కష్టకాలంలో ఆదుకున్నారు
బాధ, కష్టకాలాల్లో అండగా నిలిచిన మంచి మిత్రుడు దర్శకుడు వెట్రిమారన్ అని నటుడు ధనుష్ పేర్కొన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం కొడి. ఇందులో తొలిసారిగా అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. త్రిష, అనుపమ పరమేశ్వరన్ నాయికలుగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ రాజకీయవాదిగా ప్రధాన పాత్రను పోషించడం మరో విశేషం.
కాళీవెంకట్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్‌రూట్ ఫిలిం కంపెనీ పతాకంపై నిర్మించారు. ఈయన శిష్యుడు, ఇంతకు ముందు ఎదిర్ నీశ్చల్, కాక్కీసట్టై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆర్‌ఎస్.దురెసైంథిల్‌కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం కొడి. పూర్తి రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందించారు.
షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న కొడి చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత,దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ దివంగత దర్శకుడు బాలుమహేంద్ర నుంచి తనకు మంచి విషయాలు చాలా జరిగాయన్నారు.అదే విధంగా నటుడు ధనుష్ నుంచి కూడా అని పేర్కొన్నారు.
ఆర్థిక సమస్యల్లో ఉన్నాను ఒక చిత్రం చేసి పెట్టమని ధనుష్‌ను కోరానన్నారు. వెంటనే ఆయన దర్శకుడు దురెసైంథిల్‌కుమార్ చెప్పిన కథ లైన్ బాగుంది వినమన్నారు. దురెసైంథిల్‌కుమార్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని అలా తాను నిర్మాతను అయ్యాయని తెలిపారు. దర్శకుడు దురెసైంథిల్‌కుమార్ మాట్లాడుతూ తాను ఎలాంటి కథ తయారు చేసినా ముందుగా గుర్తు కొచ్చేది నటుడు ధనుష్‌నేనని అన్నారు. తనను దర్శకుడిని చేసింది ఆయనేనని తెలిపారు. ధనుష్ చిత్ర నిర్మాణ సంస్థలో ఎదిర్‌నీశ్చల్, కాక్కీసట్టై చిత్రాలకు దర్శకత్వం వహించానని, ఇప్పడు ఆయన హీరోగా కొడి చిత్రం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
కుటుంబసభ్యులతో చేసిన చిత్రం
నటుడు ధనుష్ మాట్లాడుతూ తన సుఖ సంతోషం సమయాల్లో చాలా మంది పాలు పంచుకున్నారని, అయితే కష్ట సుఖాల్లో అండగా ఉన్న ఏకైక మిత్రుడు దర్శకుడు వెట్రిమారన్ మాత్రమేనని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి నిర్మాణంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ వేదికపై ఉన్న వాళ్లందరు తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉన్న వాళ్లేనన్నారు.
అప్పటి నుంచి కలిసి పని చేస్తున్నామని చెప్పారు. అలా ఒక కుటుంబ సభ్యులతో కలిసి చేసిన చిత్రం కొడి అని పేర్కొన్నారు. తాను ఇంతకు ముందు నటించిన పుదుపేట్టై చిత్రంలో కొద్దిగా రాజకీయ సన్నివేశాలు చోటు చేసుకున్నా పూర్తి రాజకీయ నేపథ్యంలో నటించిన చిత్రం కొడి అని తెలిపారు. అదే విధంగా తొలి సారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇదేనన్నారు. త్రిష, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ చాలా బాగా నటించారని అన్నారు. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ధనుష్ వెల్లడించారు.