తన జీవితచరిత్ర బాలీవుడ్‌లో కలకలం రేపుతుందని నటుడు నసీరుద్దీన్ షా పేర్కొన్నాడు. నాలుగు దశాబ్దాలుగా హిందీ సినిమా రంగంలో కొనసాగుతున్న షా...
న్యూఢిల్లీ: తన జీవితచరిత్ర బాలీవుడ్‌లో కలకలం రేపుతుందని నటుడు నసీరుద్దీన్ షా పేర్కొన్నాడు. నాలుగు దశాబ్దాలుగా హిందీ సినిమా రంగంలో కొనసాగుతున్న షా... తన జీవిత చరిత్ర రాయడాన్ని 2002లో ప్రారంభించాడు. తన రాత నాణ్యతపై అంతగా నమ్మకం లేని షా... ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూనే ఉన్నాడు. ‘ఈ పుస్తకం ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందంటూ అనేకమంది అడుగుతున్నారు. ఆవిధంగా అడగడం నాకు ఆనందం కలిగిస్తోంది. శ్యామ్‌బెనెగల్, గిరీష్ కర్నాడ్, రామచంద్రగుహతోపాటు నా సోదరులు ఈ పుస్తకాన్ని చదివారు. వారికి ఇది ఎంతో నచ్చింది. రాతలో నాణ్యతపై నాకు కొంత సందేహం ఉంది. బాలీవుడ్‌లో ఇది కొంత కలకలం రేపుతుంది. అయితే ఆ అంశం గురించి నాకేమీ బాధగా లేదు’ అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఈ పుస్తకం విడుదల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ ప్రశ్నించగా తన జీవితచరిత్రపై అందరికీ ఆసక్తి ఉంటుందని తాను భావించడం లేదన్నాడు. ఇతరుల అభిప్రాయం తెలుసుకునేందుకే ఈ పుస్తకాన్ని రామచంద్ర గుహకు ఇచ్చానన్నాడు. ఆయన తనను ఎంతగానో ప్రోత్సహించాడని, ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నానని, ఇందుకు కారణం ఆయన మంచి రచయిత కావడమేనని అన్నాడు. క్రికెట్, గాంధీలపై ఆయన రాసిన పుస్తకాలను చదివానన్నాడు. అవి ఎంతో బాగున్నాయన్నాడు. నా పుస్తకం చదవదగినదిగా ఉందని ఆయన అనడంవల్ల ఇతరులు దానిని చదివేందుకు ఆసక్తి చూపుతారన్నాడు. ఆ మాట విన్న తర్వాతనే ఆ పుస్తకాన్ని రాయడాన్ని ముగించానని 64 ఏళ్ల నసీరుద్దీన్ అన్నాడు.
A