దర్శకుడు ఓకే అంటే..గర్భవతినైనా రెడీ!
ముంబై:తాను గర్భవతినైన సమయంలో దర్శకుడు షూటింగ్ చేయడానికి రెడీ అయితే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని బాలీవుడ్ భామ రాణీ ముఖర్జీ స్పష్టం చేసింది. హాలీవుడ్ లో ఆ సాంప్రదాయం ఇప్పటికే కొనసాగుతుందని తాజాగా గుర్తు చేసింది. అక్కడ హీరోయిన్స్ గర్భవతులుగా ఉన్నా కూడా షూటింగ్ యాథావిధిగా పాల్గొంటారని రాణీ తెలిపింది. ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు కాస్త దూరమైనట్లున్నారు అన్న ప్రశ్నకు రాణీ పై విధంగా బదులిచ్చింది. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించబోయే చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది.
'మహిళలు గర్భవతులైన సమయంలో పని చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అప్పుడు వారికి శారీరకంగా అలసట ఉండటమే ప్రధాన కారణం. హాలీవుడ్ లో అయితే చాలామంది హీరోయిన్స్ గర్భం ధరించాక కూడా షూటింగ్ లో పాల్గొంటారు'అని తెలిపింది. 'నేను గర్భం దాల్చాక దర్శకుడు షూటింగ్ చేస్తానంటే ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడబోనని' రాణీ ముఖర్జీ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో దర్శక-నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లాడిన రాణీ ముఖర్జీ, త్వరలోనే తాను బిడ్డను కనాలనుకుంటున్నానని చెప్పింది. అయితే, తాను గర్భం దాల్చినట్లు ప్రచారంలోకి వచ్చిన కథనాలన్నీ వదంతులేనని ఆమె పేర్కొంది.