
బాబీ దర్శకత్వంలో గబ్బర్‌సింగ్-2
‘గబ్బర్‌సింగ్’ చిత్రం హిందీ ‘దబాంగ్’ కథకు పునర్నిర్మాణమే అయినా.. కథానాయకుని పాత్ర చిత్రణ, సంభాషణలు పలికే తీరు, నడక, నడత... తదితర అంశాల్లో మాత్రం ‘గబ్బర్‌సింగ్’ చాలా కొత్తగా కనిపిస్తాడు. ఇందులో హీరో... ‘షోలే’ చిత్రంలోని విలన్ పాత్ర ‘గబ్బర్‌సింగ్’ను ఇష్టపడటం, ఆ పేరుతోనే చలామణీ అవుతూ, అలాగే ప్రవర్తిస్తూ, నిజమైన విలన్ల పాలిట విలన్‌గా మారడం, మధ్యలో వచ్చే అంత్యాక్షరి సన్నివేశం, చివరకు టైటిల్‌గా ‘గబ్బర్‌సింగ్’ అనే పేరును సూచించడం... ఇవన్నీ పవన్ ప్రేరణతో చేసినవే అని గతంలో ఆ సినిమా దర్శకుడు హరీశ్‌శంకరే చెప్పారు.
ఆ కారక్టరైజేషన్‌పై ఉన్న మమకారంతో వెంటనే ‘గబ్బర్‌సింగ్-2’ ప్రకటించారు పవన్. దర్శకునిగా ‘రచ్చ’ఫేం సంపత్‌నందిని కూడా ఖరారు చేశారు. అయితే... ఈ కథ కోసం పవన్ ఎక్కువ సమయాన్ని తీసుకోవడం, మధ్యలో ఆయన రాజకీయ రంగప్రవేశం, తర్వాత ‘గోపాల గోపాల’ చిత్రం షూటింగ్‌తో బిజీ అవ్వడం వంటి కారణాల వల్ల సినిమా సెట్స్‌కి వెళ్లడానికి జాప్యం జరిగింది. ఈలోపు సంపత్‌నంది సొంత నిర్మాణ సంస్థను స్థాపించడం, దర్శకునిగా ఓ భారీ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేయడం జరిగింది. దాంతో ఈ చిత్ర దర్శకునిగా ‘పవర్’ఫేం కె.రవీంద్ర(బాబీ)ని పవన్ ఖరారు చేశారు.
కథానాయిక కోసం ఆడిషన్స్ నిర్వహించి, తెలుగు చక్కగా మాట్లాడే అనిషా ఆంబ్రోస్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దబాంగ్, గబ్బర్‌సింగ్ చిత్రాలకు ఇది సీక్వెల్ కానీ, ప్రీక్వెల్ కానీ కాదని, ప్రేక్షకులకు పవన్ మార్క్ వినోదాన్ని పంచే కథాంశంతో మాత్రమే ఈ చిత్రం రూపొందనుందనీ, డిసెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది మే నెలలో వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తామనీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో చిత్ర నిర్మాత శరత్ మరార్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి రచన: కిశోర్ అండ్ టీమ్, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, క్రియేటివ్ హెడ్: హరీశ్‌పాయ్, నిర్మాణం: ఎరోస్ ఇంటర్నేషనల్స్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్.