నా మీద బురద చల్లొద్దు
‘‘నాన్‌సెన్స్.. ఆ మాటల్లో నిజం లేదు. ఇప్పుడే కాదు... ఎప్పుడూ నేనలా చెయ్యను. నా గురించి లేనిపోని వదంతులు సృష్టించి, నా మీద బురద చల్లొద్దు’’ అంటున్నారు కత్రినా కైఫ్. ఈ అందాల సుందరి ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షూటింగ్ నుంచి హఠాత్తుగా ఆమె వాకౌట్ చేశారనే వార్త జోరుగా షికారు చేస్తోంది. ఇది కత్రినాకు తెలిసి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. దీని గురించి ఆమె వివరంగా చెబుతూ -‘‘వృత్తిని దైవంగా భావించే ఆర్టిస్ట్‌ని నేను. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం నా నిఘంటువులో లేదు. ఆ యాడ్ షూటింగ్‌లో 12 గంటలు నిరాటంకంగా పాల్గొన్నాను. వాళ్లు చెప్పిన టైమ్‌కన్నా 5 గంటలు ఎక్కువగానే పని చేశాను.
12 గంటలు పని చేయడమంటే చిన్న విషయం కాదు. పైగా అదనపు పని గంటలకు నేను అదనపు పారితోషికం కూడా డిమాండ్ చేయలేదు. అలాంటిది నా గురించి అవాకులు చెవాకులు ప్రచారం చేయడం న్యాయం కాదు’’ అన్నారు. మరి.. కత్రినా గురించి ఎవరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నట్లు అంటే.. కాంపిటీషన్‌లో ఉన్న నాయికల్లో ఎవరో చేస్తున్న పని ఇది అని ఆమె స్నేహితులు అంటున్నారు. ఇవాళ సక్సెస్ అవ్వడం, దాని కాపాడుకోవడమే ముఖ్యం కాదని, శత్రువుల కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడం కూడా ముఖ్యమేనని కత్రినా ఫ్రెండ్స్ అంటున్నారు. అదను చూసి మాటల తూటాలు విసరడానికి కత్రినా కూడా సిద్ధంగా ఉన్నారట.