పాడితే తప్పేంటి?
న్యూఢిల్లీ: కథానాయకులు సినిమాల్లో పాటలుపాడడాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ స్వాగతించాడు. ఇటీవలికాలంలో పెరుగుతున్న ఈ సంస్కృతికి తాను మద్దతు పలుకుతానని కూడా చెబుతున్నాడు. పాటలు కూడా పాడడం ద్వారా నటీనటుల సత్తా, వారి సామర్థ్యం అభిమానులకు తెలుస్తుందన్నాడు. ‘నటీనటులు సినిమాల్లో పాటలు పాడితే తప్పేంటి? హాలీవుడ్‌లో ఏకకాలంలో నటిస్తూనే పాటలు కూడా పాడుతున్నారు. అదే సంస్కృతి బాలీవుడ్‌లో కొనసాగినా నేను స్వాగతిస్తాను. ఒకప్పుడు కమెడీయన్లు మాత్రమే కామెడీ చేసేవారు. ఇప్పుడు కథానాయకుడు కూడా కామెడీ చేస్తున్నాడు. అటువంటి చిత్రాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు కూడా.
మరికొందరు కథానాయకులు నెగెటివ్ పాత్రల్లో కనిపించి మెప్పిస్తున్నారు. అలాంటప్పుడు కథానాయకుడు పాటలు పాడితే మాత్రం తప్పేంటి?’ అని అక్షయ్ ప్రశ్నించాడు. భారత్‌లో వినోదాన్ని రెండుగా విభజిస్తే ఒకటి క్రికెట్ అవుతుందని, రెండోది సినిమా అవుతుందన్నాడు. క్రికెట్‌లో ఆటగాళ్ల ఫీట్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచినట్లుగానే సినిమాల్లో కూడా కథానాయకుడు రొటీన్‌కు భిన్నంగా చేసే ప్రతి పని కూడా ప్రేక్షకులకు, అభిమానులకు వినోదాన్ని పంచుతుందని అక్షయ్ అభిప్రాయపడ్డాడు. త్వరలో విడుదల కానున్న తన చిత్రం ‘ఎంటర్‌టైన్‌మెంట్’ ప్రచారం కోసం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అక్షయ్ పాల్గొంటున్నాడు.
చిత్ర ప్రచారం కోసం అక్షయ్‌కుమార్ ఓ పాట కూడా పాడాడు. దానిని రికార్డు చేసిన వీడియో దృశ్యాల ద్వారా చిత్ర ప్రచారాన్ని చేస్తున్నారు. అయితే ఇది సినిమాలో ఉన్న పాట కాదని, కేవలం ప్రచారం కోసం మాత్రమే రూపొందించామని చిత్ర నిర్మాతలు చెప్పారు. సినిమా ప్రచారాన్ని విభిన్నంగా చేయాలని నిర్ణయించామని, అప్పుడు వచ్చిన ఓ ఆలోచనే అక్షయ్‌తో పాట పాడించిందని, దానిని కేవలం ప్రచార కార్యక్రమాల్లో మాత్రమే వినియోగిస్తామని యూనిట్ సభ్యులు చెప్పారు.