ఇదో.. హారర్.. థ్రిల్లర్!
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుండటంతో ఈ తరహా చిత్రాలను క్యాష్ చేసుకునే పని మీద చాలామంది ఉన్నారు. ఈ ట్రెండ్‌ని అనుసరిస్తూ, హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. శ్రీకాంత్, కామ్నా జెఠ్మలాఠిట జంటగా ‘వీడికి దూకుడె క్కువ’ చిత్రంతో నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బెల్లం రామకృష్ణారెడ్డి ఇప్పుడీ హార ర్ చిత్రంతో దర్శకునిగా మారారు. కార్తీక్, కశ్మీర జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల అయింది.
కథ: ఓ పాప తన తండ్రి ప్రతి రోజు రాసుకుంటున్న డైరీ చదవడంతో ప్రస్తుతంలో ఉన్న కథ ఐదేళ్ల వెనక్కి వెళుతుంది. అఖిల్ (కార్తీక్), అభినయ (కశ్మీర) ఇద్దరూ బీటెక్‌లో ఉన్నప్పుడే ప్రేమలో పడతారు. జాబ్ వచ్చాక తల్లితండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే... అభినయ జీవితంలో పెను విషాదం. ఆమె తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు. అందర్నీ కోల్పోయి అనాథగా మారిన అభినయ జీవితానికి అండగా నిలుస్తాడు అఖిల్. ఈలోగా బీటెక్ పూర్తి కావడం, ఇద్దరికీ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం చకచకా జరిగిపోతాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ సమక్షంలో ఇద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. అఖిల్, అభినయలకు మరో ఫ్రెండ్ పెళ్లిళ్ల బ్రోకర్ అయిన అన్వేష్ (మధు) అన్ని వేళలా తోడుగా నిలుస్తాడు. ఇలా కాలం వేగంగా పరుగులు తీస్తుంది. వీరిద్దరి ప్రతిరూపంగా పుట్టిన హనీతో అఖిల్, అభినయల జీవితం రంగులకలగా సాగిపోతూ ఉంటుంది. ఇంతలో ఉద్యోగార్థం యూరోప్ ట్రిప్‌కు వెళ్లడానికి అఖిల్ సిద్ధమవుతాడు. కానీ, అభినయ, హనీలకు అతను వెళ్లడం ఇష్టం ఉండదు. ఎందుకంటే రెండేళ్ల తర్వాత గానీ అఖిల్ ఇండియాకు రాడు. కూతురు హనీ భవిష్యత్తు కోసం తప్పనిసరిగా వెళ్లాల్సిందే అనుకుంటాడు అఖిల్.
ఎయిర్‌పోర్ట్‌కు వెళుతుండగా కారు ప్రమాదంలో అతను చనిపోయాడని టీ వీలో బ్రేకింగ్ న్యూస్. ఈ వార్త చూసిన అన్వేష్ ఈ విషయం అభినయకు చెప్పడానికి వెళతాడు. కానీ అక్కడ ఇద్దరూ అన్వేష్‌తో ఫోన్‌లో మాట్లాడటం చూసి షాక్ కు గురవుతాడు. అసలు అఖిల్ నిజంగా చనిపోయాడా? లేదా అని రూఢి చేసుకోవడానికి మార్చ్యురీకి వెళతాడు. నిజమే అక్కడ ఉన్నది అఖిల్ శవమే. అతని ఐడీ కార్డ్, చొక్కా అన్వేష్‌కి ఇస్తారు మార్చ్యురీ సిబ్బంది. ఈ విషయం చెబుదామని అఖిల్ ఇంటికి వెళ్లిన అన్వేష్‌కు ఆ ఇంటి నుంచి రకరకాల శబ్దాలు, ఓ పాప అరుపులు, వినిపించడంతో అక్కడి నుంచి పారిపోతాడు. గందరగోళానికి గురైన అన్వేష్ తర్వాత రోజు మార్చ్యురీకి వెళితే అఖిల్ శవం ఉండదు. అఖిల్ చనిపోయాడా? లేదా? అనేది మిగతా కథ. ‘ప్రాణం’, ‘వాన’ చిత్రాల ద్వారా సంగీతదర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ప్రాణం’ కమలా కర్ స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ‘ఏ కలలో...’ పాట బాగుంది. సంతోష్ కెమెరా పనిత నం కనిపిస్తుంది.