Brochevarevarura
-
హిందీలో రీమేక్ కానున్న సౌత్ చిత్రాలు: హీరోలు ఎవరంటే?
దక్షిణానికి.. ఉత్తరానికి హద్దు చెరిగిపోయింది. సినిమా దగ్గర చేసేసింది. ఇక్కడ హిట్ అయిన సినిమా అక్కడ అక్కడ హిట్ అయిన సినిమా ఇక్కడ... ఇప్పుడు రీమేక్ జోరు పెరిగింది. సౌత్‌లో వచ్చిన పలు హిట్ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. మరి.. హిందీ రీమేక్‌లో నటించనున్న కథానాయకుడు కౌన్? ఆ విషయంలోనే బాలీవుడ్ నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. హీరో ఎవరు? అనేది తర్వాత తెలుస్తుంది. రీమేక్ కానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. వెండితెరపై నవ్వులు కురిపించి బాక్సాఫీస్‌ను కాసులతో నింపిన తెలుగు హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ రీమేక్‌కు ‘దిల్’ రాజు, బోనీకపూర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనీజ్ బాజ్మీ తెరకెక్కిస్తారు. కానీ ఈ రీమేక్‌లో ఎవరు హీరోలుగా నటిస్తారు? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత రాలేదు. ఒక దశలో వెంకటేష్, అర్జున్ కపూర్ (నిర్మాత బోనీకపూర్ తనయుడు) పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘ట్యాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో వచ్చిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా దక్షిణాది భాషల్లో విడుదల కాకముందే హిందీ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్ జోహార్. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్‌లో హీరో ఎవరు? అసలు సెట్స్‌పైకి వెళుతుందా? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత అయితే రాలేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో 2019లో విడుదలైన ‘మత్తువదలరా’ ఒకటి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తనయుడు శ్రీ సింహా ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు. రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం హిందీ రీమేక్‌కి కూడా రితేషే దర్శకుడు. కానీ ఇందులో హీరో ఎవరు? అనే విషయంపై మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను దర్శక–నిర్మాత నటుడు అజయ్ దేవగన్ దక్కించుకున్నారు. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో అభయ్ డియోల్ మెయిన్ లీడ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు ఎవరు? సినిమాలోని మిగతా నటీనటుల గురించిన నెక్ట్స్ అప్డేట్ రాలేదు. అటు తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ‘విక్రమ్ వేదా’ చిత్రం బంపర్ హిట్. ఈ సినిమా హిందీ రీమేక్‌ను పుష్కర్ గాయత్రి ద్వయమే డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇందులో హీరోలుగా ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఐదేళ్లుగా కొందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో విజయ్ కాంబినేషన్లో వచ్చిన తమిళ ‘కత్తి’ చిత్రం సూపర్ హిట్. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ఖైదీ నంబరు 150’లో చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళ ‘కత్తి’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మాత్రం తమ సినిమాలో హీరో ఎవరో చెప్పలేదు. జగన్ శక్తి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారని, ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారనే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక కార్తీ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్ ‘ఖైదీ’ (2019) సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను అజయ్ దేవగన్ సొంతం చేసుకున్నారు. కానీ ఇందులో అజయే హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా చేస్తారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ది కూడా ఇదే పరిస్థితి. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం చేజిక్కించుకున్నారు. మరి.. హిందీ రీమేక్‌లో జాన్ నటిస్తారా? లేదా? అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇంకా మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ‘అంజామ్ పతిరా’, ‘దృశ్యం 2’, ‘ఫోరెన్సిక్’ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. కుంచకో బోబన్ నటించిన ‘అంజామ్ పతిరా’ రీమేక్‌ను రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్, ఏపీ ఇంటర్నేషనల్ సంస్థలు నిర్మిస్తాయి. దర్శకులు, నటీనటుల వివరాలు రావాల్సి ఉంది. ‘ఫోరెన్సిక్’ రీమేక్‌కు విశాల్ ఫరియా దర్శకుడు. ఇందులో విక్రాంత్ మెస్సీ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగింది. మోహన్‌లాల్ ‘దృశ్యం 2’ హిందీ రైట్స్‌ను కుమార్ మంగత్ పాతక్ దక్కించుకున్నారు. హిందీ ‘దృశ్యం 1’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లో కూడా నటిస్తారనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలే కాదు.. మరికొన్ని సౌత్ హిట్ సినిమాల రీమేక్ హక్కులను బాలీవుడ్ తారలు, దర్శక నిర్మాతలు దక్కించుకున్నారు. అయితే ‘కథానాయకుడు కౌన్’ అనేది మాత్రం నిర్ణయించలేదు. బహుశా కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఈ రీమేక్స్‌లో హీరోలుగా ఎవరు నటిస్తారు? అనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
బాలీవుడ్‌కి బ్రోచేవారెవరురా
2019లో సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ ఒకటి. శ్రీ విష్ణు, నివేదా «థామస్, సత్యదేవ్, నివేదా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ కాబోతోంది. అజయ్ దేవగణ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అభయ్ డియోల్, కరణ్ డియోల్ ఈ రీమేక్‌లోæ హీరోలు. దేవెన్ ముంజల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చడంతో రీమేక్ రైట్స్ తీసుకున్నారట అజయ్. ప్రస్తుతం కథను హిందీ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు మారుస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ద్వితీయ విఘ్నం దాటారండోయ్
ఇండస్ట్రీలో ఒక గమ్మల్తైన గండం ఉంది. ఫస్ట్ సినిమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినా కూడా రెండో సినిమాకు తడబడుతుంటారు దర్శకులు. సినిమా భాషలో దీనికి ‘సెకండ్ మూవీ సిండ్రోమ్’ అనే పేరు కూడా పెట్టారు. ఇండస్ట్రీలో ఇది తరచూ కనిపించేదే. దర్శకులు మొదటి సినిమాతో ఎంతలా మెప్పించినా, రెండో సినిమాతో నిరాశపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరు దర్శకులు మాత్రం సెకండ్ హిట్ కూడా ఇచ్చేస్తారు. అలా తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన కొందరు దర్శకులు ఈ ఏడాది తమ రెండో సినిమాతో వచ్చారు. కానీ ముగ్గురు దర్శకులు మాత్రం ద్వితీయ విఘ్నాన్ని విజయవంతంగా దాటేశారు. ఈ ‘సెకండ్ మూవీ సిండ్రోమ్’ను సక్సెస్‌ఫుల్‌గా దాటేసిన సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ స్టోరీ. శివ మజిలీ ‘నిన్ను కోరి’ (2017) సినిమాతో ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు శివ నిర్వాణ. ప్రేమలో ఓడిపోయినా జీవితాన్ని ముందుకు సాగించొచ్చు అని ‘నిన్ను కోరి’లో చెప్పారు. ఈ చిత్రంలో నాని, నివేదా థామస్, ఆది ముఖ్య పాత్రల్లో నటించారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లే, టేకింగ్, పాటలు, ఫెర్ఫార్మెన్స్‌లతో ఈ సినిమా సక్సెస్ కొట్టింది. రెండో సినిమాగా టాలీవుడ్ యంగ్ కపుల్ నాగచైతన్య, సమంతలతో ‘మజిలీ’ తీశారు శివ నిర్వాణ. వివాహం తర్వాత చైతన్య, సమంత స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమిదే. మనం కోరుకున్నవాళ్లు మనకు కొన్నిసార్లు దక్కకపోవచ్చు. మనల్ని కోరుకునేవాళ్లూ మనకోసం ఉండే ఉంటారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు శివ. ఎమోషనల్ మీటర్ కరెక్ట్‌గా వర్కౌట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం నాగచైతన్య, సమంత గుర్తుంచుకునే చిత్రం అయింది. ప్రస్తుతం తన తొలి హీరో నానీతో ‘టక్ జగదీష్’ చేస్తున్నారు శివ. మళ్ళీ హిట్ మొదటి చిత్రానికి ప్రేమకథను ఎన్నుకున్నారు గౌతమ్ తిన్ననూరి. కథను చెప్పడంలో, కథను ఎంగేజ్ చేయడంలో తనదైన శైలిలో ‘మళ్ళీ రావా’ని తెరకెక్కించారు. ఇందులో సుమంత్, ఆకాంక్షా సింగ్ జంటగా నటించారు. మన ఫస్ట్ లవ్ మళ్లీ మన జీవితంలోకి ప్రవేశిస్తే? ఆమెను వదులుకోకూడదనుకునే ఓ ప్రేమికుడి ప్రయాణమే ఈ సినిమా. ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. రెండో సినిమాగా నానీతో ‘జెర్సీ’ని తెరకెక్కించారు గౌతమ్. వందమందిలో గెలిచేది ఒక్కడే. ఆ ఒక్కడి గురించి అందరూ చర్చించుకుంటారు. మిగతా 99 మందికి సంబంధించిన కథే ‘జెర్సీ’. 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెటర్‌గా టీమ్‌లో సెలక్ట్ కావాలనుకున్న ఓ ప్లేయర్ కల నెరవేరిందా లేదా అనేది కథ. నాని కెరీర్లో మైలురాయిగా ఈ సినిమా ఉండిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. నో కన్ఫ్యూజన్ ‘దర్శకుడిగా వివేక్ ఆత్రేయకు ‘మెంటల్ మదిలో’ తొలి సినిమా. శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్ జంటగా నటించారు. ఏ సందర్భంలో అయినా ఏదైనా ఎంపిక చేసుకోవాలంటే కన్ఫ్యూజ్ అయ్యే మనస్తత్వం హీరోది. అలాంటి అతను లైఫ్ పార్ట్నర్ని ఎలా ఎంచుకున్నాడన్నది కథ. హీరో కన్ఫ్యూజ్డ్ అయినప్పటికీ ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకుండా బావుందనేశారు. దాదాపు అదే టీమ్‌తో ‘బ్రోచేవారెవరురా’ తెరకెక్కించారు వివేక్. క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా వినోదం పంచింది. లైంగిక వేధింపులు అనే సున్నితమైన సబ్జెక్ట్‌ను ఈ చిత్రంలో అతి సున్నితంగా చర్చించారు వివేక్. ప్రస్తుతం మూడో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులూ ద్వితీయ విఘ్నాన్ని దాటేశారు. ప్రస్తుతం మూడో సినిమా పనిలో ఉన్నారు. మూడో హిట్‌ని కూడా ఇస్తే ‘హ్యాట్రిక్ డైరెక్టర్స్’ అనిపించుకుంటారు. – గౌతమ్ మల్లాది -
ఇద్దరం.. వెంకటేష్ అభిమానులమే..
ఒకప్పుడు వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. ఒకరికొకరు పరిచయం కూడా లేదు. కానీ ఇద్దరి గమ్యం ఒక్కటే.. అదే ‘సినిమా’. ఇప్పుడు వారిద్దరూ ఒక్కటే. వారిని సినిమా ప్రపంచమే కలిపింది. ఒకరు సినీ హీరో అయితే, మరొకరు దర్శకుడిగా మారారు. వారే హీరో శ్రీవిష్ణు, దర్శకుడు వివేక్ ఆత్రేయ. విష్ణు బీబీఎం చదివి హైదరాబాద్ పయనమవగా.. వివేక్ బీటెక్ చేసి ఓ ప్రముఖ ఎమ్మెన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. మనసంతా సినిమా వైపు లాగడంతో ఉద్యోగాన్ని వదిలేసి నగరానికి వచ్చేశాడు. వీరిద్దరూ తమ గమ్యాన్ని చేరుకుని ‘మెంటల్ మదిలో’ చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచేశారు. తర్వాత ‘బ్రోచేవారెవరురా’తో మరో హిట్ కొట్టారు. ఈ మిత్ర ద్వయం తమ సినీ ప్రయాణాన్ని.. అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే.. -సత్య గడేకారి అమలాపురంలో మొదలై.. శ్రీవిష్ణు: నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లపైనే అయింది. మాది అమలాపురం సమీపంలోని గోడి గ్రామం. బీబీఎం చదివా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. వెంకటేష్ సినిమాలు అదేపనిగా చూసేవాణ్ని. చదువు, జాబ్ మనకు సెట్ కావని హైదరాబాద్ వచ్చేశా. వినయ్‌వర్మ వద్ద థియేటర్ ఆర్టిస్ట్‌గా చేరా. నటనలో కొన్ని మెళకువలు నేర్చుకున్నా. సినిమా కష్టాలను అనుభవించా. చిన్నచిన్న వేషాలు వేసింతర్వాత ‘బాణం’ చిత్రంలో చిన్న పాత్ర వేసి పేరు తెచ్చుకున్నా. తర్వాత ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’ నటుడిగా గుర్తింపు వచ్చింది. అల్లు అర్జున్ ప్రశంసించారు.. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా చూశాక హీరో అల్లు అర్జున్ ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు. తమిళంలో విజయ్ సేతుపతి, శివకార్తికేయన్‌లా నీకు మంచి టాలెంట్ ఉందని కితాబిచ్చారు. విభిన్న కథలను చేయమంటూ సలహా ఇచ్చారు. ఓ పెద్ద హీరో అభినందించడం చాలా సంతోషంగా అనిపించింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో బన్నీతో కలిసి నటించాను. మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ‘నీది నాది ఒకటే కథ’.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలు చేశాను. ఇద్దరం.. వెంకటేష్ అభిమానులమే.. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ: మేమిద్దరం చిన్నప్పటి నుంచి వెంకటేష్ అభిమానులమే. ఆయన తన ఇంటికి పిలిచి అభినందించడం మరిచిపోలేని అనుభవం. మమ్మల్ని ప్రోత్సహించిన సినీ పెద్దలకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఓ డిఫరెంట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాం. మేం వచ్చింది ఆంధ్రా ప్రాంతం నుంచే అయినా మాకు తెలంగాణ వంటలంటే ఎంతో ఇష్టం. హైదరాబాదీ కల్చర్‌పై మమకారం ఎక్కువ. తెలంగాణ స్నేహితులే ఎక్కువ. వారితో సాన్నిహిత్యం బాగా పెరిగింది. గుంటూరులో షురువై.. వివేక్ ఆత్రేయ: మాది గుంటూరు. తమిళనాడులోని శాస్త్రి యూనివర్సిటీలో బీటెక్ చేశా. అప్పుడే కొంత మందిమి జట్టుగా ఏర్పడి షార్ట్ఫిలింస్ చేశాం. కావ్యం అనే షార్ట్‌ఫిలింకి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ఐబీఎంలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. జాబ్‌లో జాయిన్ అయినా ఎక్కడో ఏదో వెలితి అనిపించింది. జాబ్ మానేసి హైదరాబాద్ వచ్చేశా. కథలను రాసి యువ హీరోలతో పాటు నిర్మాతలను వినిపించడం మొదలుపెట్టా. భిన్నమైన కథతో వచ్చాను నేను రాసిన కథతో నిర్మాత రాజ్ కందుకూరిని కలిశాను. అప్పటికే ‘పెళ్లిచూపులు’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ‘మెంటల్ మదిలో’ కథ చెప్పాను. ఆయనకు అది బాగా నచ్చింది. శ్రీవిష్ణుని రికమెండ్ చేశారు. శ్రీ విష్ణుని కలిశాక ‘మెంటల్ మదిలో’ హీరో కన్‌ప్యూజ్డ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా రెప్లికాలా అనిపించాడు. అతనికీ కథ బాగా నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. కథలోలీనమయ్యా.. శ్రీవిష్ణు: వివేక్ వచ్చి కలిసి కథ చెప్పడం మొదలుపెట్టాక. కథలో లీనమైపోయా. చాలా సూపర్బ్‌గా అనిపించింది. కానీ చెప్పిన విధంగా సినిమా తీస్తాడా అని కొద్దిగా భయం. అయితే, అతడిలో కాన్ఫిడెన్స్ కనిపించింది. చాలామంది నన్ను రిజర్వ్డ్ పర్సన్ అని అంటుంటారు. కానీ నేను అలా కాదు. వివేక్ కథ చెప్పాడు. ఈ కథ నీకే సూటవుతుందన్నాడు. అంతే సినిమా చకచకా సాగిపోయింది. 2017లో వచ్చిన ఈ పిక్చర్ మదిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాలో కాన్ఫిడెంట్ రెట్టింపు చేసింది. టీంవర్క్‌తో విజయం సాధించాం వివేక్ ఆత్రేయ: నేను బీటెక్ చేస్తున్న సమయంలో మేము సెట్ అయిన టీం.. మా జూనియర్స్ కలిసి టీంగా ఏర్పడ్డాం. అందులో చాలా మంది మంచి జాబ్స్ వదులుకొని వచ్చారు. సినిమా రిలీజ్‌కి దగ్గలో ఉన్నా సినిమాకి సంబంధించిన వర్క్ చాలా ఉంది. టీమంతా కష్టపడటంతో ‘బ్రోచేవారెవరురా’ చిత్రం విజయాన్ని నమోదు చేసుకుంది. చాలామంది ఫోన్లు చేసి అభినందించారు. అల్లు అర్జున్, వెంకటేష్, నాగచైతన్య, అడవిశేషు, సుప్రియల అభినందనలు ఆనందాన్నిచ్చాయి. -
హలో... మీ అమ్మాయి నా దగ్గరుంది
ఒక తాడు, గుడ్డ పీలిక ఉంటే చాలుతీసే సినిమాలు కొన్ని ఉంటాయి. తాడు చేతులు కట్టేయడానికి. గుడ్డ పీలిక అరవకుండా నోటిలో కుక్కడానికి. కిడ్నాప్ డ్రామా అంటే ఎవరికైనా ఆసక్తే.కిడ్నాప్ చేశాక ‘హలో... రేపు సాయంత్రంలోగా డబ్బు అందలేదో’ అనే బెదిరింపులకు టెన్షన్ వస్తుంది. నేరం ప్రమాదం. శిక్షార్హం. ఆ నేరానికి పాల్పడేవాళ్ల తిప్పలే హిట్ సినిమాలు. భారతీయ ఇతిహాసంలో నమోదైన తొలి కిడ్నాప్‌ను రావణాసురుడు చేశాడు. సీతను చెరబట్టి అతడు లంకా వినాశనానికి కారణమయ్యాడు. అయినవారు చనిపోతే ఆ దుఃఖం వేరు. యదార్థాన్ని స్వీకరించే కొద్దీ వేదన తగ్గుతుంది. కాని కిడ్నాప్ సంగతి అలా కాదు. మనం ప్రాణంగా ప్రేమించినవారు ఎక్కడో ఉంటారు. ఎవరి చేత్లులోనో బందీగా ఉంటారు. ఎప్పుడు విడుదల అవుతారో తెలియని అవస్థలో ఉంటారు. అసలు ప్రాణాలతో ఉన్నారో లేరో అనే ఆందోళన కలిగిస్తూ ఉంటారు. వారి కోసం మనం ఏదో ప్రయత్నం చేస్తే తప్ప, వారి బదులుగా ఏదో చెల్లిస్తే తప్ప బయటపడని దురవస్థలో ఉంటారు. మరణం కంటే భయంకరమైనది కిడ్నాప్. అందుకే నేరగాళ్లు కిడ్నాప్‌ను ఒక ఆయుధంగా వాడి పబ్బం గడుపుకోవాలని చూస్తారు. ఏ నేరమైనా చివరకు శిక్షతోనే ముగుస్తుంది. కిడ్నాప్ చేసినవారు కూడా అంతిమంగా కటకటాల వెనక్కు వెళతారు. కాని ఈలోపు జరిగే డ్రామాలో మాత్రం కుటుంబసభ్యులు, పోలీసులు పాత్రధారులు అవుతారు. ఆ కథ సినిమాలోది అయితే ప్రేక్షకులు కూడా భాగస్తులు అవుతారు. ఇటీవల ‘బ్రోచేవారెవరురా’ సినిమా కిడ్నాప్ డ్రామాతో విడుదలైంది. మరి గతంలో సినిమాల్లో ఈ ఆటను ఆడింది ఎవరు? విక్రమ్ (1986) అంతవరకూ అక్కినేని కుమారుడుగా మాత్రమే ఉన్న నాగార్జున ‘విక్రమ్’ సినిమాతో సినిమా హీరో నాగార్జున అయ్యాడు. ఇది కిడ్నాప్‌డ్రామా. హిందీలో దర్శకుడు సుభాష్ ఘాయ్ దీనిని రచించాడు. అరెస్టయ్యి ఉరి శిక్షకు దగ్గరగా ఉన్న తన గాడ్‌ఫాదర్‌ను రక్షించుకోవడానికి పోలీస్ అధికారి కుమార్తెను హీరో కిడ్నాప్ చేయడం కథ. జాకీ ష్రాఫ్, మీనాక్షి శేషాద్రి నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగు రీమేక్‌లో కూడా నాగార్జునను నిలబెట్టింది. కిడ్నాప్ అయిన అమ్మాయి కిడ్నాప్ చేసినవాడితోనే ప్రేమలో పడుతుంది. హీరో కూడా ఆమెను ఏ పాడుబడ్డ మహల్లోనో ఉంచకుండా చక్కగా ప్రకృతి మధ్యలో, అందమైన పర్ణశాలలో ఉంచుతాడు. పైగా ఫ్లూట్ ఊదుతూ తనలోని భావుకత్వం ప్రదర్శిస్తుంటాడు. ఫ్లూట్ ఊదే కుర్రాడితో ప్రేమలో పడటం ఆ రోజుల్లో ఫ్యాషన్ కనుక శోభన నాగార్జునతో ప్రేమలో పడుతుంది. అయితే చాలా పరీక్షలకు నిలబడి ఈ ప్రేమ గెలుస్తుంది. నాగార్జునకు హిట్ ఇచ్చిన ఈ కిడ్నాప్ డ్రామా చాలా రోజుల తర్వాత ఆయనే మళ్లీ నటించిన ‘గగనం’లో నిరాశపరిచింది. విమానంలో బందీ అయిన ప్రయాణికులను గగనంలో విడుదల చేయించే అధికారిగా నాగార్జున నటించారు. వింత దొంగలు (1989) రాజమండ్రి రేవులో లాంచీ మీద గైడ్‌గా పని చేసే గుమాస్తా రావు గోపాలరావు, అదే ఊళ్లో హోటల్ సర్వర్‌గా పని చేసే రాజశేఖర్ మధ్యతరగతి డబ్బు కటకటలు తట్టుకోలేక ఒక డబ్బున్న అమ్మాయి నదియాను కిడ్నాప్ చేస్తారు. సాధారణంగా కిడ్నాప్ అయిన అమ్మాయి కిడ్నాప్ చేసిన వారిని చూసి భయపడాలి. కాని ఈ సినిమాలో కిడ్నాప్ అయిన అమ్మాయి కిడ్నాప్ చేసిన వారిన భయపెడుతుంటుంది. చిన్నప్పటి నుంచి గారాబం చేసి చెడకొట్టానన్న కోపంతో అమ్మాయి విడుదల కోసం డబ్బు ఇవ్వనంటాడు తండ్రి. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటారు కిడ్నాపర్లు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి కాలక్షేపం సినిమాగా నిలిచింది. ‘ఏంటి మేటరు’ అనేది ఈ సినిమాలో రావుగోపాలరావు ఊతపదం. ఆ తర్వాత అది పాపులర్ అయ్యింది. ఇప్పటికీ జనం ఏంటి మేటరు అంటుంటారు. ఒకే సంవత్సరం ‘అంకుశం’ లో నవ్వే తెలియని పోలీసాఫీసర్‌గా రాజశేఖర్‌ను నటింపచేసిన కోడి రామకృష్ణ ఆ వెంటనే ఈ సినిమాలో నవ్వులు పూయించే కామెడీ హీరోగా చేయించడం గమనించాలి. రాజశేఖర్ రెంటిలోనూరాణించారు. మగాడు (1990) ఈ సినిమా హీరో రాజశేఖర్ కాలు విరిగేలా చేసింది. కాని దాని వల్ల తర్వాతి కాలంలో జీవిత భాగస్వామి అయిన జీవితను దగ్గర చేసింది. ‘మగాడు’ రాజశేఖర్ కెరీర్లో పెద్ద హిట్. అందులో కూడా నేరస్తుడైన తన అన్నను కాపాడుకోవడానికి తమ్ముడు ఏకంగా కేంద్ర మంత్రినే కిడ్నాప్ చేస్తాడు. విడుదలకు 100 కోట్లు అడుగుతాడు. ఈ గొంతెమ్మ కోరిక తీర్చడం కంటే చావో రేవో తేల్చుకునే అధికారిని పంపడమే మేలని ప్రభుత్వం అనుకుంటుంది. ఆ అధికారే హీరో రాజశేఖర్. ఒన్ మేన్ కమెండోగా రాజశేఖర్ అడవుల్లో ప్రయాణించి కిడ్నాప్ డెన్‌కు చేరుకుని సాహసంగా బందీలను విడిపిస్తాడు. మలయాళంలో పెద్ద హిట్ అయిన మోహన్‌లాల్ సినిమాను అదే దర్శకుడి దర్శకత్వంలో జీవిత నిర్మించగా పెద్ద హిట్ అయ్యింది. లిజిని ఆ సినిమాలోనే తెలుగు ప్రేక్షకులు చూశారు. తమిళ హీరో త్యాగరాజన్ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. రోజా (1992) కమలహాసన్ నటించిన ‘గుణ’ 1991లో వచ్చింది. తల్లిదండ్రుల పెంపకం సరిగా లేని కమలహాసన్ స్త్రీలోని అమ్మను బంధించడానికి ఒక ప్రియురాలిని ఊహించుకుంటూ ఆ ఊహ నిజమనే భ్రాంతి చెంది ఏకంగా ఒక అమ్మాయినే కిడ్నాప్ చేస్తాడు. సినిమాలో ఉమాదేవి అనే పాత్ర ముందు అతణ్ణి అసహ్యించుకున్నా చివరకు ప్రేమిస్తుంది. ‘ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే’ పాట తెలుగులో ఇప్పటికీ నిలిచిన పాట. ఆ వెంటనే మణిరత్నం ‘రోజా’ వచ్చింది. సత్యవంతుడి ప్రాణాల్ని యుముడి నోటి నుంచి తన్నుకొని తిరిగి తెచ్చుకున్న సావిత్రిలా ఈ సినిమాలో మధుబాల టెర్రరిస్టుల వల్ల కిడ్నాపైన అరవింద్ స్వామి ప్రాణాలను తిరిగి తెచ్చుకుంటుంది. కిడ్నాపైన వారి కోసం పోలీసులు పోరాడాలి. భార్య పోరాడటం వల్ల సెంటిమెంటు పండి బాక్సాఫీసు పసుపుకుంకుమలతో కళకళలాడింది. మనీ (1993) చాలా మంది కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన ఈ సినిమా దర్శకుడు శివనాగేశ్వరరావుకు ఎప్పటికీ చెప్పుకునే సినిమా అయ్యింది. అప్పులపాలయిన భర్త పరేశ్ రావెల్ చెక్‌బుక్‌ను కంట్రోల్ చేసే భార్య జయసుధను కిడ్నాప్ చేయాలనుకుంటాడు. కాని పూటకు ఠికానా లేని ఇద్దరు బేచిలర్ కుర్రాళ్లు జె.డి చక్రవర్తి, చిన్నా ఒక్క కిడ్నాప్‌లో లైఫ్‌లో సెటిల్ పోవాలని పరేశ్ రావెల్ కంటే తామే ముందు జయసుధను కిడ్నాప్ చేస్తారు. ఇందులోకి ఖాన్ దాదా అయిన బ్రహ్మానందం దూరడం విశేషం. మనీ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యింది. రేణుకా సహానీ, పరేశ్‌రావెల్ వంటి ఫ్రెష్ ముఖాలు కనిపించాయి. అల్లరి వేషాలు వేసే బ్రహ్మానందం సీరియస్ కామెడీ చేయడం ఈ సినిమాతో మొదలెట్టాడు. ఒరు విరల్ కృష్ణారావు చిన్న పాత్ర అయినా మెరుస్తాడు. పరేశ్ రావెల్‌కు సంగీత దర్శకుడు చక్రవర్తి డబ్బింగ్ చెప్పారు. ‘వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసూ’ పాట, ‘ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు’ డైలాగు హిట్. పనికిమాలిన ప్రొడక్షన్ మేనేజర్‌గా తనికెళ్ల భరణి నటన కూడా నవ్వులే. సిసింద్రీ (1995) చిన్నపిల్లలను కిడ్నాప్ చేయకుండా కిడ్నాప్ సినిమాలు ఉండవు. తెలుగు సినిమాలలో ఈ అంశాన్ని కృష్ణ నటించిన ‘దొంగల వేట’లో మొదట చూపించారు. ఆ తర్వాత బేబి షాలినితో ఉషాకిరణ్ మూవీస్ తీసిన ‘చందమామ రావే’ కూడా కిడ్నాప్ డ్రామాయే. అందులో బేబీ షాలినిని కిడ్నాప్ చేసినవారు చివరకు ఆ చిన్నారి వల్లే పూర్తిగా మారిపోతారు. అయితే హాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘బేబీస్ డే అవుట్’ ఆధారంగా తెలుగులో తీసిన ‘సిసింద్రీ’ మంచి హిట్‌గా నిలిచిందని చెప్పాలి. దీనికి కూడా దర్శకుడు శివ నాగేశ్వరరావే. సినిమాలో బుజ్జి పిల్లాడిగా అఖిల్ అక్కినేని నటించడం అప్పట్లో వార్త అయ్యింది. కిడ్నాపర్లుగా గిరిబాబు, సుధాకర్, తనికెళ్ల భరణి నటించారు. ఆమని మీద తీసిన ‘చిన్నతండ్రీ నిను చూడగా’ పాట పెద్ద హిట్. నాగార్జున, టబూ కలిసి ఒక పాటలో చిందులు తొక్కారు. చిన్నపిల్లల కిడ్నాప్ అంశంగా కమలహాసన్ తీసిన ‘ముంబై ఎక్స్‌ప్రెస్’ క్లాసిక్ కామెడీ అయినా ప్రేక్షకులు అందుకోలేదని చెప్పాలి. ఐతే (2003) మాఫియా డాన్ పవన్ మల్హోత్రా దేశం వదిలి పారిపోవాలనుకుంటాడు. కాని అతని మీద నిఘా ఉంటుంది. అందుకని హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్లే ఫ్లయిట్‌ని కిడ్నాప్ చేసి ఖాట్మండు తీసుకెళ్లి అక్కడి నుంచి దుబాయ్‌కి పారిపోవాలని ప్లాన్. తాను మాత్రం ప్రయాణికుల్లో ఒకడిగా ఉంటాడు. కిడ్నాప్ చేయడానికి నలుగురు కుర్రాళ్లని సెట్ చేస్తాడు. ఫ్లయిట్లో కేంద్ర మంత్రి ఉంటాడు కనుక అతణ్ణి ఫ్లయిట్లోనే ఉంచి ఖాట్మాండులో ప్రయాణికులను వదిలిపెడితే ఆ గందరగోళంలో తాను తప్పించుకోవాలని అనుకుంటాడు. కాని డామిట్ అనకుండానే కథ అడ్డం తిరుగుతుంది. మరో నలుగురు కుర్రాళ్లు ఏకంగా పవన మల్హోత్రానే కిడ్నాప్ చేస్తారు. చట్టానికి సహకరించే ఉద్దేశ్యంతోనే ఆ పని చేస్తారు. చివరకు ప్రైజ్ మనీ దక్కించుకుంటారు. ‘ఐతే’ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్‌ను మంచి దర్శకుడిగా నిలబెట్టింది. ఇందులో నటించిన శశాంక్ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. సింధు తులానీ హీరోయిన్ అయ్యింది. కల్యాణి మాలిక్ సంగీతంలో కీరవాణి పాడిన ‘చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే’ పాట హిట్. కిడ్నాప్ డ్రామాకు బిగువైన స్క్రిప్ట్ అవసరమని నిరూపించిన సినిమా ఇది. బ్రోచేవారెవరురా (2019) ఈ నేపథ్యంలో మొన్నటి వెంకటేష్ ‘ఘర్షణ’, ఇటీవలి ‘స్వామి రారా’ వంటి సినిమాలు కూడా కిడ్నాప్ డ్రామాతో నడిచాయి. తాజాగా ‘బ్రోచేవారెవరురా’ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఇందులో హీరోయిన్ నివేదితా థామస్‌ను ఆమె కోరిక మీదే కిడ్నాప్ చేసిన ఆమె ఫ్రెండ్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి తదితరులు ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లి బయటపడతారో వినోదభరితంగా చూపించారు. మంచి స్క్రీన్ ప్లే, ట్విస్ట్‌లు ఉండటం వల్ల కలెక్షన్లు విపరీతంగా వచ్చాయి. మనిషి అవసరానికి మించిన భూమిని బంధిస్తాడు. అవసరానికి మించిన నీళ్లను బంధిస్తాడు. అవసరానికి పశువులను, పక్షులను బంధిస్తాడు. కాని తనని ఎవరైనా బంధిస్తే మాత్రం గగ్గోలు పెడతాడు. ఈ గగ్గోలు ఉన్నంత కాలం కిడ్నాప్ సినిమాలు వస్తూనే ఉంటాయి. – కె. -
‘బ్రోచేవారెవరురా’ను వీక్షించిన బన్నీ
శ్రీ విష్ణు, నివేదా థామస్ కాంబినేషన్లో వచ్చిన బ్రోచేవారెవరురా చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథనాలతో, వినోదభరితంగా తెరకెక్కించిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రేక్షకులు మెచ్చిన ఈ చిత్రాన్ని సెలబ్రెటీలు సైతం మెచ్చుకుంటున్నారు. సినీ ప్రముఖుల నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసుల కురిపించారు. ‘బ్రోచేవారెవరురా చిత్రాన్ని చూశాను. చివరి వరకు థ్రిల్లింగా ఉండటంతో పాటు వినోదభరితంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్. శ్రీ విష్ణు మంచి చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు .. ‘బన్నీ థాంక్యూ వెరీ మచ్’ అంటూ నివేదా థామస్ బదులిచ్చింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. -
ఇది సమష్టి విజయం
‘‘బ్రోచేవారెవరురా’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇందులో ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ఇది మా టీమ్ సమష్టి కృషితో సాధించిన విజయం’’ అన్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. సత్యదేవ్, నివేతా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ్‌కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ‘‘సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది’’ అని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘థాంక్స్ మీట్’లో విజయ్‌కుమార్ మన్యం మాట్లాడుతూ –‘‘మా సినిమా చూసి ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కేటీఆర్‌గారు, సురేశ్‌బాబుగారు, వెంకటేశ్‌గారు, నానిగారు, అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్, రామ్.. ఇలా మా సినిమా గురించి మంచి మాటలు చెప్పిన అందరికీ థ్యాంక్స్. మంచి కలెక్షన్లు, మంచి ఓపెనింగ్స్ రావడానికి మంచి రివ్యూలు దోహదపడ్డాయి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసి సురేష్‌బాబుగారు బావుందన్నారు. ప్రీ రిలీజ్‌కి రామ్‌గారు, రోహిత్‌గారు వచ్చారు. దానివల్ల అందరికీ రీచ్ అయింది. ముందు రోజు నానిగారు చూసి బావుందని చెప్పడంతో అందరూ థియేటర్లకు వచ్చి మెచ్చుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
బ్రోచేవారెవరురా థ్యాంక్స్ మీట్
శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్రోచేవారెవరురా. సత్యదేవ్, నివేతా పేతురాజ్, రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శి ఇతర ప్రధాన పాత్రలో నటించారు. విజయ్‌కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా జూన్ 28న విడుదలై భారీ వసూళ్లు సాధిస్తూ దూపసుకుపోతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంల్లో ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నిర్వాణ, తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘మా సినిమాను అందరూ చూసి చాలా బావుందన్నారు. సురేష్ బాబు గారు మెచ్చుకున్నారు. ప్రీ రిలీజ్‌కి రామ్ గారు, రోహిత్ గారు వచ్చారు. దాని వల్ల అందరికీ రీచ్ అయింది. ముందు రోజు నానిగారు చూసి బావుందని చెప్పడంతో అందరూ థియేటర్లకు వచ్చి మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. సినిమాను పైరసీలో చూడొద్దు. మంచి థియేటర్లో చూస్తే బావుంటుంది’ అన్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ‘ఆడియన్స్‌కి ధన్యవాదాలు. ప్రెస్ వాళ్లందరూ ఫోన్ చేసి సినిమా గురించి ప్రశంసించారు. ప్రతీ ఒక్కరూ బాగా చేశారు. ఇది మా టీం అందరి సమిష్టి కృషితో సాధించిన విజయం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మాట్లాడుతూ ‘వివేక్ చాలా మంచి స్టోరీ రాసుకున్నారు. నిర్మాతకు తొలి సినిమాకే ఇంత పెద్ద హిట్ రావడం ఆనందంగా ఉంది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బావుంది. మా లిరిసిస్ట్లు అందరికీ ధన్యవాదాలు. సౌండ్ డిజైన్ చాలా బావుంది’ అన్నారు. నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ ‘సినిమా చాలా బావుంది. గత రెండు, మూడు వారాలుగా థియేటర్లలో చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. ఆడియన్స్ ఇలాంటి సినిమాలు చూడబట్టే కొత్త సినిమాలతో మేం కూడా ముందుకొస్తున్నాం. వివేక్ చాలా జీనియస్. నిర్మాత సినిమా మీద ఇంత ప్యాషన్‌తో చేసినందుకు థాంక్స్. నా పాత్రను చూసి అందరూ నవ్వుతుంటే చాలా ఆనందంగా ఉంది’ అన్నారు . నిర్మాత విజయ్‌కుమార్ మన్యం మాట్లాడుతూ ‘సినిమా చూసి ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు. అనిల్‌రావిపూడి, తరుణ్ భాస్కర్, రామ్, సురేశ్‌బాబు గారు, నానిగారు, వెంకటేశ్‌గారు, కె.టి.ఆర్‌గారు సహా అందరికీ థాంక్స్. మంచి కలెక్షన్లు రావడానికి, మంచి ఓపెనింగ్స్ రావడానికి మంచి రివ్యూలు దోహదపడ్డాయి. ప్రతీ రివ్యూలోనూ మా టీమ్‌ని ప్రశంసించినందుకు ధన్యవాదాలు’ అన్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘2019లో నాకు నచ్చిన సినిమా అని చాలా మంది చెప్పారు. నాకు టిక్కెట్లు దొరకలేదు. వివేక్ నాకు ఒక టికెట్ ఇప్పిస్తే బావుంటుంది. నేను రేపు 11కి ఏఎంబీలో చూస్తాను. మనస్ఫూర్తిగా చెప్పాలంటే వివేక్ ఆత్రేయకి ఇది వెల్ డిసర్వ్డ్ సక్సెస్. ఆయన ప్రతీ డీటైల్‌ను కేర్ ఫుల్‌గా చేశారు. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి నేను. తన పర్సనల్ జర్నీ కూడా నాకు తెలుసు. ఆయన ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి’ అన్నారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘నేను కథ రాసేటప్పుడు హ్యూమర్ రావాలంటే దీన్ని పారామీటర్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇటీవల నేను, వివేక్, గౌతమ్ తిన్ననూరి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాం. అందులో భాగంగా వివేక్ని నెక్స్ట్ ఏ సినిమా తీయబోతున్నారు అని అడిగితే ‘ఏదైనా నా స్ట్రగుల్, నా పెయిన్ నుంచి వస్తుంది’ అని చెప్పాడు. తను అలా చెప్పడం నాకు నచ్చింది. సెకండ్ ఫిల్మ్ అనేసరికి ఆబ్లిగేషన్‌లో పడకుండా, అడ్వాన్సుల్లో పడకుండా ఉండటం చాలా ఆనందంగా ఉంది. నివేదాకు క్లాసికల్ డ్యాన్స్ బాగా వచ్చు. నేను నిన్నుకోరిలో పిచ్చిపిచ్చిగా చేయించాను. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ఈ సినిమాలో కథ బావుండాలని అందరూ కృషి చేశారు. అదే ఈ సినిమాకు పెద్ద సక్సెస్. ఇప్పటిదాకా శ్రీవిష్ణు చేసిన సినిమాల్లోకి ఈ సినిమా పెద్ద సక్సెస్ అని అనిపించింది’ అన్నారు. -
‘బ్రోచేవారెవరురా’ విజయోత్సవ వేడుక
-
శ్రీ విష్ణును అభినందించిన వెంకీ
శ్రీవిష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్రోచేవారెవరురా. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా యూనానిమస్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. కామెడీతో పాటు సందేశాత్మకంగా ఉందంటూ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. సక్సెస్ ఆనందంలో ఉన్న శ్రీవిష్ణును ఓ సర్ప్రైజ్ కాల్ మరింత ఖుషీ చేసింది. (మూవీ రివ్యూ : బ్రోచేవారెవరురా) ఈ రోజు ఉదయం సీనియర్ హీరో వెంకటేష్, శ్రీవిష్ణుకు కాల్ చేసిన శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు శ్రీవిష్ణు. ఇటీవల జరిగిన బ్రోచేవారెవరురా ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీవిష్ణు తన అభిమాన కథానాయకుడు వెంకటేష్ అని తెలిపారు. అలాంటి వెంకటేష్ స్వయంగా కాల్ చేసి అభినందించటంతో శ్రీవిష్ణు ఆనందానికి అవదుల్లేవు. Proud moment !!!😀 when my morning starts with a applause cal from my inspiration hero Venkatesh garu!!!#Brochevarevarura @Brochevarevarra pic.twitter.com/7RkRhhyE0a — Sree Vishnu (@sreevishnuoffl) 29 June 2019 -
‘బ్రోచేవారెవరురా’ మూవీ రివ్యూ
-
‘బ్రోచేవారెవరురా’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్రోచేవారెవరురా నటీనటులు : శ్రీ విష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేథా పేతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు సంగీతం: వివేక్‌సాగర్ నిర్మాత : విజయ్ కుమార్ మన్యం దర్శకత్వం : వివేక్ ఆత్రేయ మెంటల్ మదిలో చిత్రంలో ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయ.. మొదటి ప్రయత్నంలోనే మెప్పించాడు. విభిన్న కథనంతో, తనదైన శైలితో తెరకెక్కించిన ప్రేమ కథను తెరపై అందంగా చూపించాడు. మొదటి ప్రయత్నంలో సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథ, కథనంతో ప్రయోగం చేయగా.. రెండో సారి అలాంటి కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ అమ్మాయి ఇంట్లో, సమాజంలో పడే కష్టాలు, ఎదురయ్యే బాధలను కథగా మలుచుకుని చేసిన ప్రయత్నమే ‘బ్రోచేవారెవరురా’. మరి ఈసారి వివేక్ ప్రయత్నం ఫలించిందా? ఆయనకు మరో విజయం లభించిందా? తెలియాంటే.. కథేంటో ఓసారి చూద్దాం. కథ ఓ అమ్మాయి తన ఇష్టాలను, కష్టాలను తల్లిదండ్రులతో చెప్పుకోవాలనుకుంటుంది. అమ్మాయి పడే కష్టాలను, ఆమె ఇష్టాలను, సమాజంలో ఆమెకు ఎదురయ్యే వేదింపులను నిర్భయంగా కన్నవారితో చెప్పుకునే స్వేచ్చను ఇవ్వాలి. అలా కాకుండా తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మాట్లాడలేనప్పుడు.. స్నేహితులతోనే, ఇంకెవరితోనో చెప్పుకుంటారు. తండ్రి నిరాదరణకు గురైన ఓ అమ్మాయి.. ఇంటిని కాదనకుని బయటకు వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదే ఈ కథ. దీంట్లో మిత్ర(నివేదా థామస్), రాహుల్ ( శ్రీ విష్ణు), విశాల్ (సత్యదేవ్), షాలిని (నివేథా పేతురాజ్) పాత్రలకు ఉన్న సంబంధమేంటనేది థియేటర్లో చూడాలి. నటీనటులు: మిత్ర పాత్రలో నివేదా థామస్ అద్భుతంగా నటించింది. తండ్రి ప్రేమకు దూరమైన మిత్ర క్యారెక్టర్లో నివేదా నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. లుక్స్ పరంగానూ నివేదా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అల్లరి చిల్లరగా తిరిగే రాహుల్ పాత్రలో శ్రీ విష్ణు మెప్పించాడు. తనకు అలవాటైన నటనతో రాహుల్ పాత్రలో ఈజీగా జీవించేశాడు. సినీ హీరోయిన్ షాలినీగా నివేధా పేతురాజ్, డైరెక్షన్ కోసం ప్రయత్నించే విశాల్‌గా సత్యదేవ్ బాగానే నటించారు. శ్రీ విష్ణు స్నేహితులుగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి గుర్తుండే పాత్రలో నటించారు. మిగతా నటీనటులంతా తమ పరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ ఓ చిన్న పాయింట్‌ను తీసుకున్న వివేక్ ఆత్రేయ.. తను అల్లిన కథ, కథనాన్ని పేర్చిన విధానం ఆకట్టుకుంటుంది. చిత్రంలో జరిగే ప్రతీ సన్నివేశానికి.. మళ్లీ ఎక్కడో లింక్ చేసి రాసిన కథనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మిత్ర పాత్రలో అమ్మాయి పడే కష్టాలను చూపిస్తూనే.. తండ్రి అనే వాడు ఎలా ఉండకూడదో చూపించాడు. ప్రేక్షకులకు ఏదో మెసెజ్ ఇస్తున్నట్లు కాకుండా.. కథనంలో భాగంగా తన మాటలతోనే ప్రేక్షకుడిని అర్థమయ్యేట్లు చెప్పాడు. ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు ఆలోచించేలా చేశాడు. కథనం స్లోగా నడస్తున్నా.. ఎంటర్టైన్మెంట్ను మిస్ చేయకుండా.. తను అనుకున్న కథను, తను చెప్పదల్చుకున్న పాయింట్‌ను ప్రేక్షకులకు విసుగు రాకుండా చెప్పాడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని పడిపడి నవ్వేలా చేసిన వివేక్.. కొంచెంకొంచెంగా అసలు పాయింట్‌ను చెబుతూ ఉంటాడు. చివరకు ఓ అమ్మాయికి తల్లిదండ్రులు, ఇళ్లే సురక్షితమని ముగించేస్తాడు. ఈ కథలో తిప్పిన ప్రతీ మలుపు ఆసక్తికరంగా ఉండటం, ఎంటర్టైన్మెంట్ పార్ట్‌ను ఎక్కడా వదలకపోవడంలోనే వివేక్ పనితనం అర్థమవుతోంది. వివేక్‌సాగర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం బాగుంది. ఎక్కడా కూడా పాటలు స్పీడ్ బ్రేకుల్లా అనిపించవు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగం సినిమా విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ నటీనటులు కథ దర్శకత్వం మైనస్పాయింట్స్ స్లో నెరేషన్ బండ కళ్యాణ్,సాక్షి వెబ్ డెస్క్. -
నా నటనలో సగం క్రెడిట్ అతనిదే
‘‘సినిమా రిలీజైన తర్వాత తెలుస్తుంది.. మనం చిన్న సినిమా చేశామా? పెద్ద సినిమా చేశామా? అని. ‘మెంటల్ మదిలో’ సినిమా చూశా. వివేక్ ఆత్రేయ చాలా బాగా తీశాడు. ఇలాంటి ప్రతిభ ఉన్న డైరెక్టర్‌కి ‘బ్రోచేవారెవరురా’ సినిమాకి మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు’’ అన్నారు హీరో రామ్. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రామ్ మాట్లాడుతూ– ‘‘నిన్నుకోరి’లో తొలి షాట్ చూసిన తర్వాత నివేదా మంచి నటి అని తెలిసింది. వివేక్ మ్యూజిక్ బావుంటుంది. నా ఫేవరేట్ లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రి. ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలో ‘తదుపరి జన్మకైనా...’ పాట రాశారు. ఈ సినిమాకి కూడా మంచి పాటలు రాశారు. శ్రీవిష్ణుని ఫస్ట్ టైమ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ టైమ్‌లో కలిశా. ఆ సినిమాలో నా నటనలో సగం క్రెడిట్ శ్రీవిష్ణుదే. తను చాలా మంచి నటుడు. నాకు నటన నేర్పించిన అరుణ భిక్షుగారు ఈ చిత్రానికి చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలు తీయగానే సురేష్ బాబుగారిలాంటి వాళ్లు ఇన్వాల్వ్ అయి సపోర్ట్ చేస్తున్నారు.. ఇందుకు చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్‌గారికి వీరాభిమానిని. ఈ సినిమాలో నేను ఆయన ఫ్యాన్‌గా చేయడం ఆనందంగా ఉంది. ‘బ్రోచేవారెవరురా’ కథని వివేక్ ఆత్రేయ చెప్పినప్పుడు చాలా నచ్చింది. మిత్ర పాత్రలో నివేదా బాగా నటించారు. ఆ పాత్రకోసం, కేవలం మహిళల కోసం ఈ సినిమా చేశా’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు సురేష్ బాబు. ‘‘మహిళలు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నివేదా థామస్. ‘‘విజువల్‌గా సినిమా రిచ్‌గా ఉంటుంది’’ అన్నారు విజయ్ కుమార్ మన్యం. ‘‘ఈ చిత్రం గురించి నేను మాట్లాడటం కన్నా సినిమా చూస్తేనే మంచిది’’ అన్నారు వివేక్ ఆత్రేయ. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నా’’ అన్నారు నారా రోహిత్. -
`బ్రోచేవారెవరురా` ప్రీ రిలీజ్ వేడుక
-
నా లైఫ్‌లో ఆ బ్యాచ్ ఉంటే బాగుంటుంది
‘‘స్క్రీన్ టైమ్ కాదు.. కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలని కోరుకుంటున్నాను. ఎగై్జట్ చేసిన స్క్రిప్ట్స్‌నే ఒప్పుకుంటున్నాను’’ అన్నారు నివేదా థామస్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్‌కుమార్ నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నివేదా థామస్ చెప్పిన కబుర్లు. ► ఇందులో నా పాత్ర పేరు మిత్రా. క్లాసికల్ డ్యాన్సర్ కావాలన్నది మిత్రా కోరిక. నా రియల్‌లైఫ్‌లో నా ఐదేళ్లప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందనే విషయాలను ఆసక్తికరంగా చూపించాం. మహిళలపై వేధింపుల అంశాన్ని చర్చించాం. స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటుంది. ► ‘ఆర్ 3’ బ్యాచ్ (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) వల్ల మిత్రా లైఫ్‌లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల ప్రభావం ఆర్3 బ్యాచ్‌పై పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎవర్ని ఎలా కాపాడుకున్నారు అన్నదే కథాంశం. ఇది ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాదు. సినిమాలోని అందరి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమా చేసిన తర్వాత నా లైఫ్‌లో ఆర్ 3 బ్యాచ్‌లాంటి వారు ఉంటే బాగుండు అనిపించింది. వివేక్ ఆత్రేయ మంచి డైరెక్టర్. మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ► నేనేం చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయాలనుకుంటాను. సీన్‌కు అవసరం అయితేనే హోమ్‌వర్క్ చేస్తాను. రొటీన్ సినిమాలు చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను. ‘జెంటిల్మన్’ అప్పుడే నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కుదర్లేదు. ‘118’ చిత్రం నుంచి నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా. ► తమిళంలో సినిమాలు చేయకపోవడానికి పెద్దగా కారణం ఏమీ లేదు. ‘జెంటిల్మన్’ తర్వాత తెలుగులో నాకు చాలా మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి. చేస్తున్నాను. హైదరాబాద్‌లో ఇల్లు కొనలేదు. కొనే ఆలోచనలో ఉన్నాను. ► ‘మీటూ’ అనేది మూమెంట్. మహిళలపై వేధింపులనేవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. యాక్టర్స్ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఈజీగా కామెంట్ చేయొచ్చని కొందరు అనుకుంటారు. సోషల్‌మీడియాలో నా పై ట్రోల్స్‌ను పట్టించుకోను. ► ప్రస్తుతం ఇంద్రగంటిగారి ‘వి’లో నటిస్తున్నా. ‘శ్వాస’ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రజనీకాంత్‌గారి ‘దర్బార్’ సినిమాలో నటిస్తున్నానా? లేదా? అనేది నేను చెప్పలేను. చిత్రబృందం అధికారికంగా చెబితే బాగుంటుందన్నది నా అభిమతం. -
అది ఇంకా ప్రశ్నే
‘బ్రోచేవారెవరురా అంటే కాపాడేవారు ఎవరురా అని అర్థం. ఈ సినిమాలో ఏ రెండు పాత్రలను తీసుకున్నా ఏదో ఓ సందర్భంలో ఒక పాత్ర మరో పాత్రను కాపాడుతుంది. దాంతో ‘బ్రోచేవారెవరురా’ అనే టైటిల్ బావుంటుందని పెట్టాం’’ అని దర్శకుడు వివేక్ ఆత్రేయ అన్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్‌కుమార్ నిర్మాత. సత్యదేవ్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వివేక్ ఆత్రేయ పంచుకున్న విశేషాలు... ► ఈ కథను నా మొదటి సినిమా ‘మెంటల్ మదిలో’ తర్వాతే రాసుకున్నాను. ఫస్ట్ రాజ్ కందుకూరిగారి బ్యానర్లో చేద్దామనుకున్నాను. ప్రొడక్షన్ ఆలస్యం అవుతుండటంతో ‘మళ్లీ ఏదైనా ప్రాజెక్ట్ కలసి చేద్దాం’ అని రాజ్సార్తో చెప్పి బయటకు వచ్చేశా. ► కథ రాసుకున్నప్పుడు శ్రీవిష్ణుని మనసులో పెట్టుకునే రాసుకున్నాను. వేరే వాళ్లకు కథ చెప్పినా, ఫైనల్‌గా విష్ణుతోనే చేశాను. ‘మెంటల్ మదిలో’ అప్పుడు మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇందులో ఉమెన్ హెరాస్మెంట్ పాయింట్‌ని టచ్ చేస్తూ లైట్ హార్ట్ కామెడీగా తెరకెక్కించాం. ప్రతి మహిళ చూడాల్సిన సినిమా ఇది. మిత్ర అనే పాత్ర నివేదా థామస్ తప్ప ఎవరూ చేయలేరు అన్నట్టుగా చేసింది. ► ఇందులో ఆర్3 బ్యాచ్ (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) ఐదేళ్లుగా ఇంటర్ చేస్తుంటారు. వాళ్లకు మిత్రా (నివేదా థామస్) పరిచయం అవుతుంది. తన వల్ల వీళ్ల లైఫ్ ఎలా మారింది అనేది కథ. ఇందులో సినిమా హీరోయిన్గా నివేదా పేతురాజ్, దర్శకుడు కావాలనే పాత్రలో సత్యదేవ్ చేశారు. ► ‘మెంటల్ మదిలో’ నచ్చింది, హిట్ అని కొందరంటారు. కొందరేమో ఇంకా బావుండాల్సింది అంటారు. సో ఫస్ట్ సినిమా హిట్టా లేదా? నాకు రావాల్సినంత పేరు వచ్చిందా? లేదా అనేది నాకింకా ప్రశ్నే. ఆ విషయాన్ని మెల్లిగా పట్టించుకోవడం మానేశాను. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత ఏ సినిమా చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. -
ఒక్క సెట్ కూడా వేయకుండానే..!
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం బ్రోచేవారెవరురా. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను పూర్తిగా ఒరిజినల్ లొకేషన్స్‌లోనే రూపొందించారట. కనీసం ఒక్క సెట్ కూడా వేయకుండా షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అదే నిజమైతే ఇది కూడా ఓ రికార్డే అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమాలు తప్ప కమర్షియల్ జానర్లో రూపొందించే సినిమాలు ఇలా పూర్తి ఒరిజినల్ లోకేషన్లో తెరకెక్కించిటం అరుదైన విషయమే. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన బ్రోచేవారెవరురా సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేదా పేతురాజ్, సత్యదేవ్‌లు కీలకపాత్రల్లో నటించారు. శ్రీవిష్ణు హీరోగా మెంటల్ మదిలో లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు. -
జూన్ 28న ‘బ్రోచేవారెవరురా’
శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ఈ చిత్రం జూన్ 28న విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రమిది. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వస్తోన్న రెండో చిత్రం ఇది. ‘చలనమే చిత్రము... చిత్రమే చలనము’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. సత్యదేవ్, నివేదా పేతురాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరాలందించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్నారు.‘బ్రోచేవారెవరురా’ ట్రైలర్, ఆడియో విడుదల గురించి త్వరలోనే నిర్మాత ప్రకటించనున్నారు. -
బిజీ బిజీగా నివేదా
ఇప్పుడు చేతినిండా చిత్రాలున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో నటి నివేదాపేతురాజ్ ఒకరు. ఒరునాళ్ కూత్తు చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన దుబాయ్ వాసి అయిన ఈ తమిళ అమ్మాయి.. ఆ తరువాత జయంరవికి జంటగా నటించిన టిక్ టిక్ టిక్ వంటి కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటిది 2019 నివేదా కేరీర్లో గుర్తుండిపోయే సంవత్సరంగా మిగిలిపోతుందని చెప్పవచ్చు. కారణం ఈ ఏడాదిలో అరడజనుకు పైగా చిత్రాల్లో నాయకిగా నటిస్తూ బిజీ బిజీగా ఉండటమే. తెలుగులోనూ వరుససినిమాలతో బిజీ అవుతున్నారు నివేదా. తమిళ్లో ఈ బ్యూటీ వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇప్పుడు ప్రభుదేవాతో పొన్ మాణిక్యవేల్, విష్టు విశాల్ సరసన జగజాల కిల్లాడి, విజయ్‌సేతుపతికి జంటగా సంఘతమిళన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటితో పాటు వాన్ అనే మరో చిత్రం నివేదా చేతిలో ఉంది. తాజాగా మాఫియా అనే చిత్రంలో నటుడు అరుణ్ విజయ్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకుముందు ధృవంగళ్ 16 చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు నరేన్ తదుపరి అరవిందస్వామి, సందీప్‌కిషన్, శ్రియలతో నరకాసురన్ చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా ఇంకా విడుదల కాలేదు. తదుపరి నటుడు పార్తీపన్ హీరోగా నాటక మేడై అనే చిత్రాన్ని రూపొందించాలని ప్రకటన కూడా విడుదల చేసిన నరేన్ దాని నిర్మాణాన్ని పక్కన పెట్టి తాజాగా మరో చిత్రానికి సిద్ధం అయ్యారు. అరుణ్ విజయ్ హీరోగా మాఫియా అనే టైటిల్‌తో గ్యాంగ్‌స్టర్ చిత్రం చేయనున్నారు. ఇందులో నటి నివేదా పేతురాజ్‌ను హీరోయిన్గా ఎంచుకున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. -
కాపాడేవారెవరు రా?
‘‘బ్రోచేవారెవరురా... అంటూ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ టైటిల్ చెప్పగానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. దాని అర్థం‘కాపాడేవారు ఎవరురా?’ అని చెప్పారు. కథ విన్నాక టైటిల్ ఈ సినిమాకు సూట్ అవుతుందనిపించింది’’ అని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్‌కుమార్ నిర్మాత. సత్యదేవ్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘శ్రీవిష్ణు చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు నేను క్లాప్ కొట్టాను. ఆ సినిమా బాగా ఆడింది. ‘బ్రోచేవారెవరురా’ ట్రైలర్ చాలా ఫన్నీగా, హాంటింగ్‌గా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఆల్రెడీ వివేక్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు చేసిన ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘వివేక్ ఫస్ట్ ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. అద్భుతమైన క్వాలిటీతో మన్యం విజయ్‌గారు నిర్మించారు. ఆయన మన్యం పులిలా విజృంభించి మరిన్ని సినిమాలు తీయాలి’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘ఇది టీమ్ వర్క్. ఇందులో ‘మంత్ర’ అనే పాత్ర చేశాను’’ అన్నారు నివేదా థామస్. ‘‘మెంటల్ మదిలో’ చూసి వివేక్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాను. లక్కీగా ఈ ప్రాజెక్ట్ సెట్టయింది. యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ తమ సపోర్ట్ అందించారు. జూన్‌లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత విజయ్‌కుమార్. -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘బ్రోచేవారెవరురా’
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు లీడ్ రోల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక పాత్రలు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేదా థామస్ లతో పాటు సత్యదేవ్, నివేదా పేతురాజ్‌లను టీజర్లో పరిచయం చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
చలనమే చిత్రము
వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము..’ అనేది ట్యాగ్ లైన్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. రంగురంగుల దుస్తుల్లో ఉన్న శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ఒకే స్కూటర్‌పై వెళుతుండటం ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపిస్తోంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణుకి జోడీగా నివేదా థామస్ నటించారు. సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు చేశారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమేరా: సాయి శ్రీరాం. -
కొత్తగా ‘బ్రోచేవారెవరురా’
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లేటెస్ట్ సెన్సేషన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కనపడతున్నారు. ఈ త్రయం రంగురంగుల దుస్తులు, షేడ్స్‌తో స్కూటర్ రైడ్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటిస్తుండగా సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.