ఊరికి పెద్ద... నలుగురు తమ్ముళ్లకు అన్నయ్య
పంచెకట్టు.. కోరమీసం... ఇప్పటికే విడుదలైన ‘కాటమరాయుడు’ సినిమాలో స్టిల్స్ చూస్తే పవన్ కల్యాణ్ కొత్తగా కనిపించనున్నారని ఊహించవచ్చు. గత సినిమాల్లో పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఈ వేషధారణలో కనిపించలేదు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘కాటమరాయుడు’లో ఆయన ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షనిస్ట్‌గా పవన్ ఆహార్యంతో పాటు మాట తీరు కూడా కొత్తగా ఉంటుందట! ‘‘నలుగురు తమ్ముళ్లకు అన్నగా, ఊరి పెద్ద ‘కాటమరాయుడు’గా పవన్ నటిస్తున్నారు.
రాయలసీమ నేటివిటీకి తగ్గట్టు సీమ యాసలో పవన్‌కల్యాణ్ డైలాగులు చెప్పనున్నారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడీ సినిమా చిత్రీకరణ చివరికి వచ్చిందట. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఉగాదికి... అంటే మార్చి నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు.