
ఏడాదికి ఎన్ని రోజులు? అక్షరాలా మూడు వందల అరవై ఐదు! ఈ 365 రోజుల్లో మీ లైఫ్‌లో ఏం జరిగిందో... మూడు ముక్కల్లో చెప్పమంటే? అలా కాదు. యాభై ఏళ్ల జీవితాల్ని మూడేసి గంటల్లో చెప్పమంటే? ‘బాబోయ్... బోల్డంత కష్టం’ అనుకుంటున్నారా! ఏం కాదు! ‘కట్టె... కొట్టె... తెచ్చె’ ఫార్ములా ఉందిగా. అంటే..?? ‘రాముడు వారధి కట్టాడు (కట్టె). లంకకు వెళ్లి రావణుణ్ణి కొట్టాడు (కొట్టె). సీతను తెచ్చాడు (తెచ్చె).’ అంత పెద్ద రామాయణాన్నే మన పెద్దలు మూడు ముక్కల్లో చెప్పేశారు. ఇప్పుడీ ఫార్ములాను అనుసరిస్తూ, మూడు గంటల్లో జీవిత చరిత్రలను చెప్పే బాధ్యతలను మన దర్శక–నిర్మాతలు తీసుకున్నారు. వచ్చే ఏడాది తెలుగు తెరపై ఆసక్తికరమైన జీవిత కథలు రానున్నాయి. మరి, ఆ జీవిత కథల్లో ఏం కడతారో? ఎవర్ని కొడతారో (టార్గెట్ చేస్తారో)? తెరపైకి ఏం తెస్తారో? వెయిట్ అండ్ సీ!!-
నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ ఒకరు. రామ్‌గోపాల్ వర్మ ‘ఎన్టీఆర్’ మరొకరు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు సినిమా తీయడానికి స్క్రిప్టులు రెడీ చేయిస్తున్నారు. చేస్తున్నారు. అయితే.. చిన్న తేడా ఉంది! ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’... టైటిల్‌లోనే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది వర్మ క్లియర్‌గా చెప్పేశారు. ఎన్టీఆర్ ఆత్మే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి స్క్రీన్‌ప్లే రాయిస్తుందట! వర్మ వెర్షన్ ఇదయితే... ‘నాన్నగారి లైఫ్‌ని ఎక్కణ్ణుంచి స్టార్ట్ చేయాలో? ఎక్కడ ఎండ్ కార్డు వేయాలో? నాకు తెలుసు’ అనేది బాలకృష్ణ వెర్షన్. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఎదిగిన తీరుని బాలకృష్ణ తన సినిమాలో చూపించాలనుకుంటున్నారట! తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తూ, నిర్మించనున్న ఈ సినిమాకు తేజ దర్శకుడు. ఈయన ఒకప్పుడు వర్మ బృందంలో పనిచేసిన వ్యక్తి (శిష్యుడు) కావడం విశేషమిక్కడ! వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ షూటింగ్ స్టార్ట్ చేసి, సెప్టెంబర్‌కి సినిమా రెడీ చేస్తానని వర్మ ప్రకటించారు. బాలకృష్ణ–తేజ సినిమా చిత్రీకరణ కూడా వచ్చే ఏడాది మొదలు కానుంది. ఎప్పటికి రెడీ చేస్తారో మరి!! కథ కోసం ఎన్టీఆర్ సన్నిహితులు, ఆయనతో పనిచేసిన వ్యక్తులను బాలకృష్ణ కలుస్తుంటే... ఎన్టీఆర్ ఇంట్లో పని చేసిన వ్యక్తులు, డ్రైవర్లను వర్మ కలుస్తున్నారు. వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి వైఎస్సార్‌సీపీకి చెందిన రాకేశ్‌రెడ్డి నిర్మాత.
సావిత్రి... మహానటి
నో డౌట్... సావిత్రి మహానటే! ఓ ‘మిస్సమ్మ’... ఓ ‘మాయాబజార్’... చెప్పుకుంటూ పోతే నటిగా సావిత్రి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన మూవీలెన్నో! కానీ, ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మిస్టరీయే! ఏవేవో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు సావిత్రి జీవిత కథతో రూపొందుతోన్న ‘మహానటి’తో మిస్టరీలకు ఎండ్ కార్డు పడుతుందని తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సుమారు రెండేళ్లు సావిత్రి కథపై చిత్రదర్శకుడు నాగ అశ్విన్ రీసెర్చ్ చేశారు. అలాగే, నటీనటుల ఎంపికలోనూ, మేకింగ్‌లోనూ చిత్రనిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ రాజీ పడడం లేదు. సావిత్రిగా కీర్తీ సురేశ్, ఎస్వీఆర్‌గా మోహన్‌బాబు, జర్నలిస్ట్‌గా సమంత, ‘జెమిని’ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్... ఇలా భారీ తారగణంతో తెరకెక్కుతోన్న ఈ సావిత్రి బయోపిక్ విడుదలకు ముందే సెన్సేషన్ సృష్టిస్తోంది.
సైరా... సై సై రా!
బ్రిటీష్ దొరలకు ఎదురొడ్డి స్వాతంత్య్రం కోసం తెలుగు ప్రజలను సంఘటితం చేసిన నాయకుడు... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అతడే తెలుగు ప్రజల పౌరుషం, రాయల సీమ రాజసం. తెల్లదొరలతో సై అంటే సై సై అంటూ స్వాతంత్య్రం కోసం పోరాడిన తొలి భారతీయుడు. వెన్నుపోటు విసిరిన కత్తివేటుకు తల తెగిపడినా... పౌరుషాన్ని కిందకు పడనివ్వొదంటూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచిన వీరుడు. అతని జీవిత కథతో చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. అంతులేని హీరోయిజమ్, అంతకు మించిన ఉత్కంఠ సైరా కథలో ఉన్నాయి. చిరంజీవి డ్రీమ్ పాజెక్ట్ ఇది. ఎన్నో ఏళ్లుగా కథగా ఉంది... త్వరలో తెరపైకి రానుంది.
చిరూ అండ్ కో కూడా... అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి, ఏఆర్ రెహమాన్ వంటి పాన్ ఇండియా యాక్టర్స్, టెక్నీషియన్స్‌తో సుమారు 200 కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ‘బాహుబలి’ తర్వాత అంత భారీ స్థాయిలో రూపొందనున్న తెలుగు చిత్రమిది. ‘బాహుబలి’ తరహాలో దేశ, విదేశాల్లో విడుదల చేయాలనుకుంటున్నారట! – సత్య పులగం
Comments
Please login to add a commentAdd a comment