గురువు చివరి స్క్రిప్ట్ శిష్యుడి చేతికి
గురువు స్క్రిప్ట్‌కు శిష్యుడు దర్శకత్వం వహించాలంటే అదృష్టం కావాలి. అదీ కే.బాలచందర్ వంటి ప్రఖ్యాత దర్శకుడు దర్శకత్వం వహించాలని సిద్ధం చేసుకున్న కథను శిష్యుడు తెరకెక్కించే అవకాశం రావడం నిజంగా ఆయనకు కలిగిన భాగ్యమే అవుతుంది. దర్శకుడు,నటుడు జాతీయ అవార్డు గ్రహీత సముద్రకణికి అలాంటి అరుదైన అవకాశమే తలుపుతట్టింది. ఆయన కే.బాలచందర్ శిష్యుడన్న విషయం తెలిసిందే. ఆ గురువు చివరి స్క్రిప్ట్‌ను చిత్రంగా మలిచే అదృష్టం ఈ శిష్యుడికి దక్కింది.
ఎన్నో అద్భుతాలను తెరపై ఆవిష్కరించిన దర్శక శిఖరం కే.బాలచందర్ కడవుళ్ కాన్‌బోమ్ అనే కథను తయారు చేసుకున్నారు. దాన్ని చిత్రంగా మలచాలన్నది డ్రీమ్‌గా భావించారు. ఆ కథను తన శిష్యుడు సమద్రకణికి వినిపించి అందులో ఆయన్ని ఒక పాత్ర పోషించమని అన్నారు. స్వీయ దర్శకత్వంలో కడవుళ్ కాన్‌బోమ్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుండగా బాలచందర్ కొడుకు కైలాసం కన్ను మూశారు. ఆ తరువాత కొద్ది కాలానికే ఆయన స్వర్గస్తులయ్యారు. ఇప్పుడాయన కల అయిన కడవుళ్ కాన్‌బోమ్ చిత్రాన్ని శిష్యుడు సముద్రకణి తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు.
తన గురువు 2014లో ఆ కథను తనకు చెప్పారన్నారు. అందులో ఒక ముఖ్య పాత్రను ఆయనే పోషించాలని తలచారన్నారు. తనను ఆ చిత్రానికి సహదర్శకుడిగా పని చేయమనడంతోపాటు ఒక పాత్రను చేయమని అన్నారనీ సముద్రకణి చెప్పారు.అప్పట్లో అది జరగలేదని,తన గురువు స్క్రిప్ట్‌ను తాను తెరకెక్కిస్తానని తెలిపారు.ప్రస్తుతం తాను అప్పా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్నానని,ఈ చిత్రం తరువాత కడవుళ్ కాన్‌బోమ్ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నారు.