తండ్రి.. కొడుకు.. ఓ పురస్కారం
తాతయ్య చేతుల మీదుగా
బుజ్జి మనవడు పురస్కారం అందుకోవడం...
ఉత్తమ నటుడిగా అవార్డును
తండ్రి అందజేస్తుంటే...
కొడుకు పులకించిపోవడం...
అటు కొడుకు... ఇటు మనవడు... ఎందరో హేమాహేమీల సమక్షంలో
‘జీవితకాల సాఫల్య పురస్కారా’న్ని స్వీకరించడం...
ఈ అరుదైన... అపురూపమైన సంఘటనలకు వేదికగా నిలిచింది ‘మా టీవీ’ పురస్కారాల వేడుక. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది. నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణను లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. ‘1... నేనొక్కడినే’ చిత్రానికి ఉత్తమ నటుడిగా మహేశ్, కృష్ణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ -‘‘ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నాన్న చేతుల మీదుగా ఏ అవార్డూ అందుకోలేదు.
ఇదే ఫస్ట్ టైమ్. నా కెరీర్‌లో ‘1... నేనొక్కడినే’ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ మూవీ’’ అని సంతోషం వ్యక్తం చేశారు. ‘1...నేనొక్కడినే’లో బాలనటుడిగా చేసిన గౌతమ్ కృష్ణ బెస్ట్ స్పెషల్ ఎప్పీయరెన్స్ అవార్డును తాతయ్య కృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు. బెస్ట్ మూవీ (జ్యూరీ)గా ‘మనం’ చిత్రం ఎంపికైంది. అలాగే బెస్ట్ ఎక్సెప్షనల్ పెర్‌ఫార్మెన్స్ పురస్కారాన్ని నాగార్జున స్వీకరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ - ‘‘మా ఫ్యామిలీకి ‘మనం’ సినిమా ఎప్పుడూ ఎమోషనే. నాన్నగారు నటించిన ఆఖరి చిత్రమది.
ఆయన ఈ సినిమా చూడలేకపోయారనే బాధ మాకు ఉన్నప్పటికీ, పైనుండి మమ్మల్ని ఆశీర్వదిస్తారనే భావిస్తున్నా’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు. బెస్ట్ యాక్టర్ (ఓటింగ్)గా ఎంపికైన అల్లు అర్జున్ మాట్లాడుతూ -‘‘ఈ అవార్డును రామానాయుడు గారికి డెడికేట్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఫిలింఫేర్ అవార్డుని ఏయన్నార్ గారికి డెడికేట్ చేశారు. ఇండస్ట్రీ ఈ రోజు ఇలా ఉందంటే కారణం అలాంటి గొప్పవాళ్లే’’ అని చెప్పారు.
‘రేసుగుర్రం, మనం, ముకుంద, నేనొక్కడినే, లౌక్యం, రౌడీ, పవర్, లెజెండ్, చందమామ కథలు, నా బంగారు తల్లి’ తదితర చిత్రాలకు సంబంధించి వివిధ విభాగాల్లో పురస్కారాలు అందించారు. కె. రాఘవేంద్రరావు, విజయనిర్మల, వెంకటేశ్, ‘మా’ టీవీ ఛైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్, జయసుధ, జయప్రద, జగపతిబాబు, కోట శ్రీనివాసరావు, మంచు లక్ష్మీప్రసన్న, రకుల్ ప్రీత్‌సింగ్, సాయిధరమ్‌తేజ్, అనూప్ రూబెన్స్, అలీ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కథానాయికలు అంజలి, రాశీఖన్నా, హంసానందిని, రెజీనా, లక్ష్మీరాయ్ తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.