‘బ్రోచేవారెవరురా అంటే కాపాడేవారు ఎవరురా అని అర్థం. ఈ సినిమాలో ఏ రెండు పాత్రలను తీసుకున్నా ఏదో ఓ సందర్భంలో ఒక పాత్ర మరో పాత్రను కాపాడుతుంది. దాంతో ‘బ్రోచేవారెవరురా’ అనే టైటిల్ బావుంటుందని పెట్టాం’’ అని దర్శకుడు వివేక్ ఆత్రేయ అన్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్‌కుమార్ నిర్మాత. సత్యదేవ్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వివేక్ ఆత్రేయ పంచుకున్న విశేషాలు...
► ఈ కథను నా మొదటి సినిమా ‘మెంటల్ మదిలో’ తర్వాతే రాసుకున్నాను. ఫస్ట్ రాజ్ కందుకూరిగారి బ్యానర్‌లో చేద్దామనుకున్నాను. ప్రొడక్షన్ ఆలస్యం అవుతుండటంతో ‘మళ్లీ ఏదైనా ప్రాజెక్ట్ కలసి చేద్దాం’ అని రాజ్‌సార్‌తో చెప్పి బయటకు వచ్చేశా.
► కథ రాసుకున్నప్పుడు శ్రీవిష్ణుని మనసులో పెట్టుకునే రాసుకున్నాను. వేరే వాళ్లకు కథ చెప్పినా, ఫైనల్‌గా విష్ణుతోనే చేశాను. ‘మెంటల్ మదిలో’ అప్పుడు మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇందులో ఉమెన్ హెరాస్‌మెంట్ పాయింట్‌ని టచ్ చేస్తూ లైట్ హార్ట్ కామెడీగా తెరకెక్కించాం. ప్రతి మహిళ చూడాల్సిన సినిమా ఇది. మిత్ర అనే పాత్ర నివేదా థామస్ తప్ప ఎవరూ చేయలేరు అన్నట్టుగా చేసింది.
► ఇందులో ఆర్3 బ్యాచ్ (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) ఐదేళ్లుగా ఇంటర్ చేస్తుంటారు. వాళ్లకు మిత్రా (నివేదా థామస్) పరిచయం అవుతుంది. తన వల్ల వీళ్ల లైఫ్ ఎలా మారింది అనేది కథ. ఇందులో సినిమా హీరోయిన్‌గా నివేదా పేతురాజ్, దర్శకుడు కావాలనే పాత్రలో సత్యదేవ్ చేశారు.
► ‘మెంటల్ మదిలో’ నచ్చింది, హిట్ అని కొందరంటారు. కొందరేమో ఇంకా బావుండాల్సింది అంటారు. సో ఫస్ట్ సినిమా హిట్టా లేదా? నాకు రావాల్సినంత పేరు వచ్చిందా? లేదా అనేది నాకింకా ప్రశ్నే. ఆ విషయాన్ని మెల్లిగా పట్టించుకోవడం మానేశాను. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత ఏ సినిమా చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు.
అది ఇంకా ప్రశ్నే
Published Mon, Jun 24 2019 1:04 AM | Last Updated on Mon, Jun 24 2019 1:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment