Chi la Sow Review, in Telugu | ‘చి.ల.సౌ.’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Fri, Aug 3 2018 7:40 AM | Last Updated on Fri, Aug 3 2018 11:04 AM

Chi La Sow Telugu Movie Review - Sakshi

టైటిల్ : చి.ల.సౌ.
జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిశోర్‌, రోహిణి, అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌
సంగీతం : ప్రశాంత్‌ విహారి
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్‌
నిర్మాత : అక్కినేని నాగార్జున, జస్వంత్‌ నాడిపల్లి, భరత్‌ కుమార్‌

అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్‌ తరువాత నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు సుశాంత్‌ హీరోగా ‘చి.ల.సౌ.’ సినిమాను తెరకెక్కించాడు రాహుల్‌. సెన్సిబుల్‌ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా నచ్చటంతో అన్నపూర్ణ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను రిలీజ్ చేశారు. నాగ్‌ను అంతగా మెప్పించిన అంశాలు చి.ల.సౌ.లో ఏమున్నాయి..? ఈ సినిమాతో సుశాంత్‌ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడా..? దర్శకుడిగా తొలి ప్రయత్నంలో రాహుల్ రవీంద్రన్‌ సక్సెస్‌ అయ్యాడా..?

కథ ;
ఐదేళ్ల వరకు పెళ్లే వద్దని పట్టుపట్టి కూర్చున్న అర్జున్‌ (సుశాంత్)ని ఎలాగైన పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటారు అమ్మానాన్నలు (అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌). ఇంట్లో పోరు సరిపోలేదన్నట్టుగా తన బెస్ట్‌ ఫ్రెండ్‌ సుజిత్‌ (వెన్నెల కిశోర్‌) కూడా అర్జున్‌ను పెళ్లి చేసుకోమని బలవంతపెడుతుంటాడు. వీళ్ల పోరు పడలేక ఓ అమ్మాయితో పెళ్లిచూపులుకు ఒప్పుకుంటాడు అర్జున్‌. రొటీన్‌ పెళ్లి చూపులు లా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసిన పేరెంట్స్‌.. (సాక్షి రివ్యూస్‌) అర్జున్‌ను ఒక్కడినే ఇంట్లో ఉంచి అమ్మాయి వస్తుంది మాట్లాడమని చెప్తారు. అంజలి (రుహాని శర్మ) ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో కుటుంబానికి తానే పెద్ద దిక్కు అవుతుంది. అంజలిని చూసిన అర్జున్‌ పెళ్లికి ఒప్పుకున్నాడా..? లేక తన మాట ప్రకారం ఐదేళ్ల వరకు పెళ్లి వాయిదా వేశాడా..? అసలు వాళ్ల పెళ్లి చూపులు ఎలా జరిగింది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
చెప్పుకోవటానికి చాలా మంది నటులు ఉన్న హీరో హీరోయిన్లు తప్ప మిగత అన్ని పాత్రలు దాదాపు అతిథి పాత్రలే. సినిమా అంతా అర్జున్‌, అంజలిల చుట్టూనే తిరుగుతుంది. అర్జున్‌ పాత్రలో సుశాంత్ సహజంగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే మంచి పరిణతి కనబరిచాడు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ప్రేమకథ కావటంతో డ్యాన్స్‌లు, ఫైట్లు చేసే ఛాన్స్‌ రాలేదు. నటన పరంగా మాత్రం ఫుల్‌ మార్క్‌ సాధించాడు సుశాంత్‌. హీరోయిన్‌ గా పరిచయం అయిన రుహాని శర్మ తొలి సినిమాతోనే సూపర్బ్‌ అనిపించింది. (సాక్షి రివ్యూస్‌) అర్జున్‌ మీద ఇష్టమున్నా కుటుంబ బాధ్యతల కారణంగా అవుననలేక, కాదనలేక మదన పడే పాత్రలో మంచి నటన కనబరిచింది. అందం, అభినయం రెండింటితోనూ మెప్పించింది. వెన్నెల కిశోర్‌ తన మార్క్‌ కామెడీ డైలాగ్స్‌, బాడీ లాంగ్వేజ్‌తో నవ్వించాడు. హీరోయిన్‌ తల్లిగా రోహిణి, హీరో తల్లి దండ్రులుగా అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌, ఇతర పాత్రల్లో విద్యుల్లేఖ రామన్‌, జయప్రకాష్ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ ;
దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాహుల్ రవీంద్రన్‌. రొటీన్‌ ప్రేమకథలకు భిన్నంగా పెళ్లిచూపులతో మొదలయ్యే ప్రేమకథతో ఆకట్టుకున్నాడు. దర్శకుడిగానే కాదు రచయితగానూ మంచి మార్కులు సాధించాడు. టేకింగ్‌లోనూ కొత్త దనం చూపించాడు. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక్క పూటలో జరిగే సంఘటనలు నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. (సాక్షి రివ్యూస్‌)ఫస్ట్ హాఫ్‌లో వెన్నెల కిశోర్‌, సుశాంత్‌ల కాంబినేషన్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ బోరింగ్‌గా అనిపిస్తాయి. పెళ్లిచూపులు సీన్‌ మొదలైన తరువాత కథనం ఇంట్రస్టింగ్‌ మారుతుంది. సినిమాకు సినిమాటోగ్రఫి మరో ప్రధాన బలం. షూటింగ్ పెద్దగా లోకేషన్లు లేకపోయినా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
కథా కథనం
లీడ్‌ యాక్టర్స్‌ నటన
కామెడీ

మైనస్‌ పాయింట్స్‌ :
ఎడిటింగ్‌
ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని బోరింగ్‌ సీన్స్‌

- సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement