
న్యాయమే నా ఆయుధం
‘‘నయీమ్‌తో మాకు సంబంధాలున్నాయని నీ (నట్టికుమార్) దగ్గర ఆధారాలుంటే చూపించు. వాటిని పోలీసులకి చూపించి, మా తప్పుందని రుజువైతే శిక్షించమను. అంతేకానీ, అనవసరంగా నోరు జారితే తాట తీస్తా’’ అని నిర్మాత సి.కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ఆయనతో సహా పలువురు నిర్మాతలకు గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలున్నాయంటూ నట్టికుమార్ చేసిన ఆరోపణలపై శుక్రవారం సి.కల్యాణ్ మాట్లాడారు. ‘‘ఒకప్పుడు ఇదే నట్టికుమార్ మద్దెలచెరువు సూరి, భానుకిరణ్‌లతో నాకు సంబంధాలున్నాయని కోర్టులో కేసులు వేశాడు.
ఓ చీటింగ్ కేసు నుంచి అతణ్ణి బయట పడేయడానికి పోలీసులే నాపై కేసు పెట్టమన్నారని జడ్జ్ ముందు చెప్పాడు. నేను నిర్దోషిగా బయటపడ్డా’’ అని సి.కల్యాణ్ పేర్కొన్నారు. ఇంకా సి.కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘తెలంగాణ సిఎం కేసీఆర్, సీబీఐ, సిట్ అధికారులను కలుస్తాం. మా తప్పుంటే శిక్షించమని, లేదంటే నట్టికుమార్ పై చర్యలు తీసుకోమని కోరనున్నాం. న్యాయమే నా ఆయుధం’’ అన్నారు. ఎంతో మంది ఆర్టిస్టులను బ్లాక్‌మెయిల్ చేసిన ఘనుడు, ఎన్నో చెక్‌బౌన్స్ కేసుల్లో దోషి నట్టికుమార్ అని విమర్శనాస్త్రాలు సంధించారు. నయీమ్‌తో నట్టికుమార్‌కి ఏవైనా సంబంధాలు ఉన్నాయేమో? అవి బయట పడకూడదని ఇతరులపై ఆరోపణలు చేస్తున్నాడేమో అన్నారు. పరిశ్రమ పెద్దగా దాసరిగారు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించవలసిన అవసరం ఉందన్నారు.