
తమిళసినిమా: దర్శకుడు చేరన్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నూతనోత్సాహంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన తాజాగా ప్రధానపాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం తిరుమణం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. చేరన్ ఈ చిత్రంతో పాటే రాజావుక్కు చెక్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. దీనికి సాయిరాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు జయంరవి హీరోగా మళై చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. మధ్యలో తెలుగు చిత్ర పరిశ్రమ వైపు వెళ్లిన ఈయన చాలా కాలం తరువాత రాజ్‌కుమార్ పేరు ముందు సాయిని చేర్చుకుని తమిళంలో చేస్తున్న చిత్రం రాజావుక్కు చెక్. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది ఎమోషనల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.
రాజావుక్కు చెక్ కథను తయారు చేసుకున్న తరువాత ఇందులో ఏ హీరో అయితే బాగుంటుందన్న ఆలోచన వచ్చినప్పుడు ముందుగా మనసులో మెదిలింది చేరన్‌నేనన్నారు. కారణం కొన్ని విషయాలు చేరన్ లాంటి కొందరు నడివయసు నటులు చెబితేనే ప్రజల్లోకి చొచ్చుకుపోతాయన్నారు. అలాంటి ఒక సమస్యను ఆవిష్కరించే కథా చిత్రం రాజావుక్కు చెక్ అని చెప్పారు. అందుకే బాగా పాపులర్ అయిన చేరన్‌ను ఈ చిత్రానికి ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. తాము నమ్మినట్లుగానే ఆయన తనదైన శైలిలో ఈ చిత్రంలో నటించారని అన్నారు. ఇప్పటి వరకూ తమిళ తెరపై రానటువంటి కథాంశంతో రూపొందించిన చిత్రం రాజావుక్కు చెక్ అని అన్నారు. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగానే చేరన్ తన తిరుమణం చిత్రాన్ని ప్రారంభించారని, తమ చిత్రంలో ఆయనకు ప్రత్యేక గెటప్ అవసరం అవడంతో తిరుమణం చిత్రం పూర్తి అయిన తరువాత తమ చిత్రాన్ని చేయాలని భావించామన్నారు. ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చెప్పారు. ఇందులో చేరన్‌కు జంటగా సరయూమోహన్, నందనవర్మ, ఒక ముఖ్య పాత్రలో సృష్టిడాంగే అంటూ ముగ్గురు హీరోయిన్లు నటించారని తెలిపారు. సుండాట్టం చిత్రాల్లో నటించిన ఇర్ఫాన్ ఇందులో విలన్‌గా నటించినట్లు చెప్పారు. మలయాళంలో ప్రముఖ నిర్మాతలుగా పేరు పొందిన సోమన్ పల్లాట్, ధామస్ కొక్కాట్ తమ పల్లాట్ కొక్కాట్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం రాజావుక్కు చెక్ అని దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment