రెజీనా
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు ‘ఎస్.ఎమ్.ఎస్’ చిత్రంతో 2012లో ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నా కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నా. నాకు నచ్చిన పాత్రలను ఎంచుకుని వాటికి న్యాయం చేస్తున్నా. కానీ, పెద్ద సినిమాలు రాకపోవటానికి కారణం ఏంటో తెలియదు. అయితే నేను మంచి సినిమాలు, హిట్ సినిమాలు చేశాను’’ అని రెజీనా అన్నారు. అడివి శేష్, రెజీనా జంటగా నవీన్ చంద్ర కీలక పాత్రలో వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పివిపి సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా రెజీనా పంచుకున్న విశేషాలు...
► పీవీపీగారు ఓ రోజు ఫోన్ చేసి, వెంకట్ రామ్‌జీ అనే కొత్త దర్శకుడు కథ చెప్తారు వినండి, నచ్చితే చేద్దాం అన్నారు. అడివి శేష్, రామ్‌జీ చెన్నై వచ్చారు. రామ్‌జీ రెండు గంటలు పాటు ‘ఎవరు’ కథ చెప్పినప్పుడే తనపై పూర్తినమ్మకం కుదిరింది. పైగా కథ చాలా బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తానని చెప్పాను.
► ఈ చిత్రంలో సమీర అనే పాత్ర చేశా. ఆమె జీవితంలో ఓ సంఘటన జరుగుతుంది. అది ఏంటి? చివరికి సమీర జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అన్నదే చిత్ర కథ.
► సమీర పాత్ర పూర్తి సంతృప్తినిచ్చింది. ఫుల్‌మీల్స్‌లాగా అన్నమాట. ‘నక్షత్రం’ సినిమాలో డబ్బింగ్ చెప్పా. పూర్తిస్థాయి పాత్ర చేసి, ఫుల్‌గా డబ్బింగ్ చెప్పిన తొలి చిత్రం ‘ఎవరు’.
► ‘ఏక్ లడ్‌కీ కో దేఖాతో ఐసే లగా’ నా తొలి హిందీ చిత్రం. ఇందులో లెస్బియన్ పాత్రలో నటించా. సినిమా చూశాక చాలా మంది ఫోన్ చేసి అభినందించడం సంతోషంగా అనిపించింది. బోల్డ్‌గా నటించడానికి ఇబ్బంది లేదు. కానీ, వల్గర్‌గా ఉండే పాత్రలు మాత్రం చేయను. తాప్సీ నటించిన ‘బద్లా’కి, మా సినిమాకి పోలికే లేదు. సినిమా చూస్తే తెలుస్తుంది.
► ‘మహానటి’ చిత్రానికి కీర్తీసురేశ్‌కి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. అలాంటి పాత్రలు చేసే అవకాశం అందరికీ రాదు. ‘అ’ సినిమాకి జాతీయ అవార్డు రావడంతో నాని మెసేజ్ చేశారు. ఆ చిత్రానికి మేకప్ విభాగంలో ఇంద్రాక్షి పట్నాయక్‌కి కూడా జాతీయ అవార్డు రావడం సంతోషం. ‘అ’ సినిమాలో నా మేకప్‌కి ఎంతో శ్రమించారామె.
► అడివి శేష్ మంచి నటుడు. తనతో పని చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. సెట్‌లో సరదాగా ఎంజాయ్ చేశాం. ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్నా. తెలుగులో కూడా కొన్ని అవకాశాలున్నాయి.. ప్రొడక్షన్ వారే అధికారికంగా ప్రకటిస్తారు. హిందీలో కూడా త్వరలో ఓ సినిమా ఫైనల్ అవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment