
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడిపై పోరాటం చేస్తున్న కరోనా యోధులకు సంఘీభావంగా వారిపై గగనతలం నుంచి పూల వర్షం కురిపించడం అభినందనీయం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీటర్ వేదికగా వైద్యులు, సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల పైన పోరాడి, దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపైన దాడి చేస్తుంటే, అహర్నిశలు మనల్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి పుష్పాభివందనం చేయడం అభినందనీయం. మీ ఇద్దరికి మేమంతా రుణపడి ఉన్నాం. జై హింద్’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. (చదవండి : కరోనా యోధులకు గౌరవ వందనం)
కాగా, దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపై పోరాటం చేస్తున్న కరోనా యోధులపై పూలవాన కురిపించాలని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్‌రావత్ పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురింపించిన విషయం తెలిసిందే. వైద్యులు, పారామెడికల్, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా సాయుధ దళాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. కరోనా సేవలందిస్తున్న గాంధీ ఆసుపత్రితో పాటు రాత్రి, పగలు తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు, వైద్యులు, పారామెడికల్, పారిశుద్య సిబ్బందికి వాయుసేన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తూ తమ సంఘీభావం ప్రకటించారు. వాయుసేన పూలవర్షం కురిపించిన అనంతరం వైద్యులు చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
(చదవండి : మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్’ ఉడకదురా: చిరు)
Comments
Please login to add a commentAdd a comment