
నా యాభై ఏళ్ల నట ప్రస్థానానికి కారణం వారే – సూపర్‌స్టార్ కృష్ణ
‘‘జర్నలిస్ట్ వినాయకరావు నాపై ఏడాదిలోపు ఓ పుస్తకం రాస్తానన్నారు. కానీ ఫొటోలు, సమగ్ర సమాచారం సేకరించి పుస్తకం రాసేందుకు మూడేళ్లు పట్టింది’’ అన్నారు సూపర్‌స్టార్ కృష్ణ. నటుడిగా ఆయన యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయకరావు రచించిన ‘దేవుడులాంటి మనిషి’ పుస్తకావిష్కరణను కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన లలిత కళా పరిషత్ వారు నిర్వహించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు పుస్తకావిష్కరణ చేసి, తొలి ప్రతిని కృష్ణ, విజయనిర్మలకు అందించారు. మహేందర్ రెడ్డి రెండులక్షల యాభై వేలు చెల్లించి మొదటి పుస్తకాన్ని కొనుగోలు చేశారు.
కృష్ణ మాట్లాడుతూ– ‘‘నన్ను హీరోగా పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావుగారికి, ‘గూఢచారి 116’తో మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన డూండీగారికి కృతజ్ఞతలు. నేను నటుడిగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్స్ కారణం’’ అని చెప్పారు. దర్శకులు బి.గోపాల్, ఎస్వీ కృష్ణారెడ్డి, ముప్పలనేని శివ, నిర్మాతలు కె.ఎస్.రామారావు, సి.కల్యాణ్, కె.అచ్చిరెడ్డి, అనీల్ సుంకర, దాసరి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.