
‘‘ఒక చరిత్రని సినిమాగా తీయడం అంత సులభం కాదు. అలాంటి ఒక కొత్త చరిత్రని ‘ఛావా’ వంటి గొప్ప సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్‌గారికి ధన్యవాదాలు. ఈ రోజు మనం స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామంటే కారణం శంభాజీ మహారాజ్‌లాంటి మహావీరుల త్యాగ ఫలితమే. ‘ఛావా’(Chhaava Movie) మూవీ క్లైమాక్స్‌లో భావోద్వేగ సన్నివేశాలు చూసి కన్నీళ్లు వచ్చాయి’’ అని నిర్మాత బన్నీ వాసు (bunny vasu)తెలిపారు.
విక్కీ కౌశల్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తెలుగులో శుక్రవారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థాంక్స్ మీట్‌లో బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘ఛావా’ కేవలం సినిమా మాత్రమే కాదు... గ్రేట్ ఎమోషన్. నాలుగు రోజుల్లోనే పాటలని పూర్తి చేసిన ఏఆర్ రెహమాన్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోంది. తెలుగులో నాకు వాయిస్ ఇచ్చిన ఫణి వంశీగారికి థ్యాంక్స్’’ అని నటుడు వినీత్ కుమార్ సింగ్ తెలిపారు.
‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని మాడ్డాక్ సీఎఫ్‌ఓ దివ్యాంశ్ గోయల్ అన్నారు. ఈ థ్యాంక్స్ మీట్‌లో తెలుగు డైలాగ్ రైటర్ సామ్రాట్, తెలుగు డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ, లిరిక్ రైటర్ శ్రీమణి మాట్లాడారు.