సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నంది అవార్డుల ఎంపికపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. 2014, 15, 16 సంవత్సరాలకు గాను అవార్డులు ప్రకటించగా కేవలం ఒక్క అల్లు అర్జున్ కు అది కూడా ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేటగిరిలో అవార్డు ప్రకటించటంపై విమర్శలు వస్తున్నాయి. చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ప్రకటించినా.. ఇతర హీరోలను పరిగణలోకి తీసుకోకపోవటం విమర్శలకు కారణమవుతోంది. మెగాఫ్యామిలీకి సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సహ నిర్మాతగా వ్యవహరించే బన్నీవాసు, అవార్డుల ఎపింకపై సెటైర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు నటన నేర్చుకోవాలి.
నంది అవార్డులు రావాలంటే తక్షణం చంద్రబాబు సర్కార్ వద్ద శిక్షణ తీసుకోవాలి అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. అవార్డు ప్రకటించిన మూడేళ్ల సమయంలో మెగా హీరోలు నటించిన పదిహేనుకుపైగా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి వీటిలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఎవడు, ధృవ, గోవిందుడు అందరివాడేలే.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలు కమర్షియల్ గాను ఘనవిజయాలు సాధించాయి.
కానీ ఈ సినిమాలకు గాను ఆ హీరోలకు ఏ అవార్డులు దక్కలేదు. గతంలోనూ నంది అవార్డుల ఎంపిక వివాదాస్పదమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అధికార పార్టీ వ్యక్తులకు, జ్యూరీ సభ్యుల అనుయాయులకు మాత్రం అవార్డులు దక్కుతాయన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ విమర్శలపై నంది అవార్డుల జ్యూరీ, టీడీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment