నిజ జీవిత ఘటనల సమాహారం
సినిమా కల్పన మాత్రమే కాదు. నిజ జీవితంలో జరిగే సంఘటనలకు ప్రతి రూపం. మనచుట్టూ జరిగే సంఘటనలే చిత్రాల్లో ఉంటారుు. అలాంటి మనలోని ఒకరికి ఎదురైన ఘోర అకృత్యాలే మాలిని 22 పాళయంకోటై చిత్రం అంటున్నారు చిత్ర దర్శకురాలు శ్రీప్రియ. ఒకనాటి ప్రముఖ హీరోయిన్ అయిన ఈమె ఇంతకు ముందు తమిళంలో నానే వరువేన్, శాంతి ముహుర్తం మరో రెండు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మాలిని 22 పాళయంకోటై ఐదవ చిత్రం. ఆమె భర్త రాజ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి నిత్యామీనన్ ప్రధాన పాత్ర పోషించారు. వర్ధమాననటుడు క్రిష్ ఆమెకు జంటగా నటించగా టాలీవుడ్ నటుడు నరేష్ ముఖ్యపాత్ర పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు శ్రీప్రియతో చిన్నభేటి....
ప్ర:మలయాళచిత్రం 22 ఫిమేల్ కొట్టాయం చిత్రాన్ని రీమేక్ చేయడానికి కారణం?
జ: ఈ ఏడాది ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను. అలాంటి సమయంలో నా స్నేహితురాలు ఒక సీడీ పంపి చూడమని చెప్పింది. ఆ చిత్రమే 22 ఫిమేల్ కొట్టాయం. చిత్రం చూసిన తర్వాత ఆత్మాభిమానం గల స్త్రీగా నాలో కొ న్ని ప్రశ్నలు తలెత్తాయి. కించిత్ కోపం కూడా కలిగింది.
ప్ర: కోపానికి కారణం?
జ: నేడు యువతులు, చిన్నారులపై అత్యాచార దురాఘాతాలు చూస్తుంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ కోపం వస్తుంది. రావాలి కూడా. అలా నా మనసును పిండేసిన ఒక సంఘటననే కమర్షియల్ అంశాలతో తెరరూపం ఇచ్చాను. అదే మాలిని 22 పాళయంకోటై.
ప్ర: ఒరిజినల్ చిత్రంలో రిమ్ కళింగళ్ నటించిన పాత్రను తమిళంలో నిత్యామీనన్‌ను ఎంచుకోవడానికి కారణం ?
జ: రిమ్ కళింగళ్ మలయాళ సంస్కృతికి అద్ధం పట్టేలా మం చి కమాండింగ్‌లా నటించారు. మళ్లీ ఆమెనే తమిళంలోను నటింప చేస్తే అనువాద వాసన వస్తుందనే ఉద్దేశంతో వేరే నటి కోసం అన్వేషిస్తుండగా నటి రాధిక నిత్యామీనన్ గురిం చి చెప్పారు. నిత్యను చూడగానే చాలా చిన్న అమ్మాయిలా అనిపించింది. అయితే కెమెరా ముందు వేరే విధంగా కని పించింది. అద్భుతమైన నటనను ప్రదర్శించింది.
ప్ర: హీరో క్రిష్ గురించి?
జ: నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో నటించడానికి కొందరు హీరోలు భయపడ్డారు. పాత్ర కొంచెం నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో వారి ఇమేజ్ డామేజ్ అవుతుందని భావించి నటించడానికి నిరాకరించా రు. క్రిష్ నటించమని అడిగాను. తను నాకు చిన్న వయసు నుంచీ తెలుసు. అతని తల్లిదండ్రులు నటులే. క్రిష్ ఇం తకుముందు మోహన్‌లాల్‌తో కలసి మలయాళంలో ఒక చిత్రం చేశాడు. ఈ సినిమాలో క్రిష్ కు మంచి పేరు వస్తుంది.
ప్ర: ప్రస్తుత కామెడీ ట్రెండ్‌లో సీరియస్ కథా చిత్రం తీశారే?
జ: సినిమా ట్రెండ్ మారుతుండడం సహజమే. అయితే మాలిని 22 పాళయంకోటై పూర్తిగా సీరియస్ చిత్రం కాదు. అలాగని ఆర్ట్ చిత్రం కాదు. కమర్షియల్ అంశాలు ఉంటా యి. ఆడియన్స్ రెండు విషయాల గురించి ఆలోచిస్తారు. థియేటర్‌లో కూర్చోగలమా? అన్నది ఒకటైతే చిత్రంలో ఏమి జరుగుతోందన్న ఆసక్తి కలిగిస్తుందా? లేదా? అన్నది మరొకటి. ఈ రెండు మా చిత్రంలో ఉన్నాయి.
ప్ర: దర్శకులుగా మహిళలు అంతగా రాణించలేకపోవడానికి కారణం?
జ: తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు అన్ని చోట్లా ఈ అభిప్రాయం ఉంది. దర్శకత్వం అనేది 24 గంటల పని. ఎలాంటి సమయంలోనైనా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అలా అందరూ చేయగలరా?. నా వరకు చెప్పాలంటే మా అమ్మాయిప్పుడు లా చదువుతోంది. అబ్బాయి ప్లస్1 చదువుతున్నాడు. ఇద్దరూ ఎదుగుతున్నారు. నా భర్త కొన్ని విషయాలు చూసుకుంటారు. దీంతో నేను పూర్తిగా సినిమాపై దృష్టి సారించగలుగుతున్నాను. ఇక్కడ లింగభేదాలు చూడ డం సరికాదు. కథలో భాగంగా ఏదైనా సంభాషణను రాస్తే ఒక మహిళ దర్శకురాలై ఉండి అలాంటి సంభాషణలు చెప్పించవచ్చా లాంటి మనస్తత్వంలో మార్పు రావాలి.