‘దబాంగ్‌ 3’ కలెక్షన్లు అంతేనా! | Dabangg 3 Movie Day Four Box Office Report | Sakshi
Sakshi News home page

నీరసించిన ‘దబాంగ్‌ 3’ కలెక్షన్లు

Published Tue, Dec 24 2019 6:04 PM | Last Updated on Tue, Dec 24 2019 6:23 PM

Dabangg 3 Movie Day Four Box Office Report - Sakshi

ముంబై: భారీ అంచనాల నడుమ విడుదలైన సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం ‘దబాంగ్‌ 3’ బాక్సాఫీస్‌ వద్ద ఎదురీదుతోంది. అంచనాలకు తగినట్టుగా ఆరంభ వసూళ్లు రాబట్టలేక ‘చుల్‌బుల్‌ పాండే’ చతికిల పడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 20న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.91.85 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. సల్మాన్‌ గత చిత్రం ‘భారత్‌’ మొదటి రోజునే రూ.42.30 కోట్లు కొల్లగొట్టగా, దబాంగ్‌ 3 కేవలం రూ.24.50 కోట్లు మాత్రమే రాబట్టింది. గతంలో వచ్చిన రెండు చిత్రాలు మంచి వసూళ్లు సాధించడంతో దబాంగ్‌ 3 భారీ ఓపెనింగ్స్‌ దక్కించుకుంటుందని అంచనా వేశారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలు ఈ సినిమాపై పడనప్పటికీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి వారాంతంలోపు పుంజుకోకపోతే కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే డిసెంబర్‌ 27న అక్షయ్‌ కుమార్‌ తాజా సినిమా ‘గుడ్‌న్యూస్‌’ విడుదలవుతోంది. ఈ సినిమా హిట్‌ అయితే ‘దబాంగ్‌ 3’ కలెక్షన్లు భారీగా పడిపోయే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 60 శాతం వరకు కలెక్షన్లు పడిపోయాయి. క్రిస్మస్‌ పండుగ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో వసూళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రభుదేవా తెరకెక్కించిన ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌కు జోడిగా సొనాక్షి సిన్హా నటించింది. కన్నడ నటుడు సుదీప్‌ ప్రతినాయక పాత్ర పోషించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement