తడాఖా చూపించిన తాప్సీ! | Did you know Taapsee Pannu wrote her own dialogues for Tadka? | Sakshi
Sakshi News home page

తడాఖా చూపించిన తాప్సీ!

Published Sat, Jun 25 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

తడాఖా చూపించిన తాప్సీ!

తడాఖా చూపించిన తాప్సీ!

తాప్సీ అందంగా ఉంటారు.. బాగా నటిస్తారు.. చక్కగా మాట్లాడతారు... ఇది అందరికీ తెలిసిన విషయమే. తల్చుకుంటే ఈ బ్యూటీ డైలాగ్స్ కూడా రాయగలరు. ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఆమె ఓ సినిమాకి సంభాషణలు రాశారు. హిందీ చిత్రం ‘తడ్కా’లో ఆ డైలాగ్స్‌ని వినొచ్చు. ఇంతకీ ఇప్పుడు ఈవిడగారు రచయిత్రిగా మారడానికి కారణం ఏంటనే విషయంలోకి వస్తే...
 
 తెలుగు, కన్నడ భాషల్లో ప్రకాశ్‌రాజ్ నటించి, దర్శకత్వం వహించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం గుర్తుంది కదా! ఈ చిత్రాన్ని హిందీలో ‘తడ్కా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ప్రకాశ్‌రాజ్, శ్రీయ ఓ జంట కాగా, యువ జంటగా తాప్సీ, అలీ ఫాజల్ నటిస్తున్నారు. ‘మీ పాత్రలకు మీరే డైలాగ్స్ రాసుకోండి’ అని తాప్సీ, ఫాజల్‌కి ప్రకాశ్‌రాజ్ స్వేచ్ఛ ఇచ్చారట.
 
 ఆ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ - ‘‘ఏ ఆర్టిస్ట్ అయినా పాత్రను పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ పాత్ర ఏం మాట్లాడితే బాగుంటుందో వాళ్లకు తెలుస్తుందని ప్రకాశ్ సార్ అన్నారు. అప్పుడు ఆ ఆర్టిస్ట్ తాను చేసే పాత్ర మాట్లాడే డైలాగ్స్‌ని తానే రాసుకుంటే సహజత్వానికి దగ్గరగా ఉంటుందని కూడా ఆయన అన్నారు.
 
 అందుకే మా డైలాగ్స్ మేమే రాసుకున్నాం’’ అన్నారు. తాప్సీ, అలీ సొంతంగా డైలాగ్స్ రాయడంవల్ల ఓ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లే ఉందనీ, సినిమాటిక్‌గా లేదనీ చిత్రబృందం అంటోంది. మొత్తం మీద ‘తడ్కా’ సెట్‌లో  రైటర్స్‌గా తమ తడాఖా ఏంటో తాప్సీ, అలీ చూపించేశారన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement