'సర్కార్'కు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
రామ్ గోపాల్ వర్మ ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక వివాదం ఉంటుంది. ఏది లేకపోతే వర్మ స్వయంగా వివాదాన్ని సృష్టిస్తుంటాడు. వర్మ వ్యక్తిత్వమే కాదు ఆయన సినిమాలు కూడా వివాదాస్పదమైన సందర్భాలు చాలా ఉన్నాయి. వర్మ తాజా చిత్రం సర్కార్ 3 విషయంలోనూ అదే కొనసాగుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ సీరీస్, సర్కార్. ఇప్పటికే రెండు భాగాలుగా ఘన విజయం సాధించిన ఈ సీరీస్లో ఇప్పుడు మూడో భాగం రిలీజ్కు రెడీ అవుతోంది.
త్వరలో వర్మ పుట్టిన రోజున రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా, ట్రైలర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. సాధారణంగా నిజజీవిత సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ముందు డిస్క్లైమర్ను జోడిస్తుంటారు. 'ఈ సినిమాలో చూపించిన సంఘటనలు, పాత్రలు పూర్తిగా కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఒకవేళ ఎవరినైనా పోలి ఉంటే అది యాధృచ్చికమేగాని ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు' అంటూ క్లారిటీ ఇస్తారు.
వర్మ తాజా చిత్రం సర్కార్ 3 ట్రైలర్ను సెన్సార్ చేసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ట్రైలర్కు కూడా డిస్క్లైమర్ను యాడ్ చేయాల్సిందిగా సూచించారు. సర్కార్ సీరీస్లో అమితాబ్ పోషించిన సుభాష్ నాగ్రే పాత్ర, బాల్ థాక్రేను పోలి ఉంటుంది. అందుకే తొలి రెండు చిత్రాలకు డిస్క్లైమర్ను జోడించారు. అయితే సర్కార్ 3 విషయంలో మాత్రం ట్రైలర్కే డిస్క్లైమర్ యాడ్ చేయాల్సి వచ్చింది. విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్న సర్కార్ 3 విడుదల తరువాత ఇంకెన్ని వివాదాలకు తెర తీస్తుందో చూడాలి.