సూపర్ స్టార్ సరసన అలియా
బాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు. అందుకే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ మహేష్ సినిమాలో నటించాలని ఉందంటూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా బాలీవుడ్ భామలతోనే తెరను పంచుకున్నాడు ప్రిన్స్. ప్రీతిజింటా, సోనాలి బ్రిందే, బిపాషాబసు, లిసారే లాంటి క్రేజీ హీరోయిన్స్ను టాలీవుడ్కు పరిచయం చేశాడు.
ఇటీవల కాలంలో సౌత్ హీరోయిన్స్తోనే సరిపెట్టుకుంటున్న మహేష్, మరోసారి బాలీవుడ్ హీరోయిన్తో కలిసి నటించడానికి రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా తరువాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్తో మల్టీ లింగ్యువల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్గా నటించనుందట.
గజిని సినిమాతో బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న మురుగదాస్, ప్రస్తుతం హిందీలో సోనాక్షి సిన్హా లీడ్రోల్లో అఖీరా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే మహేష్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు మురుగదాస్. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్తో నిర్మించడానికి రెడీ అవుతున్నారు.