
పక్కనున్న ఫొటోలో చూశారుగా హీరో దుల్కర్ సల్మాన్ ఎంత కష్టపడుతున్నాడో! చూస్తుంటే.. ఏదో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు ఉంది కదూ! కష్టపడుతుంది నిజమే కానీ.. ఎగ్జామ్ కోసం కాదు. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగఅశ్విన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘మహానటి’. తమిళంలో ‘నడిగర్ తిలకమ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, కీర్తీ సురేశ్, సమంత, దుల్కర్ సల్మాన్‌తో పాటుగా మరికొందరు సినీప్రముఖులు నటించిన ఈ చిత్రం షూటింగ్ కంప్లీటైంది. సావిత్రి పాత్రలో
కీర్తీ సురేశ్ నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఈ వర్క్స్‌లో భాగంగానే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తన పాత్రకు తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నారు. దుల్కర్ పలికిన తెలుగు పలుకులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ‘‘ఎగ్జామ్స్ కోసం నేను బాగా కష్టపడుతున్నానని అనుకోకండి. తెలుగులో డబ్బింగ్ చెప్పేందుకు నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను’’ అని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు. అంటే.. దుల్కర్ కష్టంతో కాదు... ఎంతో ఇష్టంగా తెలుగు ప్రాక్టీస్ చేసి, మాట్లాడుతున్నారన్న మాట. ‘మహానటి’ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయనున్నారు.