks Ticket To Finale Task | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: బాబాపై విరుచుకుపడుతున్న అలీ..

Published Tue, Oct 22 2019 1:11 PM | Last Updated on Thu, Oct 24 2019 7:03 PM

Bigg Boss 3 Telugu: Ali Reza Aggressive Level Peaks Ticket To Finale Task - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ పద్నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరికోసం బిగ్‌బాస్‌ ఓ సువర్ణావకాశాన్ని ఇస్తూనే అందులో ఓ మెలిక పెట్టాడు. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా ‘టికెట్‌ టు ఫినాలే’ అనే టాస్క్‌ను ఇచ్చాడు. ఇందులో ఒక్కరు మాత్రమే గెలిచే అవకాశం ఉండగా ఓడిపోయిన మిగతా అయిదుగురు సభ్యులు నామినేషన్‌లో ఉంటారని ప్రకటించాడు. గెలిచిన ఒక్కరికి టికెట్‌ టు ఫినాలే దక్కుతుందని తెలిపాడు. దీనికోసం పగలూ రాత్రీ తేడా లేకుండా ఇంటి సభ్యులంతా టాస్క్‌లపైనే దృష్టి సారించారు. ఇప్పటికే అధిక శాతం బ్యాటరీతో అలీ రెజా మొదటి స్థానంలో ఉండగా.. తక్కువ బ్యాటరీతో వరుణ్‌ చివరి స్థానంలో ఉన్నాడు. ఇక అర్ధరాత్రి సమయంలో బజర్‌ మోగించినపుడు అలీ, బాబాలు గంట మోగించడంతో వారిద్దరికీ బిగ్‌బాస్‌ రసవత్తరమైన టాస్క్‌ ఇచ్చాడు.

ఇందులో భాగంగా మట్టి పాత్రలో బాబా ఎరుపు రంగు పూలు.. అలీ ఊదా రంగు పూలు పెట్టాల్సి ఉంటుంది. ఒకరి పూలను మరొకరు పీకే ప్రయత్నం చేయవచ్చని బిగ్‌బాస్‌ సూచించాడు. దీంతో అలీ.. బాబా పూలను పెకిలిస్తూ.. దూరంగా విసిరేశాడు. ఆగ్రహించిన బాబా.. అలీ పూలను కూడా మట్టిలో నుంచి తీసేయడానికి  విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఈ కుస్తీలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దొర్లుతూ గెలుపు కోసం భీకరంగా పోరాడుతున్నారు. తాజా ప్రోమో ప్రకారం.. అలీ బాబాను ఎత్తిపడేస్తున్నట్టు కనిపిస్తోంది. వీరి పోరాట పటిమను చూస్తుంటే ఇంటి సభ్యులకు సైతం ఒళ్లు గగుర్పొడొస్తోంది. టాస్క్‌ హింసాత్మకంగా మారడంతో ఇంటి సభ్యులు భయంతో వణికిపోయారు. ఓ పక్క శ్రీముఖి వారిస్తోన్నప్పటికీ అలీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బాబాపై విరుచుకుపడ్డాడు. రసవత్తరంగా మారిన ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement