Director K Balachander
-
అంతటి చరిష్మా ఏ దర్శకుడికీ లేదు
‘‘నేడు ఆ మహనీయుడి 90వ పుట్టినరోజు. ఆయన లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు’’ అంటున్నారు రజనీకాంత్. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ను ఉద్దేశించి ఆయన ఈ విధంగా అన్నారు. జూలై 9 బాలచందర్ జయంతి. ఈ సందర్భంగా రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. రజనీకాంత్ మాట్లాడుతూ –‘‘ఆ రోజు నన్ను ఆయన చేరదీసి సినిమాల్లో పరిచయం చేయకపోయుంటే ఈ రోజు ఇంత మంచి స్థాయిలో ఉండేవాడిని కాదు. కన్నడ సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేస్తూ ఏదో కొన్ని సినిమాలు చేసి ఉండేవాడినేమో. ఆయన నాకు అవకాశం ఇవ్వడంతోపాటు నా పేరు మార్చి (రజనీ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్), నా బలహీనతల్ని తొలగించి, నా బలాన్ని చాటి చెప్పారు. నన్ను పూర్తి స్థాయి నటునిగా తీర్చిదిద్దారు. తమిళ చిత్రపరిశ్రమలో స్టార్‌గా నిలబెట్టారు. నా తల్లిదండ్రులు, నా సోదరుడు, బాలచందర్‌గారు.. ఈ నలుగురూ నా జీవితానికి దేవుళ్లు. నాతో పాటు ఎంతోమంది నటీనటుల్ని తీర్చిదిద్దారాయన. నేను ఎంతోమంది దర్శకులతో పనిచేశాను. కానీ బాలచందర్‌గారు సెట్లోకి రాగానే లైట్‌బాయ్ నుండి ముఖ్య టెక్నీషియన్ల వరకూ అందరూ లేచి నిలబడి సెల్యూట్ చేసేవారు. అంతటి చరిష్మా ఉన్న దర్శకుడు కేబీగారు ఒక్కరే. వేరే ఎవరికీ ఆ చరిష్మా లేదంటే అది అతిశయోక్తి కాదు. ఆయన నా గురువు అని నేనీ మాటలు చెప్పటంలేదు. నిజంగా గొప్ప మహనీయుడు’’ అన్నారు. తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ (1975) ద్వారా రజనీకాంత్‌ను బాలచందర్ పరిచయం చేశారు. కమల్‌హాసన్, శ్రీవిద్య, సౌందరరాజన్, రజనీ, జయసుధ తదితరుల కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. తొలి చిత్రంతోనే నటుడిగా రజనీకి మంచి పేరు వచ్చింది. తమిళ పరిశ్రమకు సూపర్ స్టార్‌ని ఇచ్చిన సినిమా ‘అపూర్వ రాగంగళ్’. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘తూర్పు పడమర’గా దాసరి నారాయణరావు రీమేక్ చేశారు. తమిళంలో కీలక పాత్ర చేసిన శ్రీవిద్య తెలుగులోనూ నటించగా, ఇతర కీలక పాత్రల్లో తెలుగు తారలు నరసింహరాజు, కైకాల సత్యనారాయణ, మాధవి నటించారు. -
గురువు చివరి స్క్రిప్ట్ శిష్యుడి చేతికి
గురువు స్క్రిప్ట్‌కు శిష్యుడు దర్శకత్వం వహించాలంటే అదృష్టం కావాలి. అదీ కే.బాలచందర్ వంటి ప్రఖ్యాత దర్శకుడు దర్శకత్వం వహించాలని సిద్ధం చేసుకున్న కథను శిష్యుడు తెరకెక్కించే అవకాశం రావడం నిజంగా ఆయనకు కలిగిన భాగ్యమే అవుతుంది. దర్శకుడు,నటుడు జాతీయ అవార్డు గ్రహీత సముద్రకణికి అలాంటి అరుదైన అవకాశమే తలుపుతట్టింది. ఆయన కే.బాలచందర్ శిష్యుడన్న విషయం తెలిసిందే. ఆ గురువు చివరి స్క్రిప్ట్‌ను చిత్రంగా మలిచే అదృష్టం ఈ శిష్యుడికి దక్కింది. ఎన్నో అద్భుతాలను తెరపై ఆవిష్కరించిన దర్శక శిఖరం కే.బాలచందర్ కడవుళ్ కాన్‌బోమ్ అనే కథను తయారు చేసుకున్నారు. దాన్ని చిత్రంగా మలచాలన్నది డ్రీమ్‌గా భావించారు. ఆ కథను తన శిష్యుడు సమద్రకణికి వినిపించి అందులో ఆయన్ని ఒక పాత్ర పోషించమని అన్నారు. స్వీయ దర్శకత్వంలో కడవుళ్ కాన్‌బోమ్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుండగా బాలచందర్ కొడుకు కైలాసం కన్ను మూశారు. ఆ తరువాత కొద్ది కాలానికే ఆయన స్వర్గస్తులయ్యారు. ఇప్పుడాయన కల అయిన కడవుళ్ కాన్‌బోమ్ చిత్రాన్ని శిష్యుడు సముద్రకణి తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. తన గురువు 2014లో ఆ కథను తనకు చెప్పారన్నారు. అందులో ఒక ముఖ్య పాత్రను ఆయనే పోషించాలని తలచారన్నారు. తనను ఆ చిత్రానికి సహదర్శకుడిగా పని చేయమనడంతోపాటు ఒక పాత్రను చేయమని అన్నారనీ సముద్రకణి చెప్పారు.అప్పట్లో అది జరగలేదని,తన గురువు స్క్రిప్ట్‌ను తాను తెరకెక్కిస్తానని తెలిపారు.ప్రస్తుతం తాను అప్పా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్నానని,ఈ చిత్రం తరువాత కడవుళ్ కాన్‌బోమ్ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నారు. -
బాలచందర్‌కు అత్యవసర వైద్యం
ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం చెన్నై ఆల్వార్‌పేటలో గల కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్యం పొందుతున్నారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్సా విభాగంలో వైద్య సేవలందిస్తున్నారు. బాలచందర్ 1910లో తంజావూరు జిల్లా నన్నిలం గ్రామంలో జన్మించారు. బాలచదర్కు ఎనిమిదేళ్ల వయస్సు నుంచి సినిమాలపై ఆసక్తి కలిగింది. 12వ ఏడాదికే థియేటర్ ఆర్టిస్ట్ సంఘంలో సభ్యులయ్యారు. ఉన్నత విద్య పూర్తి చేసి తొలుత ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. చెన్నై మహాన గరానికి ఒక అకౌంట్ క్లర్క్‌గా అడుగుపెట్టారు. ఆ తరువాత యునెటెడ్ అమెరికన్ ఆర్టిస్టు నటన కంపెనీలో చేరారు. అనంతరం అతి త్వరలోనే తన కంటూ సొంతంగా డ్రామా గ్రూప్‌ను తయారు చేసుకుని మేజర్ చంద్రకాంత్, నాటకాన్ని రూపొందించి దర్శకత్వం వహిం చారు. ఆ తరువాత అదే నాటకంతో వెండితెరపై దర్శకుడిగా అవతరించారు. రజనీకాంత్, కమలహాసన్, ప్రకాష్‌రాజ్, సరిత, వివేక్ వంటి ప్రముఖ నటీనటులను పరిచయంచేసిన ఘనత కె.బాలచందర్దే. ప్రస్తు తం బాలచందర్ వయసు 84. ఈయన తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో 100 చిత్రాలకుపైగా చేసి భారతీయ సినీ కళామతల్లి గర్వించదగ్గ దర్శకుడిగా పేరొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. రజనీ కాంత్ ఆస్పత్రికి వచ్చి బాలచందర్‌ను పరామ ర్శించారు. నటి కుష్బుకూడా బాలచందర్‌ను పరామర్శించి కోలుకుంటున్నారని చెప్పారు.