సాదాసీదా పాత్రలొద్దు : అమృతారావు
సాదాసీదా పాత్రలొద్దు : అమృతారావు
Published Thu, Sep 12 2013 2:01 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
న్యూఢిల్లీ: నిన్నమొన్నటిదాకా పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రలను పోషించిన అమృతారావు ఇక నుంచి అలాంటి సాదాసీదా పాత్రల్లో నటించేందుకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వనని చెబుతోంది. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమృత మాట్లాడుతూ... సవాలు విసిరే పాత్రలతో ఎవరైనా ముందుకొస్తే సంతోషంగా అంగీకరిస్తానంటోంది.
పకాశ్ ఝా దర్శకత్వం వహించిన ‘సత్యాగ్రహ’ చిత్రం విజయవంతం కావడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కే చిత్రాల్లో నటించాలనే ఆసక్తి పెరిగిందని చెబుతోంది అమృత. చిత్రంలో అమితాబ్ బచ్చన్‌కు కోడలిగా నటించడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతూనే ఆయనతో నటించినన్ని రోజులు ఓవైపు నటిస్తూనే మరోవైపు ఎలా నటించాలో నేర్చుకున్నానని చెప్పింది.
అటువంటి చిత్రంలో తాను భాగస్వామినైనందుకు గర్వంగా ఉందని, సామాజిక చైతన్యాన్ని చాటిచెప్పే చిత్రాల్లో నటించడం ద్వారా నిజజీవితంలో కూడా ఎంతో కొంత మార్పు వస్తుందని , అది తనలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పింది. ‘సత్యాగ్రహ’లో నటించిన తర్వాత ఎన్నో నిర్మాణ సంస్థలు తన ఇంటి తలుపును తట్టాయని, అయితే పాత్రల ఎంపికలో తొందరపడబోనని చెప్పింది.
తన స్నేహితులు, సన్నిహితులు కూడా తనలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపడుతున్నారని, చాలా మంది ప్రశంసిస్తున్నారంది. ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని, అయితే వంద కోట్ల క్లబ్‌లో చేరుతుందో? లేదో? అనే విషయమై చిత్ర బృందం ఎవరూ పెద్దగా ఆలోచించడంలేదని చెప్పింది. తాను మాత్రం ఈ కోట్ల క్లబ్‌పై పెద్దగా ఆసక్తి చూపనని, సదరు క్లబ్‌లో చేరిన సినిమాలే గొప్ప సినిమాలని చెప్పడానికి వీలు లేదంది.
Advertisement