రజనీ ‘నో’.. కమల్ ‘ఎస్’!
అన్ని కథలూ అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి బ్రహ్మాండంగా ఉందనిపించిన కథ మరికొంతమందికి సాదాసీదాగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే, సినిమాలోని అన్ని సన్నివేశాలూ అందర్నీ సంతృప్తిపరచవు. అలా, మలయాళ చిత్రం ‘దృశ్యం’ విషయంలో రజనీకాంత్‌కి, కమల్‌హాసన్‌కి భిన్నాభిప్రాయం ఏర్పడింది. మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పరభాషలవారు రీమేక్ చేయడానికి ఉత్సాహపడుతున్నారు. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో వెంకటేష్ నటించబోతున్నారు. తమిళ రీమేక్‌లో కమల్‌హాసన్ చేయబోతున్నారు. మలయాళ ‘దృశ్యం’కి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్ఫే తమిళ వెర్షన్‌ని తెరకెక్కించబోతున్నారు.
ఈ చిత్రానికి ముందు కమల్‌ని కాకుండా రజనీకాంత్‌ని హీరోగా అనుకున్నారు జీతు. మలయాళ ‘దృశ్యం’ని చూసి, రజనీ కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. అక్కడ మోహన్‌లాల్ చేసిన లీడ్ రోల్‌ని చేయడానికి ఉత్సాహపడ్డారు కూడా. కానీ, కొన్ని సన్నివేశాల విషయంలో రజనీ సందేహపడ్డారు. ఆ సన్నివేశాలు తన అభిమానులకు నచ్చుతాయా? అనే సందేహం వ్యక్తపరిచారు ఈ సూపర్‌స్టార్. చివరికి ఈ సినిమా చేయాలనే ఆలోచన విరమించుకున్నారు. ఆ తర్వాత జీతు కోరిన మీదట కమల్ ‘దృశ్యం’ని చూడటం, పచ్చజెండా ఊపడం జరిగిపోయింది. కమల్‌లో మంచి రచయిత కూడా ఉన్నాడు కాబట్టి, కథలో మార్పులు, చేర్పులు చేయడానికి సహకరిస్తానని జీతూకి మాటిచ్చారు. ఈ చిత్రం షూటింగ్‌ని జూన్‌లో ప్రారంభిస్తామని జీతు పేర్కొన్నారు.