టైటిల్ : డీజే దువ్వాడ జగన్నాథమ్
జానర్ : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్
తారాగణం : అల్లు అర్జున్, పూజ హెగ్డే, రావు రమేష్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : హరీష్ శంకర్
నిర్మాత : దిల్ రాజు, శిరీష్
గత ఏడాది సరైనోడు సినిమాతో బిగెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ డీజే దువ్వాడ జగన్నాథమ్. తొలిసారిగా బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బడిలో గుడిలో పాట విషయంలో వచ్చిన వివాదాలు కూడా సినిమాకు భారీ ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. బన్నీ మార్క్ కామెడీ, యాక్షన్తో పాటు హరీష్ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్తో తెరకెక్కిన డీజే, అల్లు అర్జున్ కెరీర్లో మరో బిగెస్ట్ హిట్గా నిలుస్తుందా..? హరీష్ మరోసారి కమర్షియల్ డైరెక్టర్ గా తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడా..? డీజే అయినా పూజ ఫేట్ మారిందా..?
కథ :
దువ్వాడ జగన్నాథమ్ (అల్లు అర్జున్).. విజయవాడ అగ్రహరంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కుర్రాడు. బ్రాహ్మణ ఆచారాల మధ్య పెరిగిన జగన్నాథమ్, అన్యాయాన్ని చూస్తే మాత్రం సహించలేడు. ఆచారాలు వ్యవహారాలు పాటిస్తూనే.. అన్యాయం చేసిన వాళ్లను మాత్రం ఇరగదీస్తాడు. జగన్నాథమ్ దూకుడు అడ్డుకట్ట వేయాలని తండ్రి(తనికెళ్ల భరణి), అతడి మెడలో రుద్రాక్ష వేస్తాడు. ఆ రుద్రాక్ష మెడలో ఉండగా ఎవరి మీద చెయ్యి వేయవద్దని ఒట్టు పెడతాడు. అందుకే తన కంటికి ఏ అన్యాయం కనిపించినా.. ఆ కొద్ది సేపు రుద్రాక్ష పక్కన పెట్టి తన పని కానిచ్చేస్తాడు. అర్జునుడిలా అసుర సంహారం చేస్తున్న జగన్నాథానికి కృష్ణుడిలా ఓ మార్గదర్శి తోడవుతాడు. ఎఫ్ఐఆర్ రైటర్ పురుషోత్తం (మురళీ శర్మ)ను ఓ గొడవలో కలిసిన జగన్నాథమ్ అతనితో కలిసి అన్యాయం చేసినవాళ్ల పనిపడుతుంటారు.
ఎవరికీ తెలియకుండా అన్యాయాన్ని తెగనరికే జగన్నాథమ్, బయటి ప్రపంచానికి అన్నపూర్ణ క్యాటరింగ్స్ నడుపుతుంటాడు. తన ఫ్రెండ్ విఘ్నేశ్వర శాస్త్రి (వెన్నెల కిశోర్) పెళ్లికి క్యాటరింగ్ చేయడానికి వెళ్లిన జగన్నాథానికి, పూజ (పూజ హెగ్డే) పరిచయం అవుతుంది. ఆమె అందం, అల్లరి నచ్చిన జగన్నాథమ్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ పెళ్లి వేడుక నుంచి తన కూతుర్ని చూసొస్తానని వెళ్లిన జగన్నాథమ్ బాబాయ్ ( చంద్రమోహన్) చనిపోతాడు. తాను పాతికేళ్లుగా దాచుకున్న డబ్బును అగ్రో డైమండ్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో స్థలం కోసం కట్టిన చంద్రమోహన్ మోసపోయానని తెలుసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు.
బాబాయ్ చావుతో జగన్నాథమ్ రగిలిపోతాడు. తనను ఎత్తుకొని పెంచిన బాబాయ్ చావుకు కారణమైన వాళ్లను ఎలాగైన బయటికి లాగాలని నిర్ణయించుకుంటాడు. చంద్రమోహన్ను మోసం చేసిన అగ్రో డైమండ్స్ సంస్థ ఎవరిది..? ఈ స్కాంకు పూజ తండ్రికి సంబంధం ఏంటి..? ఈ కథలో నాయుడు కన్స్స్ట్రక్షన్స్ రొయ్యలనాయుడు పాత్ర ఏంటి..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
అల్లు అర్జున్ మరోసారి తనదైన స్టైలిష్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. అగ్రహారంలో బ్రాహ్మణుడిగా, స్టైలిష్ కిల్లర్గా రెండు డిఫరెంట్ గెటప్స్లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణ కుర్రాడిగా బన్నీ చెప్పిన డైలాగ్స్కు థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. పంచెకట్టులో పద్దతిగా కనిపించినా.. మాస్ మసాలా సీన్స్ లోనూ ఇరగదీశాడు బన్నీ. హీరోయిన్ పూజ హెగ్డేకు నటనకు ఆస్కారం లేకపోయినా.. గ్లామర్ షోతో ఆకట్టుకుంది. సాంగ్స్లో బన్నీకి దీటుగా స్టెప్స్ వేసి మెప్పించింది. విలన్గా రావు రమేష్ మరోసారి తన వర్సటాలిటీ చూపించాడు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలవరితో రొయ్యలనాయుడు క్యారెక్టర్కు ప్రాణం పోశాడు. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, వెన్నెల కిశోర్, సుబ్బరాజులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లను రూపొందించటంలో స్పెషలిస్ట్గా పేరున్న హరీష్ శంకర్ మరోసారి తన మార్క్ చూపించాడు. హీరో పాత్రను బ్రాహ్మణుడిగా చూపించినా.. మాస్ ఎలిమెంట్స్ ఏమాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. రెగ్యులర్ కథే అయినా.. తన టేకింగ్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హరీష్ శంకర్ అందించిన డైలాగ్స్ సూపర్బ్గా పేలాయి. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమాను బాగానే నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ విషయంలో నిరాశపరిచాడు. యాక్షన్ మూడ్లో సాగుతున్న సినిమా క్లైమాక్స్ వచ్చే సరికి పూర్తిగా కామెడీ టర్న్ తీసుకోవటం కాస్త ఇబ్బంది పెడుతుంది. కామెడీ ఆకట్టుకున్నా.. క్లైమాక్స్లో ఉండాల్సిన ఇంటెన్సిటీ మాత్రం మిస్ అయ్యింది. దేశీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో ఎసెట్. టైటిల్ సాంగ్తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
అల్లు అర్జున్ యాక్టింగ్
పూజ హెగ్డే గ్లామర్
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
'డీజే దువ్వాడ జగన్నాథమ్' మూవీ రివ్యూ
Published Fri, Jun 23 2017 12:19 PM | Last Updated on Fri, Mar 30 2018 1:16 PM
Advertisement
Advertisement