షూటింగ్‌లో దర్శకుడు వివేక్‌తో హీరో శ్రీవిష్ణు
ఒకప్పుడు వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. ఒకరికొకరు పరిచయం కూడా లేదు. కానీ ఇద్దరి గమ్యం ఒక్కటే.. అదే ‘సినిమా’. ఇప్పుడు వారిద్దరూ ఒక్కటే. వారిని సినిమా ప్రపంచమే కలిపింది. ఒకరు సినీ హీరో అయితే, మరొకరు దర్శకుడిగా మారారు. వారే హీరో శ్రీవిష్ణు, దర్శకుడు వివేక్ ఆత్రేయ. విష్ణు బీబీఎం చదివి హైదరాబాద్ పయనమవగా.. వివేక్ బీటెక్ చేసి ఓ ప్రముఖ ఎమ్మెన్సీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. మనసంతా సినిమా వైపు లాగడంతో ఉద్యోగాన్ని వదిలేసి నగరానికి వచ్చేశాడు. వీరిద్దరూ తమ గమ్యాన్ని చేరుకుని ‘మెంటల్ మదిలో’ చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచేశారు. తర్వాత ‘బ్రోచేవారెవరురా’తో మరో హిట్ కొట్టారు. ఈ మిత్ర ద్వయం తమ సినీ ప్రయాణాన్ని.. అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే.. -సత్య గడేకారి
అమలాపురంలో మొదలై..
శ్రీవిష్ణు: నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లపైనే అయింది. మాది అమలాపురం సమీపంలోని గోడి గ్రామం. బీబీఎం చదివా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. వెంకటేష్ సినిమాలు అదేపనిగా చూసేవాణ్ని. చదువు, జాబ్ మనకు సెట్ కావని హైదరాబాద్ వచ్చేశా. వినయ్‌వర్మ వద్ద థియేటర్ ఆర్టిస్ట్‌గా చేరా. నటనలో కొన్ని మెళకువలు నేర్చుకున్నా. సినిమా కష్టాలను అనుభవించా. చిన్నచిన్న వేషాలు వేసింతర్వాత ‘బాణం’ చిత్రంలో చిన్న పాత్ర వేసి పేరు తెచ్చుకున్నా. తర్వాత ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’ నటుడిగా గుర్తింపు వచ్చింది.
అల్లు అర్జున్ ప్రశంసించారు..
ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా చూశాక హీరో అల్లు అర్జున్ ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు. తమిళంలో విజయ్ సేతుపతి, శివకార్తికేయన్‌లా నీకు మంచి టాలెంట్ ఉందని కితాబిచ్చారు. విభిన్న కథలను చేయమంటూ సలహా ఇచ్చారు. ఓ పెద్ద హీరో అభినందించడం చాలా సంతోషంగా అనిపించింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో బన్నీతో కలిసి నటించాను. మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ‘నీది నాది ఒకటే కథ’.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలు చేశాను.
ఇద్దరం.. వెంకటేష్ అభిమానులమే..
శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ: మేమిద్దరం చిన్నప్పటి నుంచి వెంకటేష్ అభిమానులమే. ఆయన తన ఇంటికి పిలిచి అభినందించడం మరిచిపోలేని అనుభవం. మమ్మల్ని ప్రోత్సహించిన సినీ పెద్దలకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఓ డిఫరెంట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాం. మేం వచ్చింది ఆంధ్రా ప్రాంతం నుంచే అయినా మాకు తెలంగాణ వంటలంటే ఎంతో ఇష్టం. హైదరాబాదీ కల్చర్‌పై మమకారం ఎక్కువ. తెలంగాణ స్నేహితులే ఎక్కువ. వారితో సాన్నిహిత్యం బాగా పెరిగింది.
గుంటూరులో షురువై..
వివేక్ ఆత్రేయ: మాది గుంటూరు. తమిళనాడులోని శాస్త్రి యూనివర్సిటీలో బీటెక్ చేశా. అప్పుడే కొంత మందిమి జట్టుగా ఏర్పడి షార్ట్‌ఫిలింస్ చేశాం. కావ్యం అనే షార్ట్‌ఫిలింకి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. జాబ్‌లో జాయిన్ అయినా ఎక్కడో ఏదో వెలితి అనిపించింది. జాబ్ మానేసి హైదరాబాద్ వచ్చేశా. కథలను రాసి యువ హీరోలతో పాటు నిర్మాతలను వినిపించడం మొదలుపెట్టా.
భిన్నమైన కథతో వచ్చాను
నేను రాసిన కథతో నిర్మాత రాజ్ కందుకూరిని కలిశాను. అప్పటికే ‘పెళ్లిచూపులు’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ‘మెంటల్ మదిలో’ కథ చెప్పాను. ఆయనకు అది బాగా నచ్చింది. శ్రీవిష్ణుని రికమెండ్ చేశారు. శ్రీ విష్ణుని కలిశాక ‘మెంటల్ మదిలో’ హీరో కన్‌ప్యూజ్డ్ క్యారెక్టర్ పర్‌ఫెక్ట్‌గా రెప్లికాలా అనిపించాడు. అతనికీ కథ బాగా నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది.
కథలోలీనమయ్యా..
శ్రీవిష్ణు: వివేక్ వచ్చి కలిసి కథ చెప్పడం మొదలుపెట్టాక. కథలో లీనమైపోయా. చాలా సూపర్బ్‌గా అనిపించింది. కానీ చెప్పిన విధంగా సినిమా తీస్తాడా అని కొద్దిగా భయం. అయితే, అతడిలో కాన్ఫిడెన్స్ కనిపించింది. చాలామంది నన్ను రిజర్వ్‌డ్ పర్సన్ అని అంటుంటారు. కానీ నేను అలా కాదు. వివేక్ కథ చెప్పాడు. ఈ కథ నీకే సూటవుతుందన్నాడు. అంతే సినిమా చకచకా సాగిపోయింది. 2017లో వచ్చిన ఈ పిక్చర్ మదిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాలో కాన్ఫిడెంట్ రెట్టింపు చేసింది.
టీంవర్క్‌తో విజయం సాధించాం
వివేక్ ఆత్రేయ: నేను బీటెక్ చేస్తున్న సమయంలో మేము సెట్ అయిన టీం.. మా జూనియర్స్ కలిసి టీంగా ఏర్పడ్డాం. అందులో చాలా మంది మంచి జాబ్స్ వదులుకొని వచ్చారు. సినిమా రిలీజ్‌కి దగ్గలో ఉన్నా సినిమాకి సంబంధించిన వర్క్ చాలా ఉంది. టీమంతా కష్టపడటంతో ‘బ్రోచేవారెవరురా’ చిత్రం విజయాన్ని నమోదు చేసుకుంది. చాలామంది ఫోన్లు చేసి అభినందించారు. అల్లు అర్జున్, వెంకటేష్, నాగచైతన్య, అడవిశేషు, సుప్రియల అభినందనలు ఆనందాన్నిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment