పోలీసుల చేత ఫోన్లు చేయించారు | Evaru Movie Press Meet | Sakshi
Sakshi News home page

పోలీసుల చేత ఫోన్లు చేయించారు

Published Sat, Aug 24 2019 12:34 AM | Last Updated on Sat, Aug 24 2019 8:54 AM

Evaru Movie Press Meet - Sakshi

‘‘నన్ను థ్రిల్లింగ్‌ స్టార్, బడ్జెట్‌ స్టార్‌ అంటున్నారు. అవేమీ వద్దు. పూల దండలు, పొగడ్తలు అవసరం లేదు. ఎప్పటికీ మంచి సినిమాల శేష్‌గా ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు’’ అన్నారు అడివి శేష్‌. వెంకట్‌ రామ్‌జీ దర్శకత్వంలో అడివి శేష్, రెజీనా, నవీన్‌ చంద్ర ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పీవీపీ పతాకంపై పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది.

శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడివి శేష్‌ మాట్లాడుతూ– ‘‘కుర్రాడు కాలిఫోర్నియా నుంచి వచ్చాడు. ఇంగ్లీష్‌ టాకింగ్, వాకింగ్‌ బాగుంది. ఇక్కడ సినిమాలు చేస్తూ అక్కడ సౌకర్యవంతమైన జీవితం లీడ్‌ చేస్తుంటాడని నా గురించి మొదట్లో అనుకుని ఉంటారు. కానీ అలాంటిది ఏం లేదు. మాది అక్కడ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీయే. మా నాన్నగారు హోటల్‌ మేనేజర్‌గా చేశారు. మా అమ్మగారు వెయిట్రస్‌గా చేశారు. నాకూ కృష్ణానగర్‌ కష్టాలు ఉన్నాయి. ‘పంజా’ తర్వాత కూడా అవి తగ్గలేదు.

ఆ సినిమా తర్వాత విలన్‌గా నీకు ఫాలోయింగ్‌ వచ్చింది. హీరోగా ట్రై చేయమన్నారు. ఆ సమయంలో ‘కిస్‌’ సినిమా చేశాను. మ్యాట్నీ షో టైమ్‌కి ఓ డిస్ట్రిబ్యూటర్‌ ఫోన్‌ చేసి రెండు మూడు కోట్లు పోతాయన్నాడు. నా జేబులో పది రూపాయలు కూడా లేని పరిస్థితి. అప్పులు ఇచ్చిన వారు కొందరు పోలీసుల చేత ఫోన్లు చేయించారు. సినిమా నిలబడితేనే అందరూ మాట్లాడతారు. నా సినిమా నిలబడాలని కోరుకుంటాను. ఎందుకంటే మరోసారి నేను పోలీస్‌ స్టేషన్‌లో నిలబడను. ‘ఎవరు’ సక్సెస్‌ తర్వాత 48 గంటల్లో ఆరుగురు నిర్మాతలు ఫోన్‌ చేసి ‘కథ ఉందా? నీపై నమ్మకం ఉంది’ అన్నారు.

ఆ నమ్మకం కోసమే కష్టపడుతున్నాను. డబ్బు లేనప్పుడు కూడా నన్ను నమ్మింది రచయిత అబ్బూరి రవిగారే. నా బ్యాక్‌గ్రౌండ్‌ ఆయనే. నాపై నమ్మకం ఉంచిన పీవీపీ గారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘అవుట్‌పుట్‌ ప్రేక్షకులకు నచ్చేలా రావడానికి మాలో మేం గొడవలు పడ్దాం. ఫైనల్‌గా సినిమా గెలిచింది. ఈగోల కన్నా సినిమా చాలా పెద్దది. శేష్‌ ఇంకా మంచి సినిమాలు చేయాలి. రామ్‌జీ తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచుతాడు. ‘ఎవరు’ లైబ్రరీ ఫిల్మ్‌ వంటిది’’ అన్నారు అబ్బూరి రవి.

‘‘శేష్‌ ఆల్రెడీ రెండు హిట్స్‌ (క్షణం, గూఢచారి)తో ఉన్నాడు. ఏం చేయాలా? అనుకున్నా. ‘ఏం చేసినా నమ్మకంతో చేయి’ అన్న అబ్బూరి రవిగారి మాటలు నాకు సహకరించాయి. మా సినిమాకు కో డైరెక్టర్‌ లేడు. మా ఏడీ టీమ్‌ సుధీర్, సూర్య, మనీషా, దివ్య బాగా కష్టపడ్డారు. నాకు కృష్ణానగర్‌ కష్టాలు లేవు. నా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్‌ చేస్తోంది. నా స్నేహితులే నా ఎమోషనల్‌ సపోర్ట్‌’’ అన్నారు వెంకట్‌ రామ్‌జీ. ‘‘థ్రిల్లింగ్‌ స్టార్‌ అనేది శేష్‌కు కరెక్ట్‌గా సరిపోతుందనిపిస్తుంది. ఈ సినిమాను పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు రెజీనా. నటులు సాయి, శశి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్, డీఓపీ వంశీ పచ్చిపులుసు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత కేకే, భాను మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement